EPAPER

Antiquities : యాంటిక్విటీల అప్పగింత ఇక సరళం

Antiquities : యాంటిక్విటీల అప్పగింత ఇక సరళం

Antiquities : పురాతన వస్తువులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇదో బిలియన్ డాలర్ల పరిశ్రమ. పురాతన, కళాఖండాల సేకరణ మార్కెట్ విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లు. దీనిలో 5% శాతం అక్రమ వ్యాపారమేనని అంచనా. చోరీ అయిన సాంస్కృతిక సంపద గురించి యునెస్కో, ఇంటర్‌పోల్ ఎప్పటికప్పుడు ఆర్ట్ కలెక్టర్లు, ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నాయి.


కొవిడ్ సమయంలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ బాగా ఊపందుకుంది. రెండేళ్ల వ్యవధిలో స్మగ్లింగ్ అయిన పురాతన వస్తువుల విలువ 10 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. ఎంతో విలువైన మన దేశ కల్చరల్ ప్రోపర్టీ అక్రమంగా సరిహద్దులు దాటేసింది. ఇండియన్ ఆర్ట్, పురాతన శిల్పాలకు డిమాండ్‌తో పాటు బలహీనమైన చట్టాలు, నిబంధనల వల్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది.

అలా విదేశాలకు చేరిన మన వారసత్వ సంపదకు వెనక్కి తీసుకురావడంలో ప్రభుత్వం గత పదేళ్లలో ఎంతో కృషి చేసింది. 2013-23 మధ్యకాలంలో మొత్తం 400 పురాతన వస్తువులు తిరిగి మనకు దక్కాయి. 2020 తర్వాత వెనక్కి రప్పించుకున్న వస్తువులే 291 వరకు ఉన్నాయి.


విదేశాలకు చేరిన పురాతన వస్తువులను తిరిగి రప్పించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. అందుకు ఎంతో సమయం పట్టేది. అయితే ఆ ప్రక్రియను సరళతరం చేసేలా అమెరికాతో మన దేశం ఒప్పందం చేసుకోనుంది. గతంలో సదరు వస్తువులు మన దేశానికి చెందినవేననే నిరూపించాల్సి వచ్చేది. అందుకు ఆధారంగా ఎన్నో పత్రాలను సమర్పించాల్సి వచ్చేది.

కల్చరల్ ప్రోపర్టీ అగ్రిమెంట్(CPA) అమల్లోకి వస్తే.. అలాంటి సుదీర్ఘ ప్రక్రియకు చెల్లుచీటీ ఇచ్చేయొచ్చు. అంతే కాదు.. ద్వైపాక్షిక సీపీఏతో సాంస్కృతిక సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న సమయంలో భారత పురాతన వస్తువులు ఏవైనా పట్టుబడిన వెంటనే అమెరికా అధికారులు తిప్పి పంపుతారని, ఇది సీపీఏలో భాగమని వివరించారు.

మరికొన్ని నెలల్లోనే కల్చరల్ ప్రోపర్టీ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత్ నుంచి చోరీ అయిన చోళుల నాటి కంచు శిల్పాలు సింగపూర్ చేరాయి. వాటి ధ్రువీకరణ కోసం భారత పురాతత్వ శాఖ(ASI) బృందం ఒకటి అక్కడికి వెళ్లి.. వాటిని పరిశీలించనుంది. అలాగే మరో బృందం.. అమెరికా ఆధీనంలో ఉన్న 1414 పురాతన వస్తువుల పరిశీలన కోసం వెళ్లనుంది.

1977-79 మధ్యకాలంలో 3 వేల వరకు అపురూప కళాఖండాలు భారత్ నుంచి చోరీ అయ్యాయి. అదే దశాబ్దంలో 50 వేలకుపైగా స్మగ్లింగ్‌కు గురయ్యాయని యునెస్కో అంచనా. ఇలా చోరీ అయి.. అక్రమ మార్గంలో తమ దేశానికి చేరిన భారత కళాఖండాల్లో 400 వరకు అమెరికా మనకు తిరిగి అప్పగించింది.

అమెరికా ఇప్పటివరకు 40 దేశాలు, సంస్థలకు చెందిన 20 వేల వస్తువులను ఆయా దేశాలు, సంస్థలకు తిరిగి అప్పగించింది. వీటిలో పెయింటింగ్ లు, రాతి శవపేటికలు, విగ్రహాలు, నాణేలు, రాతప్రతులు వంటివి ఉన్నాయి. వాస్తవానికి అగ్రరాజ్యానికి అఫ్ఘానిస్థాన్, చైనా, కంబోడియా, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, జోర్డాన్, టర్కీ తదితర దేశాలతో 25 కల్చరల్ ప్రోపర్టీ అగ్రిమెంట్లు అమల్లో ఉన్నాయి.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×