Big Stories

Odisha Train Accident : వేగంగా పునరుద్ధరణ పనులు.. 51 గంటల్లోనే అందుబాటులోకి ఒక మార్గం..

Odisha Train Accident : ఒడిశాలో రైలు ప్రమాదం తర్వాత యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టిన రైల్వే సిబ్బంది.. ఎట్టకేలకు కొంత మేర పనులు పూర్తి చేశారు. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపైకి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 3 రైల్వే డివిజన్ల అధికారులు, వేలమంది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించారు. మరమ్మతులు పూర్తి చేశారు.

- Advertisement -

పునరుద్ధరించిన పట్టాలపై ఆదివారం రాత్రి తొలి గూడ్సు రైలు రాకపోకలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. డౌన్‌లైన్‌ పునరుద్ధరణ పూర్తయిందని రైల్వేమంత్రి తెలిపారు. మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపిస్తామన్నారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. శరవేగంగా రైల్వే లైనును పునరుద్ధరించిన సిబ్బందిని, అధికారులను అభినందించారు.

- Advertisement -

అశ్వినీ వైష్ణవ్‌ 2 రోజుల నుంచి అక్కడే మకాం వేసి రైలు పట్టాల పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. 1500 మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు నిర్విరామంగా క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారు.

మరోవైపు ఈ ప్రమాదం కారణంగా వివిధ స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పూరి-హౌరా మధ్య 3 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 7 వరకు మొత్తం 123 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. మరో 56 రైళ్లను దారి మళ్లించింది. 10 రైళ్లను గమ్యస్థానాలకు చేరుకోవడానికి ముందే నిలిపివేసింది. 14 రైళ్లను రీషెడ్యూల్ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News