Jharkhand: అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి అనేక వివరాలను డిమాండ్ చేసి నిగ్గుతేల్చడానికి ప్రయత్నాలు చేస్తాయి. అయితే, ఇవి రాజకీయ రూపు దాల్చి పార్టీ ప్రయోజనాలుగానూ మారిపోతుంటాయి. తెలంగాణలో అంశాల వారీగా జరగాల్సిన చర్చ కాస్త రసాభాసగా మారిపోయింది. ఇదే తీరు జార్ఖండ్ అసెంబ్లీలోనూ కనిపిస్తున్నది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేల తీరు సభ సజావుగా సాగడానికి అంతరాయంగా మారింది. దీంతో స్పీకర్ 18 మంది ఎమ్మెల్యేలను ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు సస్పెండ్ చేశారు. అయినా.. వారు అసెంబ్లీ హాల్ నుంచి కదలకపోవడంతో వారిని బయటికి పంపించాలని మార్షల్స్‌ను ఆదేశించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా జార్ఖండ్‌లో నియంతృత్వం రాజ్యమేలుతున్నదని అసెంబ్లీ ప్రతిపక్ష నేత అమర్ బౌరి ఆరోపించారు.
నిన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలని నేడు మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే వారు వెల్‌లోకి దూసుకొచ్చారు. నినాదాలు చేస్తూ.. సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని కాగితాలను కూడా చింపి ఎగరేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రతిపక్ష చట్టసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఈ గందరగోళ పరిస్థితులు కొనసాగడంతో స్పీకర్ మహతో 18 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Also Read: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సిరాజ్, నిఖత్‌కు గ్రూప్ -1 పోస్టులు
అయినా, వారు అసెంబ్లీ హాల్ బయటకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో వారిని బయటికి తీసుకెళ్లాలని స్పీకర్ మహతో.. మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి అసెంబ్లీ లాబీలోనే గడిపారు. హేమంత్ సోరెన్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. నిరుద్యోగం వంటి కీలకమైన అంశాలపై తాము ప్రశ్నలు వేశామని, కానీ, వాటికి సమాధానం ఇవ్వడానికి సీఎం హేమంత్ సోరెన్ నిరాకరించారని, ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందేనంటూ అక్కడే ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణ చేసి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.