Asha Kiran Home: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ చేస్తున్న ఒక చిన్నారుల ఆశ్రమంలో.. 20 రోజుల్లో 14 మంది చనిపోవడం మిస్టరీగా మారింది. రోహిణీ ప్రాంతంలో ఉన్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో జరుగుతున్న ఘటన ఇది. హోం సాంఘిక సంక్షేమశాఖ కింద నడుస్తున్న ఈ ఆశ్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి 27 మంది మరణించారు. వారిలో అధికశాతం మంది మానసిక వికలాంగులే కావడం గమనార్హం. వారి మరణాలు కారణాలు కూడా తెలియరాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆశాకిరణ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో గడిచిన 20 రోజుల్లో 14 మంది మరణించడంపై వార్తలు రావడంతో.. విపక్షాలు ఆందోళనలు చేశాయి. దాంతో ఆప్ ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రి అతిశీ స్పందిస్తూ.. దేశరాజధానిలో ఇలాంటి ఘటన జరగడం తనను షాక్ కు గురిచేసిందన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేశాక.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే 48 గంటల్లో దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నత అధికారులను ఆదేశించారు.
జాతీయ మహిళా కమిషన్ సైతం దీనిని తీవ్రంగా పరిగణించింది. NCW ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఫ్యాక్ట్ చెక్ బృందాన్ని ఆ ఆశ్రమానికి పంపినట్లు తెలిపారు. పిల్లలకు మురికి నీరు తాగిస్తున్నారని, ఆహారం, చికిత్స కూడా సరిగా అందించకపోవడంతోనే పిల్లలు చనిపోతున్నారని బీజేపీ ఆవేదన చెందింది. ఆశ్రమం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు బీజేపీ శ్రేణులు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మానసిక వికలాంగ చిన్నారుల మరణాలకు కారణమైన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.