Srinagar Grenade Attack: అసలే ఆదివారం. మార్కెట్ అంతా సందడి సందడిగా ఉంది. ఎటు చూసినా వేలల్లో జనాభా ఉన్నారు. ఈ మార్కెట్ ఉన్నది ఎక్కడో కాదు టూరిజం కార్యాలయం సమీపంలోనే. అంతలోనే భారీ పేలుడు. ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఇంకేముంది ప్రజల ఉరుకులు, పరుగులతో మార్కెట్ భయానకంగా మారింది. ఈ ఘటన జరిగింది శ్రీనగర్ లో కాగా, ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ ధాటికి 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
శ్రీనగర్ లోని జమ్మూ కాశ్మీర్ టూరిజం కార్యాలయం సమీపంలో ప్రతి ఆదివారం సండే ఫ్లీ మార్కెట్ నిర్వహించడం ఆనవాయితీ. దీనితో ఆదివారం రోజు ఈ మార్కెట్ క్రయవిక్రయాలతో సందడిగా ఉంటుంది. వేల సంఖ్యలో ప్రజలు మార్కెట్ కు రావడం పరిపాటి. ఇదే అదునుగా భావించిన ఉగ్రవాదులు, ఆదివారం రద్దీగా, సండే మార్కెట్ ఉన్న సమయంలోనే గ్రెనేడ్ ను హఠాత్తుగా విసిరి వేశారు.
మార్కెట్ లో పేలుడు సంభవించడంతో, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బాంబులు ఎటువైపు నుంచి పడుతున్నాయో అంటూ మార్కెట్లోని ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే మార్కెట్ లో బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మార్కెట్ కు చేరుకున్నాయి. అలాగే వైద్య బృందాలు కూడా చేరుకుని గాయపడ్డ పది మందికి చికిత్స అందించారు.
నిరంతరం భారీ బందోబస్తు ఉండే టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ సమీపంలో గ్రానైట్ దాడి జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాగా శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో పాకిస్తానీ అగ్ర కమాండర్ ను భద్రతా దళాలు మట్టుపబెట్టిన ఒకరోజు తర్వాత ఈ ఘటన జరగడంతో భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి.
ఇంతకు ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. అదృష్టవశాత్తు గ్రెనేడ్ ప్రజలపై విసిరి వేయలేదని, లేకుంటే ఇప్పటికే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్రం పూర్తి వివరాలను ఆరా తీస్తోంది. అలాగే శ్రీనగర్ లో భద్రతను పెంచాలని కేంద్రం ఆదేశించింది.