EPAPER

Bed Bugs : జాగిలాలతో నల్లులకు చెక్!

Bed Bugs : జాగిలాలతో నల్లులకు చెక్!
Bed Bugs

Bed Bugs : నల్లిలా నలిపేస్తా! ఆగ్రహం పట్టలేనప్పుడు ఎవరైనా చెప్పే డైలాగ్ ఇదే. అయితే చెప్పినంత సులువు కాదని ప్రముఖ పర్యాటక దేశం ఫ్రాన్స్ చెబుతోంది. ఆ బుల్లి కీటకం కనిపిస్తే చాలు.. ఇప్పుడా దేశం వణికిపోతోంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో.. ఈ నల్లుల బెడద ఏమిటా? అని ప్రభుత్వం తలపట్టుకొంటోంది.


ముఖ్యంగా రాజధాని పారిస్‌లో నల్లులు విజృంభిస్తున్నాయి. పారిస్ హోటళ్లు, ప్రజారవాణా సాధనాలు, సినిమా హాళ్లు.. ఒకటేమిటి? నగర‌వ్యాప్తంగా ఎక్కడ చూసినా నల్లుల వ్యాప్తి కనిపిస్తోంది. పారిస్ మెట్రోతో పాటు ఇతర రైళ్లలో బెడ్‌బగ్స్ కనిపించాయంటూ పది మంది ట్రావెలర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపక్ష నేతలైతే పార్లమెంట్‌కు నల్లులను తీసుకొచ్చి మరీ ప్రదర్శించారు. సర్కారు నిష్క్రియాపరత్వాన్ని ఎండగట్టారు. దీంతో నల్లులను గుర్తించేందుకు ప్రభుత్వం జాగిలాలను రంగంలోకి దించింది.

వాస్తవానికి వేసవిలో నల్లుల సమస్య అతి సాధారణ విషయమే. కానీ ఈ సారి ఫ్రాన్స్‌లో బెడ్ బగ్స్ తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. దుస్తులు, దైనందిన వస్తువులకు అతుక్కుపోయి ఒక చోట నుంచి మరో చోటుకి ఇవి వ్యాప్తి చెందుతాయని ఎంటమాలజిస్టులు చెబుతున్నారు. సైజు వల్ల వాటిని గుర్తించడం కూడా కష్టమేనంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నల్లుల వల్ల ప్రజారోగ్యానికి ఎంతో చేటు.


1940-50 మధ్యకాలంలో డీడీటీ వంటి క్రిమిసంహారక మందుల విస్తృత వాడకంతో ఇవి దాదాపు అంతమయ్యాయి. అయితే బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అవి మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. పర్యావరణంపై డీడీటీ ప్రతికూల ప్రభావం కారణంగా.. దానిని నిషేధించిన నేపథ్యంలో బెడ్‌బగ్స్ మళ్లీ వ్యాప్తి చెందుతున్నట్టు అనుమానిస్తున్నారు.
క్రిమిసంహారక మందులకు నిరోధకత పెరగడం, మనుషుల జీవనశైలిలో మార్పుల వల్ల కూడా ఇవి వృద్ధి చెంది ఉంటాయని భావిస్తున్నారు.

5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఎర్రటి-గోధుమ వర్ణంలో ఉండే ఈ చిన్న పురుగులు పరాన్నజీవులు. మనిషి రక్తాన్ని పీల్చడంతో పాటు ఆహారం కోసం కోళ్లు, గబ్బిలాలు, ఎలుకలు వంటి జంతువులపైనా ఆధారపడతాయి. నల్లులు ఆహారం లేకుండా ఆరు నెలల వరకు జీవిస్తాయి. మనల్ని కుట్టకుండా 12 నెలలైనా బతికేస్తాయి. అందుకే వీటిని నిర్మూలించడం అంత తేలిక కాదు.

బెడ్‌బగ్స్ రక్తాన్ని పీల్చేటప్పుడు, అది గడ్డకట్టకుండా నిరోధించేందుకు వాటి లాలాజలాన్ని లోపలికి పంపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల కొందరికి ఎలాంటి రియాక్షన్లు ఉండవు. కానీ కొందరిలో తీవ్రమైన అలర్జీలను కలిగిస్తాయి. ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడే దద్దుర్ల వంటివి నల్లి కాటు వల్ల కూడా ఏర్పడతాయి.

వాటితో దురద, మంట కలుగుతాయి. దురద కారణంగా తరచుగా రుద్దడం వల్ల ఏర్పడే గాయాలు ఇన్‌ఫెక్షన్లుగా మారతాయి. ఇవి తీవ్రంగా మారి, చికిత్స చేయడం కూడా కష్టమవుతుంది. ఇవి బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయి. వారు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. నల్లుల నివారణకు ఉత్తమ మార్గం.. వాటి ప్రవేశాన్ని నిరోధించడమే.

నల్లులను పారదోలేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం తాజాగా జాగితాలను రంగంలోకి దింపింది. బెడ్‌బగ్స్‌ను గుర్తించడంలో స్నిఫర్ డాగ్స్ ఎంతో సాయపడతాయని అధికారులు చెబుతున్నారు. పారిస్ మెట్రో, థియేటర్లు, ఎయిర్‌పోర్ట్‌లలో నల్లులు పాకుతుండటంపై సోషల్ మీడియాలో వీడియోలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రయాణించేటప్పుడు సీట్లలో కూర్చుకునేందుకు సైతం వారు జంకుతున్నారు.

Related News

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×