TB Problem: భయంకరమైన రోగాల్లో క్షయ వ్యాధి కూడా ఒకటి. ఇది వచ్చిందంటే మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది. గుమ్మడి పండులా ఉన్న మనిషి కూడా క్షయ వ్యాధి బారిన పడి ఎముకల గూడులా మారిపోతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం గతేడాది 80 లక్షల మంది కొత్తగా క్షయ వ్యాధి బారిన పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్ దేశాలతో పాటు భారతదేశం, చైనా, ఫిలిఫ్పీన్స్, ఇండోనేషియా, పాకిస్తాన్ లో ఎక్కువగా ఈ టీబీ కేసులు నమోదు అవుతున్నాయి.
ప్రతి ఏటా క్షయ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 2022లో 75 లక్షల మందికి ఈ క్షయ వ్యాధి ఉండేది. ఇప్పుడు 2023లో 80 లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. ఇలా చూస్తే ప్రతి ఏటా టీబీ బారిన పడి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు గత సంవత్సరం పన్నెండున్నర లక్షల మందికి పైగా ప్రజలు క్షయ వ్యాధి కారణంగానే మరణించారు. దీంతో టీబీ ప్రపంచంలోనే ప్రాణాంతక వ్యాధిగా మారిపోతుంది.
క్షయ అంటే ఏమిటి
క్షయ వ్యాధి అంటే ఊపిరితిత్తులకు సోకే ఒక ప్రాణాంతక సమస్య. ఇది ఊపిరితిత్తులు ఇతర కణజాలాలకు సోకుతుంది. అలాగే వెన్నెముక, మెదడు, మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు వారి నోట్లోంచి వచ్చే గాలి, నీటి తుంపరలు వంటి వాటి ద్వారా మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. ఆ సూక్ష్మక్రిములు చిన్న చిన్న బిందువుల రూపంలో గాలిలోకి చేరుతాయి. అవి ఆరోగ్యకరమైన వ్యక్తి పీల్చినప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. అతడి ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. కాబట్టి క్షయ వ్యాధితో బాధపడే వారికి దూరంగా ఉండడం ఎంతో మంచిది.
Also Read: కలబంద హెయిర్ సీరమ్‌తో కురుల సిరులను పెంచుకోండి!
క్షయ వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్ కొలోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లో చేరి అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు వారి శరీరంలో చేరాక రెండు నుంచి మూడు వారాల్లోనే కొన్ని రకాల లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. అయితే ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం మొదలుపెడితే, వేరే వ్యక్తులకు ఈ సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందడం ఆగుతుంది. లేకుంటే చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
క్షయ వ్యాధి లక్షణాలు
టీబీ బారిన పడిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా కొందరు వ్యక్తులు అనారోగ్యంగా ఉంటారు. వారిని దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దగ్గులో రక్తం కూడా పడుతుంది. అలాగే రాత్రిపూట చెమటలు పడతాయి. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. తీవ్ర అలసటగా, బలహీనంగా మారుతారు. ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. బరువు త్వరగా తగ్గుతారు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య చికిత్సను పొందండి.
క్షయ చూపించే లక్షణాలు అది ఏ భాగంలో సోకిందనే విషయంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ట్యూబర్ కొలొసిస్ బ్యాక్టీరియా ఊపిరితిత్తులనే ప్రభావితం చేస్తుంది. కొంతమందికి మాత్రం మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, చర్మం లో కూడా చేరవచ్చు. ఇలాంటి అప్పుడు అది చూపించే లక్షణాలు మారుతూ ఉంటాయి.