Bay Leaves Benefits : బిర్యానీ.. ప్రస్తుత కాలంలో దీని గురించి తెలియనివారు ఉండరు. పట్టణాల్లో ఎటుచూసినా బిర్యానీ సెంటర్లే దర్శనమిస్తుంటాయి. అయితే ఈ బిర్యానీలో వాడే ఆకుతోనూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిర్యానీ ఆకు వంటకాల్లో వేసుకుంటే రుచిని పెంచడంతో పాటు కొన్ని వ్యాధులను కూడా నయం చేస్తుందని చెబుతున్నారు. ఆయుర్వేదంలో పలు వ్యాధుల చికిత్సకు బిర్యానీ ఆకుని ఉపయోగిస్తారు. తేజ్ పత్తా, బే లీఫ్‌గా పిలిచే ఈ బిర్యానీ ఆకును ఎండబెట్టి పొడిచేసి టీలా చేసుకుని తాగితే జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్యులు అంటున్నారు. అంతాకాకుండా చర్మ సౌందర్యానికి ఈ ఆకు పొడి, నూనెను వినియోగిస్తారు.
అయితే దీనిని ఒక రోజుకు ఒక గ్రాము మించి తీసుకుంటే చెమట పట్టడం, అతి మూత్రవ్యాధికి కూడా దారి తీస్తుందని, అందుకే మితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం ద్వారా మన బాడీలో పేరుకున్న టాక్సిన్‌ను తొలగించి కడుపును శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని పోగొట్టి మన శరీరం ప్రొటీన్లను గ్రహించేలా చేస్తుంది, జీవక్రియ సాఫీగా ఉండేలా ఉపకరిస్తుంది. బిర్యానీ ఆకులో ఫ్లేవనాయిడ్స్, సపోనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు గాయాలు త్వరగా మానేలా చేస్తాయి. అంతేకాకుండా మెరుగైన బ్రెయిన్ పవర్, మధుమేహ నియంత్రణ, చెడు కొలెస్ట్రాల్‌కు చెక్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుముఖం వంటి ఎన్నో ప్రయోజనాలు బిర్యానీ ఆకుల వల్ల మనకు కలుగుతాయి.