దేశరాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల తరవాత గాలి కాలుష్యం మరింత పెరిగిపోయింది. సాధారణ సమయాల్లోనే ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డుపై వాహనాలు కూడా కనిపించకుండా దట్టంగా కాలుష్యంతో నిండిపోతుంది. ఇక దీపావళి వచ్చిందంటే ఢిల్లీ కాలుష్యంతో నిండిపోవాల్సిందే. ప్రతి ఏడాది పండుగ ముందే ప్రభుత్వం దీనిపై హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. క్రాకర్స్ పేల్చడంపై నిషేదం విధిస్తుంది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం రాజధాని నగరంలో క్రాకర్స్ పేల్చడంపై నిషేదం విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది.
కానీ ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు లెక్క చేయలేదు. ప్రాణాలకంటే తాత్కాలిక సంబురాలే ముఖ్యం అనుకున్నారో ఏమో కానీ ఇష్టానుసారంగా టపాకాయాలు పేల్చేశారు. ఫలితంగా వాటి వల్ల వచ్చిన దుమ్ము దూళికి గాలి నాణ్యత మరింత దిగజారడంతో రాజధానిలో పొగమంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు 361 AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) నమోదైంది. నిన్న 328 ఏక్యూఈ ఉండగా ఈరోజు ఉదయం వరకు అది గణనీయంగా పెరిగింది. దీంతో మళ్లీ నగరంలో రోడ్డుపై వాహనాలు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్ట్ డేటా ప్రకారంగా గత కొన్నేళ్లుగా దీపావళి తరవాత ఢిల్లీలో కాల్యుష్యం పెరిగిపోతుంది. ఈ డేటా ప్రకారంగా 2023లో దీపావళి రోజున 218 ఏక్యూఐగా నమోదైంది, 2022లో 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2018లో 281, 2017లో 431ఏక్యూఐగా నమోదైంది. మరోవైపు ఈ ఏడాది నగరంలోని చాలా ప్రాంతల్లో గాలి నాణ్యత 380 ఏక్యూఐ కంటే ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 400 దగ్గరకు చేరుకుంది. ఆర్కే పురంలో 398 ఏక్యూఐ నమోదైనట్టు సీపీసీబీ డేటా చెబుతోంది. అదే విధంగా ఢిల్లీలోని ఆనంద్ విహార్లో 395, అశోక్ విహార్లో387, బురారీ క్రాసింగ్ ప్రాంతంలో 395, చాందినీ చౌక్ 337, ద్వారక సెక్టార్ వద్ద 376గా ఎయిర్ క్వాలిటీ నమోదైంది.