Big Stories

India beat Bangladesh in 1st Test : తొలి టెస్టులో బంగ్లాపై భారత్ ఘన విజయం

India beat Bangladesh in 1st Test : రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది… టీమిండియా. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్… టెస్ట్ సిరీస్‌లో మాత్రం అదరగొడుతోంది.

- Advertisement -

6 వికెట్ల నష్టానికి 272 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌… 50 నిమిషాల్లోనే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకుంది. మూడో ఓవర్‌లోనే బంగ్లాకు సిరాజ్‌ షాక్‌ ఇచ్చాడు. మెహిదీ హసన్ ను ఔట్ చేశాడు. అయితే, మరోవైపు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ మాత్రం దూకుడు కొనసాగించాడు. 84 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కుల్‌దీప్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి బంగ్లా స్కోరు 8 వికెట్ల నష్టానికి 320. ఆ తర్వాత భారత బౌలర్లు బంగ్లాకు ఛాన్సివ్వలేదు. మరో మూడు ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లు తీసి… జట్టుకు విజయాన్ని అందించారు. 9వ వికెట్ కుల్‌దీప్‌కే దక్కగా… పదో వికెట్ అక్షర్ పటేల్ పడగొట్టాడు. దాంతో… 188 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది… టీమిండియా. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా, కుల్‌దీప్‌ యాదవ్ 3 వికెట్లు తీశాడు. సిరాజ్, ఉమేష్ యాదవ్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ ఆడిన భారత్… 404 పరుగులకు ఆలౌట్ అయింది. పుజారా, శ్రేయస్ అయ్యర్, అశ్విన్ హాఫ్ సెంచరీలు చేయగా… రిషబ్ పంత్, కుల్‌దీప్‌ యాదవ్ కూడా రాణించారు. ఆ తర్వాత బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్‌దీప్‌ యాదవ్ 5 వికెట్లు తీయగా, సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీశారు. బంగ్లాను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా… భారత్ రెండో ఇన్నింగ్స్‌ ఆడేందుకే మొగ్గుచూపింది. 2 వికెట్ల నష్టానికి 258 రన్స్ చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. పుజారా, గిల్ సెంచరీలతో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో 513 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌… 324 పరుగులకే ఆలౌటై… 188 రన్స్ తేడాతో ఓడిపోయింది. టెస్టులో మొత్తం 8 వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 40 రన్స్ చేసిన కుల్‌దీప్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News