Donating : నీకు ఉన్నదానిలో కొంతభాగం లేని వారికిచ్చి సహాయపడమని వేదం చెబుతోంది. స్మృతులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పురాణాలు-ఇతిహాసాలు కూడా దానగుణానికి మించిన దైవత్వం లేదని, ధర్మాన్ని రక్షించమని బోధిస్తున్నాయి. కృతయుగంలో తప్పస్సు, త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞయాగాలు, కలియుగంలో దాన, ధర్మాలు గొప్పవని పరాశరస్మృతి చెబుతోంది.
ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మానికి నువ్వు హానీ చేస్తే అది నిన్ను నాశనం చేస్తుందని మనుస్మృతి చెబుతోంది. శ్రీకృష్ణుడి గీతోపదేశం ఇచ్చిన సందేశం కూడా ఇదే. ధానధర్మాల వల్ల పుణ్యం లభిస్తుందా..స్వర్ణలోకంలో నాకు సింహాసనం లభిస్తుందా…అనే ఆలోచనల కన్నా మానవతా దృష్టితో ,వివేచనా ధర్మంతో ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంటుంది.
లక్ష ఎకరాలున్న భూస్వామి అయినా వేల కోట్ల ఆస్తి ఉన్న ధనవంతుడైనా తినేది గుప్పెడు మెతుకులే. పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో మనకు సంపదలు లభించి ఉండవచ్చు. అదృష్టదేవత కరుణించి ఉండవచ్చు. పదితరాలకు సరిపడేంత సంపద సమృద్ధిగా ఉండొచ్చు కానీ మనం మనుషులమనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.
భూమ్మీద వివేకం కలిగిన వాడు, ఆలోచించగల బుద్ధి ఉన్న ప్రాణి మనిషి మాత్రమే. నీతోపాటు సమాజంలో జీవిస్తున్న మనిషి ఆకలిబాధతో అలమటిస్తూ అమ్మా..అని కేక వేస్తే స్పందించాల్సిన అవసరం నీకు ఉంది. పశువులు, పక్షులు కూడా ఆహారాన్ని కలిసి పంచుకుంటాయి.
దాన ధర్మాల విషయంలో మరో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అధర్మఫలం వల్ల వచ్చే పాపాన్ని దానం చేసి పోగొట్టుకుందాం అనుకుంటే… ఆ దానం వల్ల మరింత పాపం సంభవిస్తుంది తప్ప పుణ్య ప్రాప్తి కలుగదు. దానం అనేది పుణ్య ఫలంతోనే చేయాలి. అంతేకాదు… కడుపు నిండిన వాడికి చేసే దానం వృధా. బ్రాహ్మడైనా సరే.. ఆకలి గొన్నవాడికీ, అవసరం ఉన్నవాడికి మాత్రమే దానం చేయాలి. అప్పుడే తగు ఫలితం లభిస్తుంది.
వేసవి కాలంలో బెల్లం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి.కాలానుగుణంగా పండ్లను కూడా దానం చేయాలని గ్రంధాల్లో చెప్పబడింది.కార్తీకమాసంలో అయితే చలి విపరీతంగా ఉంటుంది. కాబట్టి రగ్గులు, కంబళ్లు లాంటివి పేదలకు చేస్తే చాలా మంచిది.
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగా రము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు…ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయిం చింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.