MP Raghu Comments :
⦿ కేసీఆర్ ఫాంహౌస్‌లో.. కేటీఆర్ రేవ్ పార్టీల్లో
⦿ బీఆర్ఎస్ మూడో స్థానానికి దిగజారిపోయింది
⦿ ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లడం మా టార్గెట్
⦿ దీపావళి పొలిటికల్ బాంబులు పేలితే మంచిదే
⦿ అవి ఏ రేంజ్ టపాసులో చూద్దాం
⦿ ఇందిరమ్మ కమిటీలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం
⦿ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హైదరాబాద్, స్వేచ్ఛ: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని, ప్రజలు ఆ పార్టీకి మూడో స్థానం ఇచ్చారని అన్నారు. ఆ స్థానం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇక, రాజ్ పాకాల ఫాంహౌస్ పార్టీ కేసుపై స్పందిస్తూ, కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు, కేటీఆర్ రేవ్ పార్టీలకు తిరుగుతున్నారని విమర్శించారు.
మంత్రి పొంగులేటి చెప్పినట్టుగా, దీపావళికి కుక్కతోక పటాకులు పేలుతాయో, లేక సూతిల్ బాంబులు పేలుతాయో చూడాలంటూ సెటైర్లు వేశారు. చెప్పిన మాట ప్రకారం పొలిటికల్ బాంబులు పేలాలని, మీడియాలో స్పేస్ కోసం చెప్పడం కాదు, అమలు చేయాలన్నారు. అవినీతిపరులను అరెస్ట్ చేస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు రఘునందన్ రావు. ఆరు నెలల కిందట కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.1200 కోట్లు విడుదల చేసిందని వివరించారు. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపణలు చేశారు.
పంచాయతీ కార్యదర్శులు సొంతంగా డీజిల్, శానిటేషన్ కోసం మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. వారికి వచ్చిన జీతాలతో పాటు అప్పులు చేసి మరీ ఖర్చు చేశారని తెలిపారు. ఇందిరమ్మ కమిటీలపై స్పందించిన రఘునందన్, తమ అభిప్రాయాన్ని తీసుకోకుంటే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ సభలు పెట్టకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళనే ఎంపిక చేస్తామంటే కుదరదన్నారు. గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని కమిటీల ద్వారా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్న ఆయన, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చురకలంటించారు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ భాగస్వామ్యం కాలేదని, అసలు ఈ కమిటీలు చెల్లుబాటు కాదని, దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తామని స్పష్టం చేశారు రఘునందన్ రావు.