EPAPER

Middle East: మిడిల్ ఈస్ట్‌లో.. ప్రతీకార యుద్ధం తప్పదా?

Middle East: మిడిల్ ఈస్ట్‌లో.. ప్రతీకార యుద్ధం తప్పదా?

హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు దాదాపు యుద్ధ రూపాన్ని సంతరించుకున్నాయి. ప్రస్తుతం, లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జోరందుకున్నాయి. ఆగస్ట్ 25 తెల్లవారుజామున ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థానాలను లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు చెందిన 200 స్థావరాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బొల్లా వందలాది క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు యత్నించిందని, అందుకు ప్రతిస్పందనగా ఆ సంస్థ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్-ఐడీఎఫ్ చెప్పింది. లెబనాన్‌లో హిజ్బొల్లా కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లోని సామాన్య పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరించింది. ఈ పరిణామం తర్వాత, హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై సుమారు 320 రాకెట్లను ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి సంబంధించిన మొదటి దశ పూర్తయిందని కూడా పేర్కొంది.

హిజ్బుల్లా రాకెట్ దాడుల తర్వాత, లెబనాన్ సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌లో సైరన్‌ శబ్దాలు వినబడుతున్నాయి. దీనితో భారీ దాడి జరిగే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఐడీఎఫ్ అత్యవసర పరిస్థితిని విధించింది. హిజ్బుల్లా చేస్తున్న దాడులను ఎదుర్కోడానికి ఇజ్రాయెల్ వంద జెట్ విమానాలను రంగంలోకి దింపింది. వీటితో హిజ్బుల్లా రాకెట్, మిసైల్ దాడుల్ని తిప్పికొడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ప్రాణ నష్టం గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఇజ్రాయెల్ చెప్పిన దాన్ని బట్టి, హిజ్బుల్లా వైపు నేవీకి చెందిన ఒక సైనికుడు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు, ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది.


మరోవైపు తాజా పరిణామాలతో అత్యవసరంగా సెక్యూరిటీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే, తమ సీనియర్ కమాండర్ ఫౌద్ షుకుర్‌ను ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా చంపేసిందని, అందుకు ప్రతీకారంగానే తాము ఈ దాడులు ప్రారంభించామని హిజ్బొల్లా ఒక ప్రకటన విడుదల చేసింది. జులైలో లెబనాన్‌ రాజధాని బేరూత్‌ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఫౌద్ షుకుర్‌ చనిపోయారు. మరో వైపు, హిజ్బుల్లాతో దాడులు మొదలైనా.. నిఘా సంస్థలైన మొస్సాద్‌, షిన్‌బెట్‌ చీఫ్‌లు కైరోలో బందీల విడుదల చర్చలకు వెళ్లారు.

Also Read: ఇజ్రాయెల్, హిజ్బుల్లా వార్‌కు.. ఈజిప్ట్ చర్చలకు లింక్ ఏంటి?

ఇటీవల, ఇరాన్‌లోని టెహ్నాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపైన బాంబు దాడి జరిగి చనిపోయాడు. దీనికి, ఇజ్రాయెల్‌ను నిందించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. అప్పటి నుండీ హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య పోరాటంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. మరో యుద్ధం మొదలైతే మరింత మానవ హననం తప్పదన్న తీవ్ర భయాందోళనలు గతకొంత కాలంగా వ్యక్తమవుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడూ దాడులకు దిగిన హిజ్బుల్లా .. ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే, ఇజ్రాయెల్‌ను ఇలాంటి దాడుల నుండి రక్షించడానికి, ఆ ప్రాంతంలో అమెరికా తన సైన్యాన్ని, యుద్ధ నౌకల మొహరింపును పెంచింది. హిజ్బుల్లా తాజా దాడి తర్వాత, అమెరికా అధ్యక్షుడు మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఎలాంటి దాడి జరిగినా ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పిస్తామని అమెరికా పూర్తి హామీ ఇస్తోంది.

నిజానికి, హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల కంటే తీవ్రమైన దాడులు చేయడానికి సిద్ధపడిందన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌లో ఆకస్మికంగా 5 వేల క్షిపణలు ప్రయోగించగా దానికంటే ఎక్కువగా హిజ్బుల్లా 6 వేల క్షిపణులను రెడీ చేసుకుందని ఐడీఎఫ్ చెబుతోంది. ఇదే నిజమైతే అక్టోబర్‌ 7న హమాస్‌ చేసిన 5 వేల రాకెట్ల దాడి కంటే ఇది పెద్దది అవుతుంది. అన్ని వేల క్షిపణులు ఇజ్రాయెల్‌పై పడితే భారీ నష్టాన్ని చవి చూడక తప్పదు. అందుకే, ఇజ్రాయెల్ ముందస్తు దాడికి పాల్పడిందని తెలుస్తోంది. అయితే, లెబనాన్‌లోని హిజ్బుల్లా సంస్థకు ఇరాన్‌ నుంచి సైనిక శిక్షణ, ఆయుధ సరఫరా పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు సిరియా పాలకుల నుంచి కూడా సాయం అందుతోంది. లెబనాన్ పార్లమెంటుకు 2022లో జరిగిన ఎన్నికల్లో హిజ్బుల్లా 13 సీట్లు గెలవడం అక్కడ ఆ సంస్థకు ఉన్న పరపతిని తెలియజేస్తోంది.

అయితే, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారే ప్రమాదముంది. అంతేకాక, ఇజ్రాయెల్‌కు పెద్ద సమస్య హిజ్బుల్లాతోనే ఉంటుందని ఇజ్రాయెల్‌ కొంత కాలంగా అనుమానిస్తోంది. గతంలో లెబనాన్‌పై ఐడీఎఫ్‌ దాడులను నిలువరించేందుకు హిజ్బుల్లా గెరిల్లా పోరాటం చేయడమే దీనికి నిదర్శనంగా ఉంది. కాగా, మిడిల్ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, లెబనాన్, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధ నివారణకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని లెబనాన్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఇలాంటి, ఉత్కంఠ పరిస్థితుల్లో పలు ప్రశ్నలు నిద్రరానివ్వడం లేదు. లెబనాన్, ఇజ్రాయెల్‌ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా? గాజా శిథిలాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమేనా? బీరూట్, టెహ్రాన్‌లలో జరిగిన హత్యలకు ఇరాన్, హిజ్బుల్లాలు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాయా? లేక సంయమనం పిలుపును పాటిస్తాయా? అనేవి చర్చనీయాంశంగా మారాయి. దీని కంటే ముందు, అందరి దృష్టి హిజ్బుల్లాపై ఉంది. దీని సామర్థ్యంపై చర్చలు జరుగుతున్నాయి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×