EPAPER

Vikram S Private Rocket : భారత్ అంతరిక్ష రంగంలో నవ చరిత్ర

Vikram S Private Rocket : భారత్ అంతరిక్ష రంగంలో నవ చరిత్ర

Vikram S Private Rocket : ఆకాశం ఇక అందరిది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్‌లకు అవకాశాలు కల్పించేందుకు ఇస్రో తీసుకున్న నిర్ణయం దిగ్విజయమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ విక్రమ్ ఎస్.. నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లి సక్సెస్ సిగ్నేచర్ చేసింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ ఈ ప్రయోగానికి వేదికైంది.


భారత్ అంతరిక్ష రంగంలో నయా చరిత్ర షురువైంది. ప్రపంచాన్ని శాసించే మరో అంతరిక్ష విప్లవానికి ఇస్రో వేదికైంది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్‌లకు అవకాశాలు కలిపిస్తూ .. ఇస్రో తీసుకున్న నిర్ణయం గ్రాండ్ సక్సెస్ అయింది. శ్రీహరికోట రాకెట్ లాంఛింగ్ సెంటర్ నుంచి మొట్టమొదటిసారిగా తొలి ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించింది.విక్రమ్-ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగం విజయవంతం కావడంతో…. ఇస్రోలో సంబరాలు అంబరాన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్ S. సోమ్ నాథ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’.. విక్రమ్ ఎస్ రాకెట్‌ను రూపొందించింది. ఇస్రో, ఇన్‌ స్పేస్‌ సహకారంతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరిగింది. రాకెట్ బరువు – 545 కిలోలు, పొడవు – 6 మీటర్లు, పేలోడ్‌ సామర్థ్యం – 83 కిలోలు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ కావడం విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ స్పెషాలిటీ. తొలిసారిగా పంపిన ఈ రాకెట్ పేరు ప్రారంభ్. ఇందులో స్పేస్‌ కిడ్స్‌ ఇండియా , బజూమ్‌ క్యూ , ఎన్‌-స్పేస్‌ టెక్‌ కి చెందిన మూడు పేలోడ్ లను నింగిలోకి పంపించారు.


అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్‌ కుమార్‌ వెల్లడించారు. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టామన్నారు. ఈ రాకెట్‌ ప్రయోగం కోసం స్కైరూట్‌.. ఇటీవల 51 మిలియన్‌ డాలర్లు అంటే.. దాదాపు రూ.408 కోట్లు ఖర్చుచేసింది. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్‌, గూగుల్‌ బోర్డు సభ్యుడు శ్రీరామ్‌.. ఈ సంస్థకు పెట్టుబడులు సమకూర్చారు.

విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లిన పేలోడ్‌లలో ఒకటి విదేశీ సంస్థకు చెందినది కాగా.. రెండు మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్‌కిడ్జ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ‘ఫన్‌-శాట్‌’ పేలోడ్‌. దీనిని మన దేశంతో పాటు, అమెరికా, సింగపూర్‌, ఇండోనేసియా విద్యార్థులు రూపొందించారు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే ఇస్రో చేపట్టింది. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపినా, రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే. అంటే పూర్తిగా ఇది ప్రైవేట్ ప్రయోగం. దీనికి కేవలం ఇస్రో లాంఛింగ్ ప్యాడ్ ని మాత్రమే వినియోగించారు.

ప్రస్తుతం అంతరిక్ష రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ప్రయోగ ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రపంచ దేశాలు యత్నాలు వేగవంతం చేశాయి. పౌండు బరువున్న ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చాలంటే 2011లో నాసా 30వేల డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌ ఆ ఖర్చును 1,200 డాలర్లకు తగ్గించింది. భవిష్యత్తులో ఈ ధరలు తగ్గేకొద్దీ అంతరిక్ష మార్కెట్‌ మరింత విస్తరిస్తుంది. ఈ విషయాన్ని భారత్‌ కూడా గుర్తించింది. ప్రస్తుతం ఇస్రోకు కేటాయిస్తున్న 14వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవు. ఈ నేపథ్యంలో దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే సాధించిన తొలి విజయమే .. విక్రమ్ ఎస్ ప్రారంభ్ ప్రయోగం.

ఇప్పటికే అమెరికా, రష్యా, ఐరోపా దేశాల్లో బోయింగ్‌, స్పేస్‌ఎక్స్‌, ఎయిర్‌బస్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ వంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భారత్‌లో కూడా ఇస్రో బీహెచ్‌ఈఎల్‌ సహకారంతో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ తయారీకి వివిధ కంపెనీలను కలిపి కన్సార్టియం ఏర్పాటుకు యత్నిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాకెట్ల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచంలోనే భారత అంతరిక్ష రంగం ఆరోస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా స్పేస్‌టెక్‌ కంపెనీల్లో కేవలం 3.6శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి.

2019 నాటికి భారత అంతరిక్ష రంగం విలువ 7 బిలియన్‌ డాలర్లు. ఇది 2024 నాటికి దాదాపు 50 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. International market size of space activities ప్రస్తుతం 400 బిలియన్‌ డాలర్లు.. త్వరలోనే ఇది వన్ ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనాలున్నాయి. ఈ విభాగంలో అమెరికా అత్యధికంగా 56.4శాతం కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. కానీ, ఇక్కడ భారత్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం మన సొత్తు. కేవలం 75 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించింది. భారత్‌లో ఈ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భారత్‌లో ఇప్పటికే దాదాపు 50కుపైగా స్పేస్‌ స్టార్టప్‌లు ఇస్రో వద్ద రిజిస్టర్‌ అయ్యాయి. వీటిల్లో రాకెట్లు తయారు చేసేవి, ఉపగ్రహాలు నిర్మించేవి ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ పర్యవేక్షణలోని అగ్నికుల్‌ సంస్థ రాకెట్‌ ఇంజిన్లను నిర్మిస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ రాకెట్లను తయారు చేస్తున్నాయి. ఇక బెంగళూరుకు చెందిన బెలాట్రిక్స్ ఏరోస్పేస్‌ రాకెట్లను, ఉపగ్రహ ఇంజిన్లను రూపొందిస్తోంది. ఇక డిజంత్రా స్పేస్‌ ఉపగ్రహ విడిభాగాలను నిర్మిస్తోంది. భారత్‌ అంతరిక్ష విధానాలను ఇటీవల మరింత సరళీకరించింది. ఇస్రో అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదలాయిస్తోంది. మరోవైపు స్పేస్‌ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు 2020లో వచ్చిన పెట్టుబడులు 22 మిలియన్‌ డాలర్లు మాత్రమే.కాగా ఇవి 2021లో 198శాతం పెరిగి 67 మిలియన్‌ డాలర్లకు చేరాయి.

రాకెట్‌ ప్రయోగాలు మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌-MTCR ఒప్పందం కిందకు వస్తాయి. క్షిపణి టెక్నాలజీ వ్యాప్తిని నిరోధించే ఈ ఒప్పందంలో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాకెట్‌ ప్రయోగాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇన్-స్పేస్‌ అనే నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు కంపెనీలు భారత్‌లోని మౌలికవసతులను వినియోగించుకొనేలా ఇది సాయం చేస్తుంది. ప్రైవేటు సంస్థలకు , ఇస్రోకు మధ్య బ్రిడ్జ్ లా పనిచేస్తుంది.

స్పేస్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థల రాకతో భవిష్యత్తులో ఉపగ్రహాల వినియోగం భారీగా పెరగనుంది. కంపెనీలు సొంతంగా ఉపగ్రహాలు ప్రయోగించి.. డేటా మ్యాపింగ్‌, వాతావరణం అంచనా వేయడం, పారిశ్రామిక సర్వేలు, నీరు- ఇంధనం గుర్తించడం, వ్యవసాయం, రహదారులు, కమ్యూనికేషన్లు ఇలా విస్తృత అవసరాలకు వినియోగించవచ్చు. భవిష్యత్తులో డైరెక్ట్‌ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులోకి వస్తే.. సెల్‌టవర్ల వినియోగం నిలిపివేసే అవకాశం ఉంటుంది.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×