America President Election Process: అమెరికాలో అత్యంత కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడింది. నవంబర్ 5న పోలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్యే గట్టి పోటీ నెలకొన్నది. ఇప్పటికే ఇద్దరు ప్రధాన అభ్యర్థులు తమ ప్రచార పర్వాన్ని ముగించారు. అమెరికాలో మొత్తం 27 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి ప్రత్యక్ష, పరోక్ష పద్దతుల ద్వారా సుమారు 7 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా వాళ్లు రేపు ఓటింగ్ లో పాల్గొననున్నారు. అయితే, అమెరికా ఎన్నికల ప్రక్రియ చాలా విచిత్రంగా ఉంటుంది. భారత్ లో మాదిరిగా నేరుగా ప్రజలే పాలకులను ఎన్నుకోరు. మన ఎన్నికలతో పోల్చితే కాస్త కన్ ఫ్యూజన్ గా ఉంటుంది. ఒక్కోసారి ఓట్లు ఎక్కువగా వచ్చిన వాళ్లు కూడా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతారు. తక్కువ ఓట్లు వచ్చిన వారు గెలుస్తారు. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందంటే?
4 ఏండ్లకు ఓసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఏ సంవత్సరంలో ఏ రోజు పోలింగ్ నిర్వహించాలి? రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేయాలి? ప్రెసిడెంట్ ప్రమాణస్వీకారం ఎప్పుడు? అనేది ముందే నిర్ణయిస్తారు. నవంబర్ నెలలోని తొలి మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 5న ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
ఎన్నికల ఫలితాలు ఎప్పుడు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్, కమలా మధ్య పోటా పోటీ ఉంటే, తుది ఫలితాలు వచ్చే సరికి కనీసం రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు. ఒకవేళ 20 నాడు ఆదివారం అయితే, ఆ మరుసటి రోజు ప్రమాణస్వీకారం జరుగుతుంది.
అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ఎలా?
అమెరికాలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ఒకటి రిపబ్లిక్ పార్టీ కాగా, మరొకటి డెమోక్రటిక్ పార్టీ. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్ ఓటింగ్ ద్వారా తమ పార్టీల తరపున ఎవరు పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఈసారి రిపబ్లిక్ పార్టీలో ట్రంప్ నకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన పోటీలో ఉండగా, డెమోక్రటిక్ నుంచి కమలా హారిస్ బరిలోకి దిగారు. అమెరికా ఎన్నికల ప్రచారం భారత్ లో మాదిరిగా ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు ఉండవు. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు టీవీ డిబేట్లలో పాల్గొంటున్నారు.
ప్రజలు నేరుగా అధ్యక్షుడికి ఓట్లు వేయరు!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు చొప్పున 100 మంది సెనేటర్లు ఉంటారు. వాషింగ్టన్ లో ముగ్గురు సెనేటర్లు ఉంటారు. మొత్తం 103 మంది ఉంటారు. వీళ్లు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీలో ఓటు వేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. అమెరికాలో అన్నీ కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందుగానే ఎంపిక చేస్తారు. అమెరికాలో ప్రజలు నేరుగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కు ఓట్లు వేయరు. అయితే ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్ పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఈ ఓట్లన్నీ ఎలక్టర్లకు వెళతాయి. జనాలు డైరెక్ట్ గా వేసే ఓట్లు ఎక్కువగా వచ్చినంత మాత్రాన అధ్యక్షుడిగా విజయం సాధించరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు ప్రెసిడెంట్ గా ఎన్నిక అవుతారు.
ఇద్దరు అభ్యర్థులకు 269 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తే?
ఒకవేళ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా టై అయితే, కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఎంపిక విషయంలో సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు. భారతీయ ఎన్నికల విధానంతో పోల్చితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చాలా క్రిటికల్ గా ఉంటుంది.
Read Also: ఓటమిని ట్రంప్ అంగీకరించడా? 2020లో వైట్ హౌస్‌ని వీడి తప్పుచేశానని వివాదాస్పద వ్యాఖ్యలు!