Trump vs Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇండియానా (11), వెస్ట్ వర్జీనియా (4), కెన్టకీ (8), సౌత్ కెరోలీనా (9), ఫ్లోరిడా (30) రాష్ట్రాలతో పాటు మరో 13 రాష్ట్రాల్లో ట్రంప్ జెండా పాతారు. ఆయన ఈ 17 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఈ 17 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 177 ఎలెక్టోరల్ సీట్లు రిపబ్లికన్ పార్టీ ఖాతాలో చేరాయి.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏ పార్టీ అయినా మొత్తం 270 సీట్లు గెలవాల్సి ఉంటుంది. మరోవైపు ట్రంప్ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ వెర్మాంట్ (3), మసాచుసేట్స్ (11), మేరీల్యాండ్ (10), డెలావేర్ (3), కనెక్టికట్ (7), న్యూ జెర్సీ(14) రాష్ట్రాల్లో గెలుపొందారు. ఈ ఆరు రాష్ట్రాల్లో 44 సీట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే సంక్లిష్టమైన ఎన్నికలుగా పేరుందిన అమెరికా అధ్యక్ష పదవి రేసులో కమలా హ్యారిస్, ట్రంప్ కోసం గట్టిపోటీ నెలకొంది.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అతిచిన్న రాష్ట్రమైన వ్యోమింగ్ (3) , అర్కాన్సాస్(6), టెన్నెస్సె (11), ఓక్లాహోమా(7), అలబామా(9), మిస్సిస్సిపీ (6) రాష్ట్రాల్లో కూడా విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఆరు రాష్ట్రాల్లో ఎలెక్టోరల్ సీట్లు కలిపి మొత్తం 42 ఉన్నాయి. ఇవి ట్రంప్ కైవసం చేసుకున్నట్లే.
రిపబ్లికన్ పార్టీ కంచుకోటల్లో ఒకటైన ఇండియానా రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థి మాత్రమే గవర్నర్‌గా విజయం సాధిస్తున్నారు. ఇండియానాలోని మొత్తం ఎలెక్టోరల్ ఓట్లు గెలుచుకోవడానికి కమలా హ్యారిస్ అక్కడ ఎన్నికల ప్రచారం తీవ్రంగా చేశారు. అయినా ఫలితాల్లో ట్రంప్ పై చేయి సాధించారు. దీంతో కలిపి మొత్తం మూడు సార్లు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ పడగా.. 2016 లో ఆయన గెలిచారు. 2020 ఎన్నికలు ఆయన ఓడిపోయినా ఇండియానా రాష్ట్రం మాత్రం రిపబ్లికన్ పార్టీనే గెలిచింది. 2020లో రాష్ట్రంలోని 57 శాతం ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే బుధవారం రాత్రి 7 గంటలకు (అమెరికా సమయం) ఇండియానా ఫలితాలు వెలువడగా.. ట్రంప్ స్పష్టమైన మెజారిటీ సాధించారు.
అలాగే కెన్టకీ రాష్ట్రంలో కూడా వరుసగా మూడు సార్లు ట్రంప్ విజయం సాధించారు. ఈ రాష్ట్రంలోని మొత్తం 8 ఎలెక్టోరల్ ఓట్లు రిపబ్లికన్ పార్టీకే పడ్డాయి. 1996లో అప్పటి డెమొక్రాట్ అభ్యర్థి బిల్ క్లింటన్ మాత్రమే కెన్టకీలో గెలుపొందారు. ఆయన పదవికాలం ముగిశాక.. తరువాత ఎన్నికల్లో పోటీచేసిన డెమెక్రాట్ అభ్యర్థులెవరూ ఇక్కడ విజయం సాధించలేకపోవడం గమనార్హం. కెన్టకీ సెనేట్ లీడర్, రిపబ్లికన్ అభ్యర్థి మిచ్ మెక్‌కొన్నెల్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నా.. కెన్టకీ ఓటర్లు మాత్రం ట్రంప్‌నకే ఓటు వేయడం గమనార్థం. అంతకుముందు మిచ్ మెక్‌కొన్నెల్, ట్రంప్ తో కలిసి పనిచేశారు. రాష్ట్రంలో పన్నులు తగ్గించే విషయంలో, సుప్రీం కోర్టులో ముగ్గురు కన్జర్వేజివ్ జడ్డీలను నియమించే విషయంలో ట్రంప్, మిచ్ మెక్‌కొన్నెల్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ రాయటర్స్ కథనం ప్రకారం.. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆరిజోనా, జార్జియా, మిచిగాన్ , నెవాడా, నార్త్ కెరోలీనా, విస్ కాన్సిన్, పెన్నిల్వేనియా రాష్ట్రాలు.. ఎన్నికల్లో విజయానికి కీలకంగా మారాయి. ఇందులో జార్జియా ఎన్నికలు ఎవరు గెలిస్తే.. వారికి అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ అంశాలపై ప్రజలు సీరియస్ గా ఉన్నట్లు సర్వేల్లో తేలింది. జనాభాలో మూడు వంతు ఇతర దేశాల నుంచి వలసలు, అబార్షన్ వంటి అంశాలపై ఇరు పార్టీల తీరును బట్టి ఓటు వేస్తామని వెల్లడించారు. సర్వే ప్రకారం.. 73 శాతం జనాభా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలిపారు.
మరోవైపు ఎన్నికలు ముగిసే కాసేపు ముందు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిలడెల్ఫియా, డెట్రాయిట్ రాష్ట్రాల ఎలక్షన్స్ లో చీటింగ్ జరుగుతున్నట్లు తనకు తెలిసిందని ఆ పోస్ట్ లో రాశారు. 2020 ఎన్నికల్లో కూడా తనకు ఈ విధంగానే పెద్ద స్థాయిలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కానీ కమలా హ్యారిస్ మాత్రం అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ మరోసారి విజయం సాధిస్తే.. దేశం భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు.