Nigeria Kids Death Sentence| ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో నిరసనలు చేసే అధికారం ప్రజలకు ఉంది. కానీ తాజాగా ఒక ఆఫ్రికా దేశంలో నిరసన చేసిన కొంతమంది పిల్లలు ముఖ్యంగా టీనేజర్లకు ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోంది. వారిని జైల్లో పెట్టి ఆహారం ఇవ్వకుండా వేధిస్తోంది. అంతటితో ఆగక వారికి మరణ శిక్ష విధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వీరంతా కేవలం నిత్యావసరాల ధరలు భరించేలేనంతగా పెరిగిపోయాయని నిరసనలు చేసినవారు. ఆ మాత్రం దానికే ప్రభుత్వం వారి పట్లు అంత క్రూరంగా ప్రవర్తిస్తోంది. నైజీరియా దేశంలో మూడు నెలల క్రితం 76 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హింసాత్మకంగా ప్రదర్శనలు చేశారని, దేశద్రోహులని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి.. సమాజంలో అల్లర్లకు పాల్పడ్డారని పోలీసలు వీరిపై చార్జిషీట్ లో ఆరోపణలు చేశారు. ఈ 76 మందిలో 29 మంది టీనేజర్లు (14 నుంచి 17 వయసు కలవారు) ఉన్నారు.
గత శుక్రవారం వీరిని కోర్టులో విచారణ కోసం హాజరు పరిచారు. అయితే కోర్టులో విచారణ జరుగుతుండగా నలుగురు పిల్లలు స్పృహ తప్పి పడిపోయారు. వీరందరూ 90 రోజులుగా జైల్లో ఉన్నారని.. జైల్లో పోలీసులు ఆహారం ఇవ్వడం లేదని స్థానిక మీడియా తెలిపింది. దీంతో పిల్లల హక్కుల కార్యకర్తలు నైజీరియా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
నైజీరియాలో నిత్యావసరల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత కొన్ని నెలలుగా ప్రజలు ఆగ్రహంతో రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. ఆగస్టు నెలలో నిరసనలు చేస్తున్నవారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగం, ధరలు పెరిగిపోయి ప్రజలకు ఆహారం దొరకని పరిస్థితి ఉండడంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.
Also Read: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు
1970 దశకంలో నైజీరియా ప్రభుత్వం మరణ శిక్షని చట్ట బద్ధత చేసింది. కానీ 2016 నుంచి అక్కడి న్యాయస్థానాలు మరణశిక్షను అమలు పరచలేదు. అయితే తాజాగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా నిరసన చేసిన వారిని అక్కడి కోర్టులో మరణ శిక్ష విధించాలని బలంగా వాదనలు జరుగుతున్నాయి. కానీ నిరసనకారుల్లో 29 మంది టీనేజర్లున్నారు. వారిని కూడా మినహాయించకూడదని ప్రభుత్వ అడ్వకేట్ వాదించారు. అయితే పిల్లల అరోగ్య పరిస్థితిన గమనించిన కోర్టు వారికి 5900 అమెరికన్ డాలర్లు (ఒక్కొకరికి రూ.50000 భారత కరెన్సీలో) పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే అంత డబ్బు చెల్లించలేని పేదలు కావడంతో వారు బెయిల్ పై జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితి.
మైనర్ నిరసనకారుల లాయర్ అబుబకర్ కోర్టు తీరుపై మండిపడ్డారు. “ఇలాంటి పిల్లలకు మంచి విద్యను అందించే బాధ్యత మన దేశ ప్రభుత్వంపై ఉంది. అంతే కాని వారిని 90 రోజులుగా జైల్లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించడం క్రూరమైన చర్య. పైగా వారికి మరణ శిక్ష ఇవ్వాలని వాదిస్తున్నారు. వారు చెల్లించలేనంత మొత్తాన్ని బెయిల్ కండీషన్ గా పెట్టారు. ఇది చాలా అన్యాయం.” అని అన్నారు.
నైజీరియాకు చెందిన సామాజకి కార్యకర్త యెమి అడమోలెకున్ మాట్లాడుతూ.. “ప్రభుత్వ అధికారులకు పిల్లలను విచారణ చేసే అధికారం లేదు. చట్టప్రకారం ఇది చెల్లదు. ఇలాంటి విచారణ జరుగుతున్న నైజీరియా ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉన్నారు. ఆమె ఒక మహిళ, ఒక తల్లి కూడా. ఆమె పదవిలో ఉండగా.. ఇలాంటిది జరగడం చాలా సిగ్గుపడాల్సిన విషయం” అని అన్నారు.
అయితే ఈ విషయంలో పిల్లల హక్కుల కార్యకర్త, లాయర్ అకిన్ టాయోబలోగున్ మాట్లాడుతూ.. నైజీరియాలో మైనర్లకు మరణ శిక్ష విధించే చట్టాలు లేవు. ఫెడరల్ హై కోర్టులో మైనర్లకు ఉరి శిక్ష విధించాలనే వాదనలు చేయడం తప్పు. వారందరికీ 19 ఏళ్లు వయసు ఉందని ప్రభుత్వ అడ్వకేట్ నిరూపిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అని అన్నారు.
నైజీరియా దేశం ప్రపంచంలోని చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటి. అయినా అక్కడ నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం సమస్యలున్నాయి. దేశంలో 21 కోట్ల మంది జనాభా ఉండగా. ఎక్కువ మందికి సరిపడ ఆహారం దొరకడం లేదు. నైజీరియా కరెన్సీ నాయిరా విలువ దారుణంగా పడిపోయింది. పరిస్థితులు ఇంత దారుణంగా ఒకవైపు ఉంటే.. మరోవైపు రాజకీయ నాయకులు, అధ్యక్షుడి కుటుంబం బహిరంగంగా విలాస జీవితం గడుపుతున్నారని ఆరోపణలున్నాయి.