EPAPER

Moungi Bawendi : నోబెల్ విజేత.. పరీక్షలో ఫెయిల్!

Moungi Bawendi : నోబెల్ విజేత.. పరీక్షలో ఫెయిల్!
Moungi Bawendi

Moungi Bawendi nobel prize :పట్టు పడితే వదలరాదనేది పెద్దల మాట. చదువులోనూ అదే సూత్రాన్ని ఫాలో కావాలని నోబెల్ విజేత మౌంగి బవెండి యువతకు సూచిస్తున్నారు. ఆయనతో పాటు లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌ను రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎంపిక చేసింది. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో వారు చేసిన పరిశోధనలకు‌ ఈ అవార్డు వరించింది.


ఏ పని అయినా పట్టుదలతో చేస్తే జీవితంలో అపజయం ఉండదని బవెండి చెబుతున్నారు. ఆయన జీవితంలోనూ ఓ ఫెయిల్యూర్ ఉంది. కాలేజీలో కెమిస్ట్రీ తొలి పరీక్ష తప్పారు. 62 ఏళ్ల ట్యునీసియన్, ఎంఐటీ ప్రొఫెసర్ అయిన మౌంగి బవెండికి చిన్నతనం నుంచీ సైన్స్ అంటే మహా ఇష్టం. హైస్కూల్ వరకు ఆ సబ్జెక్ట్‌లో ఆడుతూ పాడుతూ అద్భుతమైన మార్కులనే తెచ్చుకున్నారు. కానీ 1970లో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరినప్పుడు చేదు అనుభవం ఎదురైంది.

కెమిస్ట్రీ తొలి పరీక్షను ఆయన గట్టెక్కలేకపోయారు. దాదాపు ఓటమి అంచున ఉన్నాననే భావన కలిగిందని బవెండి గుర్తు చేసుకున్నారు. తొలి ప్రశ్నకు ఆయన జవాబు రాయలేకపోయారు. రెండో ప్రశ్న అసలు అర్థమే కాలేదని చెప్పారు. చివరకు ఆ పరీక్షలో వందకు 20 మార్కులు మాత్రమే తెచ్చుకోగలిగారు. క్లాస్ లో అంత తక్కువ గ్రేడ్ అదే. కెరీర్ ఇక ముగిసినట్టేనా అని ఆయన ఎంతో మథనపడ్డారు. అయితే వెంటనే కోలుకున్నారు. తాను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోగలిగారు.


ఎలా చదవాలన్నదీ, పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలన్నదీ తనకు బోధపడిందని బవెండి వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ప్రతి పరీక్షలోనూ వందకు వంద మార్కులు తెచ్చుకున్నారు. పట్టుదలగా చదవాలని, అప్పుడే వైఫల్యాలు దరిచేరవని విద్యార్థులకు బవెండి సూచించారు. రసాయనశాస్త్రంలో మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌ ఆవిష్కరణలు నానోటెక్నాలజీలో విప్లవాత్మకంగా చెప్పుకోవచ్చు. వారి పరిశోధనల ఫలితంగా ఆవిష్కృతమైన క్వాంటమ్ డాట్స్ ప్రాధాన్యం అంతా ఇంత కాదు.

ఇప్పుడా సాంకేతికతను టీవీల నుంచి ఎల్ఈడీ లైట్ల వరకు ఎన్నో పరికరాల్లో వినియోగిస్తున్నాం. కణితులను తొలగించేందుకు వైద్యులు కూడా ఈ టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. క్వాంటమ్ డాట్స్ అనేవి అతి సూక్ష్మమైన నానో పార్టికల్స్.
మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. అయితే మూలకం నానోస్థాయికి చేరినప్పుడు.. సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్‌ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది.

సులువుగా చెప్పాలంటే.. రద్దీ లేని బస్సులో వెళ్లినప్పుడు మనం సీటులో కూర్చొని.. ధారాళంగా వచ్చే గాలిని పీలుస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంతో హాయిగా ప్రయాణిస్తాం. కానీ జనంతో బస్సు కిక్కిరిసిపోయినప్పుడు కొంత చిరాకుగా ఉంటుంది. అణువులకూ ఇదే సూత్రాన్ని వర్తింపచేయొచ్చు. మూలకం సైజును బట్టి అణువుల ధర్మాలుంటాయి. సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రానిక్, ఆప్టికల్, ఉత్ప్రేరక ధర్మాలు కూడా మారిపోతుంటాయి.

సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోలేని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్‌ కండక్టర్లుగా పనిచేయొచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం ఏమిటన్నదీ వారి పరిశోధనల ద్వారా వెలుగు చూసింది.

రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడమెలాగో మౌంగి బవెండీ 1993లో విజయవంతంగా నిరూపించారు. క్వాంటమ్ డాట్స్ వల్ల భవిష్యత్తులో ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్, సూక్ష్మ సెన్సర్లు, అతి పల్చటి సోలార్ సెల్స్, అత్యంత సురక్షితమైన ఎన్‌క్రిప్టెడ్ క్వాంటమ్ కమ్యూనికేషన్లు వంటివి క్వాంటమ్ డాట్స్‌తో సుసాధ్యమే.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×