EPAPER

Pakistan Government : పాక్‌లో పాలన గాడిన పడేనా..?

Pakistan Government : పాక్‌లో పాలన గాడిన పడేనా..?


Pakistan Government : ఇటీవల జరిగిన పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ ‘పాకిస్థాన్‌ తెహ్రీకే-ఇ-ఇన్సాఫ్‌’ బలపర్చిన అభ్యర్థులే అత్యధికంగా 101 స్థానాల్లో విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్థాన్ ముస్లీం లీగ్‌-నవాజ్ పార్టీకి 75 స్థానాలు, బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ’కి 54 సీట్లు, 17 ‘ఎంక్యూఎం-పీ’ పార్టీకి, మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు గెలిచాయి. 336 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో అక్కడ కేవలం 266 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 70 స్థానాలను మహిళలు, మైనారిటీలకు కేటాయిస్తారు.

ఎన్నికల తర్వాత ఏ పార్టీకీ అధికారం రాకపోవటంతో సంకీర్ణ సర్కారు ఏర్పాటు తప్పనిసరి కావటంతో అసలు కథ మొదలైంది. మొత్తానికి అనేక చర్చలు, సంప్రదింపుల తర్వాత నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో ఒకమాటమీదికి రాగలిగారు. ఈ ఒప్పందం మేరకు పాకిస్థాన్ ముస్లిం లీగ్‌-న‌వాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు, నవాజ్ షరీఫ్‌ సోదరుడైన షహబాజ్ షరీఫ్ (72) ప్రధాని పదవి, అందుకు ఒప్పుకున్నందుకు గానూ.. పీపీపీ కో-చైర్మన్‌ అసిఫ్‌ అలీ జర్దారీ (68) దేశాధ్యక్షుడు అయ్యేందుకు నవాజ్ షరీఫ్ సిద్ధపడ్డారు. ఈ ఒప్పంద వివరాలను పీపీపీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో మీడియాకు వెల్లడించారు.


అయితే.. ఎన్నికల సందర్భంగా ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ పార్టీలు.. ఎన్నికలు కాగానే ఊహించిన దానికంటే వేగంగా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావటం చాలామందికి ఆశ్చర్యం కలిగించినా.. దీనివెనుక ఉన్న కారణం సైన్యం రంగంలోకి దిగుతుందనే భయమేనని అందరికీ తెలుసు. నిజానికి మన మాదిరిగా అక్కడా జాతీయ అసెంబ్లీ కాలపరిమితి ఐదేళ్లయినా.. గత 76 ఏళ్లలో 31 ఏళ్లు సైనిక పాలనే నడిచింది. ఇంకా దరిద్రం ఏమిటంటే.. సైన్యం కారణంగా నేటి వరకు ఆ దేశంలో ఏ ప్రధానీ అయిదేళ్లు నిలకడగా పాలన చేసింది లేదు. ఆయూబ్‌ ఖాన్‌ (1958-69), యాహ్యా ఖాన్‌ (1969-71), జియా ఉల్‌ హక్‌ (1977-88), ముషారఫ్‌ (1999-2008) వంటి నియంతల పాలన అనుభవాలను గుర్తుంచుకునే అటు షరీఫ్, ఇటు బిలావల్ సంకీర్ణానికి ముందుకొచ్చారు.

ఇక.. తమ్ముడిని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టిన వెంటనే నవాజ్ షరీఫ్ వేగంగా పావులు కదపటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తన కుమార్తె, పీఎంఎల్‌-ఎన్‌ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌(50) పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి సీఎంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలను ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ బహిష్కరించటంతో తన కుమార్తె మరియం సీఎం అయ్యేలా నవాజ్ షరీఫ్ చక్రం తిప్పారు. అటు.. అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులూ నవాజ్ షరీఫ్ పార్టీకే దక్కాయి. నవాజ్ షరీఫ్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. ఆయన తన రాజకీయ వారసురాలిగా మరియంనే ప్రోత్సహించారు.

ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేశారు గానీ.. వీరేదో అద్భుతాలు చేస్తారనే అంచనాలు పాక్ సమాజంలో పెద్దగా లేవు. 11 ఏప్రిల్ 2022 నుంచి 14 ఆగస్టు 2023 వరకు గతంలో పీపీపీ, పీఎంఎల్‌-ఎన్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీరి పాలనా కాలంలో దేశంలో నిత్యావసరాలు, చమురు ధరలు అమాంతం పెరిగాయి. అప్పట్లో ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో భారత్ మీద పదేపదే నోరు పారేసుకోవటం ద్వారా మళ్లీ గెలవొచ్చని భ్రమపడినా.. జనం దానిని స్వాగతించలేదు. దేశంలో ఆర్థిక సంక్షోభం పోవాలంటే.. దాయాదితో మంచి సంబంధాలు అవసరమనే భావన అక్కడి విద్యాధికులు, వ్యాపారవేత్తలు, మేధావుల్లో పెరిగింది.

Read More: 26/11 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి.. లష్కరే తోయీబా ఇంటలిజెన్స్ చీఫ్ చీమా మృతి..

ఇక వర్తమానానికి వస్తే.. పాక్‌లో ద్రవ్యోల్బణం నానాటికీ పెరిగిపోతోంది. జనం ఆకలి కేకలు వేస్తుంటే.. ఆర్మీ అధికారులు మాత్రం లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కీలక సరిహద్దు రాష్ట్రమైన బలూచిస్థాన్‌లో పాక్ పాలకుల మీద తీవ్ర అసంతృప్తి ఉంది. తమ వనరులను దేశం వాడుకుంటూనే, తమను రెండవ తరగతి పౌరులుగా మార్చారనే భావన వారిలో బాగా పెరిగిపోయింది. విద్యుత్ కేంద్రాలన్నీ తమ రాష్ట్రంలోనే ఉన్నా.. కరెంటునంతా వేరే ప్రాంతాలకు సరఫరా చేస్తూ తమను మాత్రం చీకట్లో మగ్గిపోయేలా చేయటంపై అక్కడి పౌరులు.. పాక్ సైనికులు కనిపిస్తే దాడులే చేస్తున్నారు. ఇక.. మరో రాష్ట్రమైన గిల్గిట్ బాల్టిస్థాన్, మనవైపు ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ అక్కడి పాలకుల మీద ప్రజలకున్న భ్రమలు తొలగిపోయినట్లు కనిపిస్తున్నాయి. దీంతో సొంత పాలకులకు వ్యతిరేకంగా అక్కడ వేర్పాటు ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.

ఇదిలా ఉండగా, సింధ్, ఖైబర్ పఖ్తూంక్వా రాష్ట్రాల్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు తగినన్ని నిధుల విడుదల జరగటం లేదని, పాకిస్థాన్ ప్రభుత్వాలన్నీ పంజాబ్ రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాయనే భావన, తరచూ హింసకూ దారితీస్తోంది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, భారత్‌తో సంబంధాల్లో ప్రతిష్ఠంభన, వికటించిన చైనా దోస్తీ కొత్త ప్రభుత్వం పరిష్కరించాల్సిన ఇతర సమస్యలుగా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు కేసులతో జైలు పాలు కావటం, రాజకీయ అవసరాలే తప్ప.. దేశాభివృద్ధికి ఎలాంటి ఎజెండా లేని ఈ సంకీర్ణ ప్రభుత్వ పాలన ఎక్కువ కాలం సాగదని, మళ్లీ పగ్గాలు తమ చేతికే వచ్చే అవకాశమూ ఆ దేశ సైన్యంలో కనిపిస్తోంది.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×