EPAPER

Putin Nuclear Warning : అణు యుద్ధానికి సిద్ధమంటున్న రష్యా.. సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి ముప్పు తప్పదా ?

Putin Nuclear Warning : అణు యుద్ధానికి సిద్ధమంటున్న రష్యా.. సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి ముప్పు తప్పదా ?

putin nuclear warning news


Putin Nuclear Warning(Today’s international news): రష్యా అధ్యక్షుడు పుతిన్ పద్ధతి ఏమాత్రం మారలేదు… కదిలితే, మెదిలితే ఒకటే ప్రస్తావన.. అణుబాంబ్ ఉంది జాగ్రత్త అంటూ ఘాటైన హెచ్చిరికలు చేస్తూనే ఉన్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి రెండేళ్లు దాటుతుంది. ఈ రెండేళ్లల్లో, పుతిన్ నోట అణ్వాయుధం మాట వస్తూనే ఉంది. తాజాగా మరోసారి పుతిన్ అణుబాంబు బెదిరింపులకు దిగాడు. పాశ్చాత్య దేశాలు బహుపరాక్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అసలు, పుతిన్‌కు అణుబాంబు ప్రయోగం చేయగలడా..? అదే జరిగితే పరిస్థితి ఏంటీ ? పాశ్చాత్య దేశాలతో పాటు అణ్వాయుధాలున్న దేశాల ఎలా స్పందిస్తాయి..?

ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించడానికి రెడీగా ఉన్నామంటూ పదేపదే చెబుతూనే ఉన్నాడు. గత నెలలో పుతిన్ స్టేట్-ఆఫ్-ది-నేషన్ ప్రసంగంలో కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఉక్రెయిన్‌ యుద్ధంలో పాశ్చాత్య దేశాల జోక్యం పెరిగే కొద్దీ అది అణుయుద్ధానికి దారితీస్తుందని హెచ్చరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇదే మాటను మరోసారి స్పష్టం చేశాడు. రష్యా అణుయుద్ధానికి సాంకేతికంగా సిద్ధంగా ఉందని, ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపితే అది యుద్ధాన్ని గణనీయంగా పెంచడమేనని పుతిన్ మార్చి 13న పశ్చిమ దేశాలను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశాడు. రష్యాలో మార్చి 15-17 ఎన్నికలు జరుగుతుండగా.. మరో ఆరేళ్లు తనకు అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. అయితే, అణు యుద్ధం కోసం రష్యా పరుగెత్తడం లేదనీ.. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని అన్నాడు.


Also Read : మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికలు.. మరోసారి పుతినే పక్కా అంటున్న సర్వేలు..?

అయితే, పుతిన్ అణు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. రష్యా తన సార్వభౌమాధికారానికి, స్వాతంత్ర్యానికి ముప్పు కలిగితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని పుతిన్ ఈమధ్య కాలంలో పలుమార్లు చెప్పాడు. ఇక, రష్యా ఎన్నికల్లో పుతిన్ మరో ఆరేళ్ల పదవీకాలం పొందిన తర్వాత ఈ బెదిరింపులు మరింత ఎక్కువవుతాయి అనడంలో సందేహం లేదు. మరోవైపు, పుతిన్ మాటలను అమెరికా లైట్‌గా తీసుకోకపోయినప్పటికీ, ఉక్రెయిన్‌కి సహాయం చేయడంలో ఏమాత్రం వెనకాడమంటూ బైడెన్ చెబుతూనే ఉన్నారు. ఇక, రాబోయే అమెరికన్ ఎన్నికల్లో బైడెన్ గెలిచినా గెలవకపోయినా రష్యాను కంట్రోల్ చేయడంలో అమెరికా ఏమాత్రం ప్రభావం చూపుతుందో తెలియట్లేదు. ఈ మధ్య సీఎన్ఎన్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో రష్యా అణుబాంబు ప్రయోగించకుండా భారత్, చైనాలను అమెరికా మధ్యవర్తిత్వానికి పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఇది జరిగి రెండేళ్లు దాటిపోయింది. ఈ మధ్య కాలంలో పుతిన్ మళ్లీ మళ్లీ అణు ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు పుతిన్ చెప్పిందే చేస్తాడనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

మార్చి 13న రష్యాన్ స్టేట్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ కొన్ని కచ్ఛితమైన సూచనలు చేశారు. ఉక్రెయిన్‌ యుద్దభూమిలో అణ్వాయుధాలను ఉపయోగించడంపై మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగిన ప్రశ్నకు పుతిన్ బదులిచ్చారు. ప్రపంచం అణుయుద్ధం దిశగా ప్రయాణిస్తోందని తాను భావించడం లేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌ను ప్రస్తావిస్తూ… తీవ్రస్థాయి ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్న అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త బైడెన్ అని అభివర్ణించారు. ఈ కామెంట్లను బట్టి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే.. ఒకవేళ అమెరికా స్థిరంగా ఉండకుండా.. ఉక్రెయిన్‌లో ప్రత్యక్షంగా సైనికుల్ని దింపితే అణు ప్రయోగం తప్పదని చెప్పకనే చెప్పాడు పుతిన్. అయితే, పుతిన్ వ్యాఖ్యలపై U.N. సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ స్పందించారు. “ప్రపంచానికి స్పష్టమైన విపత్తు పరిణామాలు ఉంటాయని తప్పుడు సూచనలు ఇవ్వడం, భయాన్ని తీవ్రతరం చేసే వ్యాఖ్యలు చేయడాన్ని తప్పక నివారించాలి” అని అన్నారు.

వాస్తవానికి, పుతిన్ వ్యాఖ్యలు ఉక్రెయిన్‌లో తన ఆశయాలను కాపాడుకునే క్రమంలో వచ్చాయన్నది స్పష్టంగానే తెలుస్తోంది. యుద్ధంలో విజయం సాధించడానికి అన్ని మార్గాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నానని, పశ్చిమ దేశాలకు పుతిన్ సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రష్యా భద్రతా సిద్ధాంతానికి అనుగుణంగా, “రష్యన్ రాజ్య ఉనికికి, సార్వభౌమాధికారానికి, స్వాతంత్ర్యానికి” ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ఉపయోగించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా వ్యూహం స్పష్టంగా ఉందనీ… మేము దానిని మార్చలేమనీ పుతిన్ అన్నారు. ఇక, ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే NATO మిత్రదేశాల గురించి కూడా పుతిన్ స్పష్టమైన సూచనలు చేశారు. “రష్యాకు సంబంధించి మాకు రెడ్-లైన్ లేవని చెబుతున్న దేశాలు, రష్యాకు ఆ దేశాలపై ఎటువంటి రెడ్-లైన్లూ ఉండవని గ్రహించాలి” అని ప్రకటించారు. అంటే, ఉక్రెయిన్ యుద్ధంలో వేలు పెట్టకపోతే రష్యా కూడా అణుబాంబ్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉండదనీ.. లేకపోతే, నాశనం తప్పదని చెప్పకనే చెప్పాడు పుతిన్.

Also Read : ఎలక్టోరల్ బాండ్ డేటా వెల్లడించిన ఎన్నికల సంఘం.. భారీగా విరాళాలు

అయితే, లిథువేనియా విదేశాంగ మంత్రి, గాబ్రిలియస్ లాండ్స్‌బెర్గిస్ పుతిన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఇటీవల పశ్చిమ దేశాలు రష్యాకు రెడ్‌-లైన్ విధిస్తూ తమను తాము నిర్బంధించుకుంటున్నాయని కామెంట్ చేశారు. పాశ్చాత్య దళాలను ఉక్రెయిన్‌కు పంపే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యను కూడా లిథువేనియా మంత్రి స్వాగతించారు. ఈ వ్యాఖ్యల ప్రకారం, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ఎప్పుడైనా తమ దళాలను పంపే అవకాశం లేకపోలేదు. కానీ, యుఎస్ తన దళాలను ఉక్రెయిన్‌కు పంపడం లేదని బైడెన్ ఇటీవల వెల్లడించారు. కాగా, బైడెన్ చేసిన ప్రకటనలను పుతిన్ గుర్తించారు. U.S. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే, రష్యా అమెరికన్ దళాలను ఆక్రమణదారులుగా చూస్తుందని, దానికి అనుగుణంగా వ్యవహరిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. కొన్ని నాటో మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు సైన్యాన్ని మోహరించినప్పటికీ, అది రష్యా యుద్ధ గమనాన్ని మార్చదని పుతిన్ పేర్కొన్నారు. యుద్దభూమిలో ఇటీవలి రష్యా విజయాల నేపథ్యంలో, ఉక్రెయిన్, దాని పాశ్చాత్య మిత్రదేశాలు చివరికి రష్యా నిబంధనలపై యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉంటుందని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక.. ఇటీవల కాలంలో రష్యాపై ఉక్రేనియన్ డ్రోన్ దాడులు ఎక్కువయ్యాయి. ఈ చర్య రష్యాలో జరగబోయే మూడు రోజుల అధ్యక్ష ఎన్నికలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగమని పుతిన్ అన్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే మూడు రోజుల అధ్యక్ష ఎన్నికల్లో అసమ్మతులను అణిచేసి, తాను భారీ మెజారిటీతో గెలుస్తానని పుతిన్ చెప్పాడు. అయితే, మార్చి 13 తెల్లవారుజామున ఉక్రేనియన్ డ్రోన్‌లు జరిపిన మరో భారీ దాడిని రష్యా అధికారులు నిర్థారించారు. ఆరు ప్రాంతాల్లో 58 డ్రోన్‌లను ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, రష్యన్ భూభాగంలోని ఫెసిలిటీలపై డ్రోన్ దాడులతో పాటు, ఉక్రేనియన్ దళాలు సముద్ర డ్రోన్లు, క్షిపణులతో నల్ల సముద్రం ప్రాంతంలో రష్యా నావికా, వైమానిక ఆస్తులపై విజయవంతంగా దాడులను కొనసాగిస్తున్నాయి. ఈ దాడులు మాస్కో నౌకాదళ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నల్ల సముద్రంలో రష్యా కార్యకలాపాలను పరిమితం చేసేటట్లు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని మరింత ఉధృతం చేస్తోంది.

మరోవైపు, ఉక్రెయిన్ ఫిరంగి సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నానికి నాయకత్వం వహించడంలో అమెరికా, ఫ్రాన్స్ భాగస్వామ్యం దూకుడుగా ఉంది. డెన్మార్క్, ఫ్రాన్స్‌లతో పాటు వైమానిక దళ సామర్థ్య సంకీర్ణానికి సహ-నాయకత్వం వహిస్తోంది అమెరికా. అలాగే, జర్మనీ, ఫ్రాన్స్ నేతృత్వంలోని వాయు రక్షణ సామర్థ్య కూటమిలో చురుకుగా పాల్గొంటోంది. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండీ అమెరికా ఉక్రెయిన్‌కు అండగానే ఉంటోంది. మొదటి దశలోనే అమెరికా, స్విచ్‌బ్లేడ్ కమికేజ్ డ్రోన్‌లను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. అయితే.. అవి ఎంత విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయో స్పష్టంగా తెలియకపోయినా.. రెండేళ్ల క్రితం, ఉక్రెయిన్ పశ్చిమ క్రిమియాలోని రష్యా సైనిక స్థావరం, సెవాస్టోపోల్ సమీపంలోని వైమానిక స్థావరం, సెవాస్టోపోల్ నౌకాశ్రయంలోని ఓడలపై దాడి చేయడానికి కామికేజ్ డ్రోన్‌లను ఉపయోగించిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు, కూడా నాటో దేశాల సహాయంలో భాగంగా వచ్చిన డ్రోన్లు ఉక్రెయిన్‌కు కీలకంగా మారాయి. ఇటీవల రోజుల్లో రష్యా నగరాల్లో ఉక్రెయిన్ డ్రోన్ల దాడి మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిణామాన్ని రష్యా ప్రస్తుతం తీక్షణంగా పరిశీలిస్తోంది. మరో మూడు రోజుల్లో ఉన్న ఎన్నికలు ముగిసిన తర్వాత పుతిన్ ఎలా ప్రవర్తిస్తాడనేది సందేహాస్పదంగా ఉంది.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×