EPAPER

Indonesia Election 2024: మలయ ద్వీపానికి కొత్త అధ్యక్షుడు..!

Indonesia Election 2024: మలయ ద్వీపానికి కొత్త అధ్యక్షుడు..!

Prabowo Subianto claims victory in Indonesian election: దక్షిణాసియా దేశాల్లో అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేసియాలో గత బుధవారం నాటి అధ్యక్ష్య ఎన్నికల ఫలితాలు రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో సర్వేలు చెప్పినట్లుగానే ఆ దేశ రక్షణమంత్రి, అత్యంత వివాదాస్పదుడైన మాజీ సైనికాధికారి జనరల్‌ ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు.


నేడు గెలిచిన ప్రబోవో మరెవరో కాదు. గతంలో ఇండినేసియాను 30 ఏళ్ల పాటు పాలించిన సుహార్తోకు అల్లుడే. తొలుత సైన్యంలో ఉన్న ప్రబోవో.. మామ గారు అధ్యక్షుడు అయ్యాక.. సైన్యంలో ఉన్నత పదవులను అధిరోహించారు. చివరకు లెఫ్టినెంట్‌ జనరల్‌ కూడా అయ్యారు. 1997లో ఇండోనేసియాను వణికించిన విద్యార్థి ఉద్యమాన్ని దారుణంగా అణిచివేసి మామ మన్ననలు అందుకున్నాడు.

అప్పట్లో కనిపించకుండా పోయిన 20 మంది విద్యార్థి నేతల కిడ్నాప్ కూడా ఈయనే చేయించాడనీ, వారిని సైన్యం చిత్రహింసలు పెట్టిందనీ అప్పట్లో వార్తలొచ్చాయి. తూర్పు తైమూర్ హత్యల్లో ఇతని పాత్ర ఉందనే కారణంతో అప్పట్లో అమెరికా, ఆస్ట్రేలియా ఆయన తమ దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం కూడా విధించాయి. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రబోవో.. 1998లో దేశాధ్యక్షుడు, తన మామ మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత రాగానే.. జనంతో గొంతుకలిపి సుహార్తోను గద్దెదించటానికి ముందుకొచ్చి జనం దృష్టిలో పాత మచ్చలను తొలగించుకోగలిగాడు.


Read More: పుతిన్‌ను ధిక్కరిస్తే అంతే..

సుహార్తో తర్వాత ఇతగాడే.. ఆ దేశపు అధ్యక్షుడు కావాలని ఉవ్విళ్లూరాడు. అది సాధ్యం కాకపోవటంతో కనీసం సైనిక దళాల చీఫ్‌ పదవి అయినా దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు గానీ.. అది వర్కవుట్ కాలేదు. దీంతో తిక్కరేగిన ప్రబోవో.. నాటి దేశాధ్యక్షుడి భవనం మీదికి సైన్యంలోని తన అనుచరులను వెంటబెట్టుకుని దాడి చేయబోగా, అధికారులు అతడిని అరెస్టు చేసి లోపల పడేశారు. తర్వాత సైన్యం నుంచీ బ్రియావోను తప్పించారు. దీంతో అక్కడి నుంచి జోర్డాన్‌ పారిపోయి.. వ్యాపారం చేసుకుంటూ కాలం నెట్టుకొచ్చాడు.

2009 అధ్యక్ష ఎన్నికల నాటికి దేశానికి తిరిగొచ్చి.. సొంతంగా పార్టీ పెట్టుకొని మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణోపుత్రితో కూటమి ఏర్పరచి దేశ ఉపాధ్యక్ష పదవికి పోటీచేసి భంగపడ్డాడు. 2014, 2019 ఎన్నికల్లో ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ చేసినా చేదు అనుభవమే ఎదురుకావటంతో రెండడుగులు వెనక్కి తగ్గి, ఈ రెండు ఎన్నికల్లో తనపై గెలిచిన అధ్యక్షుడు జోకోవితో చేతులు కలిపి.. దేశ రక్షణమంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. వరుసగా రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్ష పదవికి పోటీచేయరాదనే నిబంధన కారణంగా జోకోవి తప్పుకోవాల్సిన రావటంతో 2024 ఎన్నికల్లో ప్రబోవోకు ఆ అవకాశం దక్కింది. గత ఎన్నికల వేళ.. తాను సైన్యం కోసం పనిచేసిన సంగతిని పదేపదే చెప్పుకున్న ప్రబోవో.. ఈసారి ఆ మాటే ఎత్తకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన అందరి కంటే ప్రబోవో కాస్త ముందుంటాడని అందరూ అనుకున్నారు గానీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 50.1 శాతం కనీస ఓట్ల మార్కును దాటి ఏకంగా 60 శాతం ఓట్లు సాధించి ప్రబోవో అందరినీ ఆశ్చర్యపరిచారు. వరుసగా రెండుసార్లు ఓడటంతో కొంత సానుభూతి, యువతకు ఇచ్చిన హామీలు అతడిని ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించేందుకు కారణమయ్యాయి. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నేతలను కాదని దుడుకు స్వభావం గల ప్రబోవోను ఓటర్లు గద్దెనెక్కించటంలో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాధ్యమాలు దోహదపడ్డాయి. ఆయన గత చరిత్ర తమకు అనవసరమని సర్వేల్లో యువత చెప్పుకొచ్చారు.

ఇండోనేసియా మొత్తం జనాభా 27.5 కోట్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం. ప్రపంచపు అతిపెద్ద ద్వీప దేశం. ఈ దేశంలో 17 వేల ద్వీపాలున్న ఈ దేశం 20 కోట్ల ఓటర్లతో ప్రపంచపు అతిపెద్ద మూడవ ప్రజాస్వామిక దేశంగానూ గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఆగ్నేయాసియాలో పారిశ్రామికంగా ముందున్న దేశమైన ఇండోనేసియా 2000 సంవత్సరం నాటికి పూర్తిగా కుదేలైపోయినా.. ఆ తర్వాత పుంజుకుని 2012 నాటికి జీ20 దేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నాల్గవ దేశంగా ఎదిగింది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత కాస్త ఆర్థికమాంద్యం, నిరుద్యోగం వంటి సమస్యలున్నా.. మొత్తంగా నిలదొక్కుకోగలిగింది.

నిజానికి ఈ దేశానికి దక్షిణ చైనా సముద్రపు సరిహద్దు విషయంలో చైనాతో పేచీలున్నా.. ఆర్థిక సంబంధాల మీద ఈ వివాదం ప్రభావం పడకుండా అక్కడి పాలకులు జాగ్రత్త పడుతూనే వస్తున్నారు. అదే సమయంలో అటు అమెరికా, భారత్ వంటి దేశాలతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తూ.. విదేశీపెట్టుబడులను ఆకర్షిస్తోన్న దేశంగా ఇది గుర్తింపు పొందింది.

కానీ.. ఆ దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ బలహీన పడటం మీద పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రబోవో తరపున దేశ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన గిబ్రాన్ అంశమే దీనికి ఉదాహరణ. అక్కడి చట్టం ప్రకారం.. ఉపాధ్యక్ష పదవికి పోటీచేసే వారికి 40 ఏళ్ల వయసు ఉండాలి. కానీ.. 36 ఏళ్ల తన అల్లుడి కోసం రాజ్యాంగ న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌గా వున్న గిబ్రాన్‌ మామ ఈ చట్టానికి సవరణకు సహకరించాడు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగి, ఆ జడ్డిని తొలగించాలనే డిమాండ్ వచ్చినా.. ఆ తీర్పు రద్దు కాలేదు.

గతం ఎలా ఉన్నా.. ఇండోనేసియా కొత్త అధ్యక్షుడైన ప్రబోవో మీద ఇప్పుడు అక్కడి వ్యవస్థలను బలోపేతం చేయటంతో బాటు ఆర్థికంగా దేశానికి కొత్త దిశానిర్ధాశం చేయాల్సిన బాధ్యతలు వచ్చి పడ్డాయి. వీటిని ఈ దుడుకు స్వభావం గల నాయకుడు ఎలా నిర్వహిస్తాడో వేచి చూడాల్సిందే.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×