Peanut Squirrel| అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ఉడత వల్ల అధికార పార్టీకి ఓట్లు తగ్గే ప్రమాదముంది. సరిగ్గా మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగా.. ఒక క్యూట్ ఉడతను హత్య చేసిన పాపం ప్రస్తుత డెమొక్రాటిక్ ప్రభుత్వానికి చుట్టుకుంది. ఇప్పుడా ఉడత సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ప్రభుత్వాధికారులు ఉడతను హత్య చేసినందుకు ప్రత్యర్థి పార్టీకి ప్రచారం చేస్తున్న బిలియనీర్ వ్యాపారవేత్త ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు.
వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల క్రితం న్యూ యార్క్ నగరంలో రోడ్డుపై ఒక ఉడత చనిపోయి ఉండగా.. దానికి పుట్టిన చిన్న పసి ఉడత తల్లిని కోల్పోయి చావుబతుకుల్లో ఉంది. అది చూసిన మార్క్ లాంగో అనే ఒక స్థానికడు ఆ ఉడతను తన ఇంటికి తీసుకొచ్చి దానికి పాలు పట్టించి కాపాడాడు. కొన్ని రోజులు తరువాత అది ఆరోగ్యవంతంగా కనిపించడంతో దాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. అయితే ఆశ్చర్యంగా ఆ ఉడత కొన్ని రోజుల తరువాత తిరిగి తన యజమాని మార్క్ లాంగో ఇంటికి చేరుకుంది. ఇది చూసిన మార్క్ దాని ఆప్యాయతను గమనించి తన ఇంట్లోనే పెంచుకుందామని నిర్ణయించుకున్నాడు. దానికి పీనట్ అని నామకరణం కూడా చేశాడు. ఆ ఉడత మార్క్ తో ఎంతో ప్రేమగా ఉండేది.
Also Read: గూగుల్‌కు భారీ జరిమానా విధించిన రష్యా .. 20 డెసిలియన్ డాలర్లు.. అంటే 2 తరువాత 34 జీరోలు!
రెండేళ్ల తరువాత మార్క్ అదే విధంగా ఒక అనాధ అయిన రాకూన్(పిల్లి శరీరంలో పోలిన నక్క) జంతువుని కూడా తన ఇంట్లోనే పెంచుకుంటూ ఉన్నాడు. తన జంతువులతో మార్క్ సరదాగా సమయం గడుపుతూ సోషల్ మీడియాలో వాటి వీడియోలు పోస్ట్ చేసేవాడు. ఇన్‌స్టాగ్రామ్ లో అయితే పీనట్ స్క్విరెల్ పేరుతో ఒక అకౌంట్ లో ఉంది. ఆ అకౌంట్ కు దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మార్క్ సంతోషం ఇటీవల ఆవిరైపోయింది. పీనట్, రకూన్ జంతువులను మార్క్ ఇంట్లో చూసిన కొందరు స్థానికులు అనిమల్ కంట్రోల్ (అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనివిరాన్‌మెంటల్ కన్‌జర్వేషన్)కు సమాచారం అందించారు.
దీంతో ప్రభుత్వాధికారులు ఆ జంతువులను పెంచుకునేందుకు మార్క్ కు అనుమతి లేదని చెప్పి తీసుకెళ్లి పోయారు. దీంతో మార్క్ వాటిని కోల్పోయి ఎంతో బాధపడ్డాడు. అయినా అవి సురక్షితంగా ఉంటాయని భావించాడు. కానీ రెండు రోజుల క్రితం ప్రభుత్వాధికారులు ఆ రెండు మూగజీవాలను హత్య చేశారు. కారణం.. వాటి వల్ల రేబీస్ వ్యాధి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు. ముఖ్యంగా పీనట్ ఉడత ఒక జంతు సంరక్షకుడిని కొరకడం వల్ల అతనికి ఇన్‌ఫెక్షన్ వచ్చిందని… దాంతో పీనట్, రకూన్ కారణంగా అందరికీ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదముందని భావించి ఆ రెండు జంతువులను యుథనైజ్ (కరెంట్ షాక్ తో కారుణ్య మరణం) చేశారు. ఈ విషయం తెలిసి మార్క్ పట్టరాని కోపంతో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టాడు. తాను మళ్లీ అనాధ జీవాలను పెంచుతానని.. వాటకి ఒక అనిమల్ సాన్చువరీ నిర్మిస్తానని ప్రతిగ్న చేశాడు. అందుకోసం సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు.
ఇంతటితో పీనట్ కథ ముగియలేదు. తాజాగా అమెరికా ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం మూగజీవాలను అకారణంగా హత్య చేసిందని.. ఇది అనాలోచిత నిర్ణయమని, వారికి మనసు అంటూ లేదా? అని బిలియనీర్ మస్క్ సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో పాటు స్టార్ వార్స్ చిత్రంలోని జెడై పోలికతో ఉన్న ఒక ఏఐ ఉడత ఇమేజ్ ని పోస్ట్ చేసి.. ఇక ప్రభుత్వం భరతం పట్టాలి అని రాశాడు.
పీనట్ మృతి పట్ల సోషల్ మీడియాలో చాలా మంది బాధపడుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో నవంబర్ 5న జరుగబోయే ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమొక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై ఉడత హత్య ప్రభావం ఉంటుదనడంలో సందేహం లేదు. అయితే ఇదంతా ఆమె ప్రత్యర్థి ట్రంప్ ఎంతవరకూ క్యాష్ చేసుకుంటారో చూడాలి.