EPAPER

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Israel-Palestine Conflict: ఏడు దశాబ్దాలుగా నిత్యం ఉద్రికత్తలకు కారణమవుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా వైరం పరాకాష్టకు చేరినట్లు కనిపిస్తోంది. నిరుటి అక్టోబర్ 7న హమాస్‌కు చెందిన పలువురు సాయుధులు ఊహించని రీతిలో మారణాయుధాలతో ఇజ్రాయెల్‌ వీధుల్లో వీరంగం వేశారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపారేసి గంటల వ్యవధిలో మారణహోమం సృష్టించారు. నాటి దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు, కొందరు విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరిని హమాస్ సాయుధులు గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. దీనిని తమపై జరిగిన యుద్ధంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. తీవ్రమైన ప్రతీకారేచ్ఛతో దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సేనలు పాలస్తీనా మీద విరుచుకుపడ్డాయి. అక్కడి ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇజ్రాయెల్ అనేకమంది హమాస్ నేతలను, సాయుధులనూ తుదముట్టించగా, ఈ పోరులో 42,000 పాలస్తీనియన్లు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్షలాది మంది ఇల్లూ వాకిలీ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.


Also Read: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

ఇదిలా ఉండగా, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతుగా ఇరాన్ రంగంలోకి దిగటంతో పాలస్తీనా సమస్య ఇప్పుడు మరింత జటిలంగా మారుతోంది. ఇజ్రాయెల్ ఏర్పడిన 1948లో ఏ ముస్లిం దేశమూ దాని ఉనికిని గుర్తించలేదు. కానీ, నాడు ఉదారవాద ఇస్లాంను అనుసరించే దేశంగా ఇరాన్ ముందుకొచ్చి ఆ దేశాన్ని గుర్తించింది. దానిని మిత్రదేశంగా ప్రకటించి, హత్తుకుని, మూడు దశాబ్దాల పాటు కలిసి నడిచింది. కానీ, అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం రావటంతో 1979 నాటికి ఇరాన్ షరియాను పాటించే పూర్తి ఇస్లామిక్ దేశంగా మారింది. దీంతో ఇరాన్‌లోని ఉదారవాద పార్టీలకు నూకలు చెల్లిపోగా, దేశంలోని యూదులంతా పారిపోవాల్సి వచ్చింది. ఖొమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను డెవిల్ దేశాలుగా పిలవటం, ఇజ్రాయెల్ శత్రుదేశాలైన సిరియా, యెమెన్, లెబనాన్‌లను చేరదీసి ఆయుధాలు అందించటంతో పాత స్నేహితులిద్దరూ పరమ శత్రువులైపోయారు. తాజాగా, హమాస్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటంలోనూ ఇరాన్ దూకుడుగా వ్యవహరించటంతో ఉభయ దేశాల మధ్యపచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఏర్పడింది.


ఇదిలా ఉండగా, ఈ నెల ఒకటో తేదీన ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఒక వీడియో విడుదల చేస్తూ, పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్న ఇరాన్‌కు రెండు హెచ్చరికలు చేశారు. అనుకున్నదే తడవుగా పశ్చిమాసియాలో ఏ మూలకైనా తాము చేరగలమన్నది మొదటిది కాగా, ఇరాన్‌లోని మత ఛాందస అతివాద నాయకత్వం వల్లనే ఆ దేశం పేదరికంలో కునారిల్లిపోతున్నదని, త్వరలోనే అక్కడి పాలకుల నుంచి ఇరాన్ పౌరులు స్వాతంత్ర్యాన్ని పొందనున్నారని నెతన్యాహూ హెచ్చరించారు. ఈ ప్రకటన వచ్చిన అరగంటలోపే ఇరాన్‌ అగ్ర నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని సైన్యం వెంటనే సురక్షిత రహస్య స్థావరానికి తరలించింది. అంతటితో ఆగకుండా, ఆ రాత్రే ఇరాన్ సేనలు 200 క్షిపణులతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగాయి. అయితే, ఆ మిస్సైళ్లను ఇజ్రాయెల్, ఆ దేశానికి అండగా వచ్చిన అమెరికన్ నౌకాదళం తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఇరాన్ పంపిన కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ నగరాలకు, అక్కడి సైనిక స్థావరాలకు నష్టం చేకూర్చాయి. ఈ దాడి అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఒక ప్రకటన చేస్తూ.. లోగడ హమాస్‌ నాయకుడు ఇస్మాయెల్‌ హానియేను తమ దేశంలోనే హతమార్చినందుకు, తాజాగా సీనియర్ సైనిక బ్రిగేడియర్‌ జనరల్‌ అబ్బాస్‌ నిల్ఫరోషాన్‌ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని, ఈ దాడులను ప్రస్తుతానికి ఆపుతున్నామని, ఇజ్రాయెల్ వైఖరిని బట్టి తాము మళ్లీ స్పందిస్తామన్నారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని, సేనాని స్పందిస్తూ, తమపై చేసిన దాడికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతానికి ఏ నిమిషంలో ఏం జరుగుతుందనే భయం పశ్చిమాసియాను వెంటాడుతోంది.

Also Read: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

ఇదిలా ఉంటే, గాజాలో ఇజ్రాయెల్‌ దూకుడుతో లక్షలాది పాలస్తీనియన్లు కాందిశీకులుగా మారారు. వీరంతా అత్యంత దీన స్థితిలో అక్కడి తాత్కాలిక నివాసాల్లో బతుకునీడుస్తున్నారు. మరోవైపు, గాజా మీద ఇక తమ సైనిక నియంత్రణ, శాశ్వత పర్యవేక్షణ కొనసాగుతాయని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. దీనిని ఐక్యరాజ్య సమితి వ్యతిరేకిస్తున్నా, వెస్ట్‌ బ్యాంక్‌‌లోని ప్రతి అంగుళం తమదేనని ఇజ్రాయెల్‌ మొండిగా వాదిస్తోంది. అదే సమయంలో పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన హమాస్‌తో బాటు లెబనాన్‌‌కు చెందిన హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాకీ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోనైతే ఇజ్రాయెలీ సేనలు నేరుగా భూతల యుద్ధాన్ని ప్రారంభించి, హిజ్బొల్లా స్థావరాలను నాశనం చేస్తున్నాయి. నాలుగు రోజుల నాటి ఇరాన్ దాడి తాలూకూ ఉద్రిక్తతలు ఇంకా సజీవంగా ఉండటంతో పశ్చిమాసియాలో యుద్ధ భయం నెలకొంది. పశ్చిమదేశాల ఆధిపత్యం, స్థానికంగా ఉన్న ఇస్లాం ప్రాబల్యం, చమురు అంశాలు కలిసి పశ్చిమాసియాను తగలబెట్టే మందుగుండుగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితిలో అనుమానిత అణుదేశమైన ఇరాన్, అప్రకటిత అణ్వస్త్ర దేశమైన ఇజ్రాయెల్‌లలో ఏది తొందరపడినా.. అది మూడవ ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉంది. నానాటికీ పెరుగుతున్న చమురు ధరలు, పశ్చిమాసియా తీరంలో నౌకల మీద దాడులు, ఇజ్రాయెల్ శత్రుదేశాలతో రష్యా దోస్తీ ఈ రాబోయే యుద్ధానికి సూచనలుగా కనిపిస్తున్నాయి. ఈ భయానక పరిస్థితిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మైత్రి, పరస్పర విశ్వాసం, బహుళత్వాన్ని గౌరవించాలనే సృహను ఇరాన్, ఇజ్రాయెల్ పెంపొందించుకోవాలి. లేకుంటే.. అన్నీ ఉన్నా ఏమీ లేని దేశాలుగా ఆ రెండు దేశాలు మిగలిపోవాల్సి రావటమే గాక, మొత్తం పశ్చిమాసియాను తెలిసి తెలిసి మంటల్లోకి నెట్టినట్లవుతుంది.

– గోరంట్ల శివరామకృష్ణ

Related News

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

Big Stories

×