North Korea Russia | దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. ఒకవైపు ఇండియా, చైనా లాంటి దేశాలు యుద్ధంలో సంధికోసం మధ్యవర్తిత్వం చేస్తుంటే.. మరోవైపు నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేస్తూ.. యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు మద్దతుగా యుద్ధ రంగంలో ఉత్తర కొరియా దూకింది. రష్యాను ఓడించేందుకు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి దేశాలు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు యుద్ధంలో రష్యా విజయం సాధించేంతవరకు తాము సైనిక మద్దతు ఇస్తామని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సొన్ హుయి శుక్రవారం ప్రకటించారు.
యుద్ధంలో రష్యాకు బాసటగా ఉత్తర కొరియా బహిరంగంగా మద్దతు తెలపడం అంటే ప్రపంచంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించనట్లే. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి శుక్రవారం నవంబర్ 1 2024న రష్యా రాజధాని మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సర్గేయి లావ్‌రోవ్‌తో చర్చలు జరిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “రష్యాతో మా భాగస్వామ్యం అన్ని రంగాల్లో ఉంది. ఇరు దేశాల సంప్రదాయాలు, స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాలు కూడా చరిత్రలో ఎన్నో కష్టాలను కలిసి ఎదుర్కొన్నాయి. ఈ రోజు రెండు దేశాల మిలిటరీ భాగస్వామ్యం కూడా అజేయంగా సాగుతోంది. ఇదంతా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ధృడమైన నాయకత్వం వల్లే సాధ్యమైందని” అని ఆమె కొనియాడారు.
Also Read| పుతిన్, ఎలన్ మస్క్ మధ్య రెండేళ్లుగా సంప్రదింపులు.. తైవాన్‌పై చైనా కుట్ర?
పుతిన్ తెలివైన నాయకుడని.. ఆయన నేతృత్వంలో రష్యా సైన్యం, ప్రజలు తమ దేశ భద్రత కోసం, సార్వభౌమత్వం కోసం ఎన్ని కష్టమైన పరిస్థితులొచ్చినా పోరాడి విజయం సాధిస్తారనడంలో అనుమానం లేదని చెప్పింది. యుద్ధంలో జరిగే పోరాటంలో విజయం సాధించేంతవరకు రష్యాన్ కామ్రేడ్లకు మద్దతుగా ఉత్తర కొరియా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.
రష్యా విదేశాంగ మంత్రి సర్గేయి లావ్‌రోవ్ కూడా ఇరు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రస్తావిస్తూ.. “భద్రతా సమస్యలు ఎదురైనప్పుడు రెండు దేశాల సైన్యాలు కలిసి పరిష్కారం చేసుకున్నాయి.” అని అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఇటీవల ఉత్తర కొరియా తన 10000 సైనికులను పంపింది. ఈ విషయం ఉక్రెయిన్ వైపు యుద్ధం చేస్తున్న అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలకు మింగుడు పడడం లేదు. రష్యా తరపు నుంచి ఉత్తర కొరియా యుద్ధ రంగంలో దూకడం అనూహ్య పరిణామం. కొరియా పంపిన 10000 సైనికుల్లో దాదాపు 8000 మంది ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులోని కుర్స్‌క్ ప్రాంతంలోకి ప్రవేశించాయని అక్కడ ఉక్రెయిన్ సైనికులతో తలపడుతున్నారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోని బ్లింకెన్ గురువారం తెలిపారు.
జూన్ 2024లో రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు కూడా భద్రతా సమస్య వచ్చినప్పడు కలిసి పోరాడేందుకు సైనిక సహాయం పరస్పరం అందిస్తాయి. అయితే రష్యా అధ్యక్షడు పుతిన్ ఇప్పటివరకు యుద్ధంలో కొరియా సైనికులు పాల్గొన్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కేవలం కొరియాతో తమ మిలిటరీ ఒప్పందం ఎలా అమలపరచాలో రష్యాకు బాగా తెలుసునని అస్పష్టంగా చెప్పారు.
మరోవైపు కొన్ని రోజుల క్రితం ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సొన్ హుయి మాట్లాడుతూ.. అమెరికా తమ దేశంపై అణు దాడికి కుట్ర చేస్తోందని ఆరోపణలు చేశారు. అమెరికాను ఎదుర్కొనే క్రమంలో రష్యా నుంచి అణు ఆయుధాలు సమకూర్చుకునేందుకే కొరియా తమ సైనికులను ఉక్రెయిన్ యుద్ధానికి పంపిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.