EPAPER

North Korea : కిమ్ తలచుకుంటే “అణు సునామీ” ..!

North Korea : కిమ్ తలచుకుంటే “అణు సునామీ” ..!
North Korea

North Korea : ఉత్తర‌కొరియా అమ్ములపొదిలోకి మరో బలమై‌న ఆయుధ వ్యవస్థ చేరనుంది. తరచూ క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇప్పుడాయన తలచుకుంటే ఏకంగా రాకాసి అలలతోనే తీరప్రాంతాలను ముంచెత్తేయగలడు. అణుధార్మికతతో కూడిన సునామీని సృష్టించనూగలడు. దీనికి సంబంధించిన ఆయుధ వ్యవస్థ‌ను కొరియా తాజాగా పరీక్షించింది.


ఓ వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మరో వైపు పశ్చిమాసియాలో మంటలు ఎగసిపడుతున్న తరుణంలో కిమ్ దుందుడుకు వ్యవహారశైలి అగ్రదేశాలను వణికిస్తోంది. వాస్తవానికి ఈ తరహా ఆయుధ వ్యవస్థలను ఉత్తర కొరియా ఏడాది కాలంగా పరీక్షిస్తోంది. కడలి గర్భంలో డ్రోన్‌తో అణుదాడి జరపగల ‘హెయిల్-5-23’‌ను తూర్పుతీరంలో తాజాగా పరీక్షించారు.

హెయిల్ అంటే కొరియన్ భాషలో సునామీ అని అర్థం. అణ్వాయుధాలను నేరుగా ప్రయోగించకుండా.. డ్రోన్లకు అమర్చి సముద్రం అడుగున పేల్చేస్తారు. దాని వల్ల కడలిలో భారీ విస్ఫోటం జరిగి అలలు ఉవ్వెత్తున ఎగసి సునామీ తరహాలో తీర నగరాలు, ప్రాంతాలను ముంచెత్తుతాయి. న్యూక్లియర్ సునామీ డ్రోన్‌ను కొరియా నిరుడు మార్చిలో తొలిసారిగా పరీక్షించింది.


దక్షిణ హామ్‌గ్యాంగ్ ప్రావిన్స్‌లోని రివాన్ కౌంటీ తీరంలో ఆ పరీక్ష విజయవంతంగా ముగిసిందని అప్పట్లో కొరియా ప్రభుత్వం వెల్లడించింది. 80 నుంచి 150 మీటర్ల లోతులో న్యూక్లియర్ సునామీ డ్రోన్ 59 గంటల పాటు సముద్ర జలాలను చీల్చుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. టార్గెట్ లొకేషన్‌కు డ్రోన్ చేరగానే దానికి అమర్చిన అణుబాంబులను పేల్చివేసినట్టు సమాచారం.

అంతేకాదు.. అణ్వాయుధ టార్పెడో డ్రోన్ల సాంకేతికతపై రష్యా, ఉత్తర కొరియా దేశాలు ఎప్పుడో దృష్టి సారించాయి. నిరుడు జూలై 28న ఉత్తర కొరియా ఈ ఆయుధాన్ని బయటకు తీసింది. విక్టరీ డే పరేడ్ సందర్భంగా పాంగ్‌యాంగ్‌లో న్యూక్లియర్ టార్పెడో డ్రోన్‌ను ప్రదర్శించింది. ఇది కూడా హెయిల్ శ్రేణికి చెందినదేనని రక్షణ నిపుణులు చెప్పారు.

52 అడుగుల పొడవు , 5 అడుగుల వ్యాసంతో ఉన్న ఆ టార్పెడో డ్రోన్ రేంజ్ దాదాపు 540 నాటికల్ మైళ్లు. అణు లేదా సంప్రదాయ వార్ హెడ్లను దానికి అమర్చేవీలుంది. దీనిని ప్రయోగించడం ద్వారా దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలను అతి తేలిగ్గా టార్గెట్ చేసుకోవచ్చు. సముద్రంలో 260-300 అడుగుల లోతున కూడా దీనిని ప్రయోగించే వీలుంది.

ఈ భారీ డ్రోన్‌ను ప్రయోగించడానికి సబ్‌మెరైన్ అవసరమే ఉండదు. తీరం నుంచి, ఫ్లోటింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి కూడా ప్రయోగించవచ్చని ఆయుధ నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ టార్పెడోలకు 100 మెగా‌టన్నుల అణు వార్‌హెడ్లను అమర్చవచ్చు. తద్వారా హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడులకు 20 రెట్ల కల్లోలాన్ని సముద్రగర్భంలో సృష్టించొచ్చు.

ఉత్తరకొరియా తాజాగా పరీక్షించిన ఆయుధ వ్యవస్థ కూడా హెయిల్ శ్రేణికి చెందినదే. శత్రువులను లక్ష్యంగా చేసుకుని రేడియో యాక్టివ్ సునామీని సృష్టించడమంటే పర్యావరణానికి తీరని నష్టం కలిగించడమే. ఏడాదిగా హెయిల్ శ్రేణి ఆయుధ వ్యవస్థలను కొరియా పరీక్షిస్తున్నా.. వాటి సామర్థ్యం వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడి కాలేదు.

అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు చేశాయి. దానికి బదులుగా సముద్రగర్భంలో అణు డ్రోన్ ఆయుధ వ్యవస్థ పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కొరియా దేశాల కలయిక ఇక కల్లేనని, దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని కిమ్ ప్రకటించిన కొన్ని రోజులకే అణ్వాయుధ పాటవాన్ని ప్రదర్శించడం గమనార్హం.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×