EPAPER
Kirrak Couples Episode 1

Louis Braille : అంధుల జీవితాల్లో వెలుగును నింపిన లూయీస్ బ్రెయిలీ..

Louis Braille : అంధుల జీవితాల్లో వెలుగును నింపిన లూయీస్ బ్రెయిలీ..

Louis Braille : అతడు ఓ నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టాడు. విధి వక్రించి కంటికి గాయమై ఐదేళ్లకే కంటిచూపు పోగొట్టుకున్నాడు. అందమైన లోకాన్ని తానిక చూడలేననే సంగతి తెలిసి కుమిలిపోయాడు. అయితే.. 15 ఏళ్లు వచ్చేసరికి.. ఆ బాలుడే అంధ విధ్యార్థులూ చదువుకునేలా ఓ లిపిని తయారు చేసి, దానిని మరింత ఆధునీకరించాడు. అతడే.. లూయీస్ బ్రెయిలీ. నేడు ఆ మహనీయుని జయంతి.


ఫ్రాన్స్‌లో 1809 జనవరి 4న ఒక పేద చర్మకారుని కుటుంబంలో లూయిస్ బ్రెయిలీ జన్మించాడు. తండ్రి సైమన్ వ్రేన్ బ్రెయిలీ చెప్పులు కుట్టి కుటుంబాన్ని పోషించుకునేవాడు. పని దొరికితేనే తిండి.. లేకుంటే పస్తు అన్నట్లుగా ఉండేది ఆ కుటుంబ పరిస్థితి. ఓ రోజు తండ్రి చెప్పులు కుట్టే పనిలో బిజీగా ఉండగా అక్కడే ఆడుకుంటున్న మూడేళ్ల వయసున్న లూయిూస్ బ్రెయిలీ కుడి కంటిలో పదునైన ఇనుప సూది దిగింది. తండ్రి వెంటనే దగ్గరలో ఉన్న ఏదో ఆసుపత్రిలో చూపించి, వైద్యం చేయించాడు కానీ.. ఇన్ఫెక్షన్ కారణంగా క్రమంగా కంటి చూపు తగ్గిపోయింది. ఆ ఇన్ఫెక్షన్.. రెండో కంటికీ సోకి.. ఐదేళ్ల వయసులో ఈ అందమైన లోకాన్ని చూసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాడు లూయీస్.

చిన్నప్పటి నుంచే ఇంటాబయటా చురుగ్గా ఉండే లూయిస్ కంటిచూపు పోయినా.. బడికి పోతానని మారాం చేసేవాడు. దీంతో తల్లిదండ్రలు పదేళ్ల వయసులో ప్యారిస్‌లో ఉన్న ఓ అంధుల పాఠశాలలో చేర్చారు. అయితే.. అక్కడి మొరటు విద్యావిధానం బాలుడైన లూయీస్‌కి నచ్చేది కాదు. పైగా తొలిసారి హాస్టల్‌లో ఉండాల్సి రావటంతో ‘హోమ్ సిక్’ పాలయ్యాడు. తాను చదువుకునేందుకు ఇంకా ఏదైనా బెటర్ మార్గం ఉందా అని హాస్టల్లో ఆలోచించేవాడు.


ఈ క్రమంలోనే 15 ఏళ్ల వయసులో చెక్కమీద చిన్నచిన్న మేకులు కొట్టి.. వాటిని తాకటం ద్వారా ఫ్రెంచి అక్షరాలను గుర్తించటం మొదలుపెట్టాడు. ఆ విధానంలోనే చదవటం, రాయటానికి కూడా ఏర్పాట్లు చేసి, తోటి అంధ విద్యార్థులకూ దానిని పరిచయం చేశాడు. ఇది వారికి నచ్చటంతో అక్కడి విద్యార్థులంతా సంతోషపడ్డారు. ఆ విద్యార్థులు, టీచర్లు అతడిని అభిమానించటం మొదలుపెట్టారు.

ఎవరి ప్రోత్సాహమూ లభించకపోయినా.. తన 20వ ఏట 1829లో తొలిసారి తాను కనిపెట్టిన లిపిలోని అక్షరాలను ‘System of Writing Words, Music and Plain-Chant for the Use of the Blind’ అనే పేరుతో లూయీస్ అచ్చు వేయించాడు. ఇది అంధులు చదవటానికి, రాయటానికి, సంగీతం నేర్చుకునేందుకు బాగా అక్కరకు రావటంతో క్రమంగా లూయీస్ ప్రతిభ లోకానికి తెలిసి వచ్చింది. దీంతో తాను చదువుకున్న అంధుల పాఠశాలలోనే టీచరుగా నియమితుడయ్యాడు.
అత్యంత సున్నిత మనస్కుడైన లూయీస్‌కు కళలు, సాహిత్యం అంటే ప్రాణం. చర్చిలో పాటలు పాడటం, సంగీతం వాయించేవాడు. ప్యారిస్‌లోని బ్లైండ్ స్కూల్లో పని చేస్తున్న సమయంలోనే ఆయన క్షయవ్యాధి (టీబీ) బారిన పడ్డారు. 1852లో 43 ఏళ్ల వయసులోనే లూయిస్ తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమయాత్రలో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు విన్సెంట్ ఆరియోల్, అంధుల కోసం జీవితాంతం పనిచేసిన హక్కుల ఉద్యమకారిణి హెలన్ కెల్లర్ కూడా పాల్గొన్నారు.

లూయిస్ బతికుండగా ఈ లిపి గురించి ఎవరూ పట్టించుకోలేదు గానీ.. ఆయన మరణించిన రెండేళ్లకే 1854లో లూయిస్ రూపొందించిన ఆల్ఫాబెట్ సిస్టమ్‌ని ఫ్రెంచి ప్రభుత్వం గుర్తించి, అక్కడి అంధ విద్యార్థులకు దానిని అందుబాటులోకి తెచ్చింది. 1982లో ఎలక్ట్రానిక్ బ్రెయిలీ డిస్‌ప్లే వచ్చింది. ఆ తదుపరి ఎలక్ట్రానిక్ నోట్స్, డిజిటల్ ఆడియో బుక్స్, కంప్యూటర్ స్క్రీన్ రీడర్స్, వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి.

ఫ్రాన్స్ చరిత్రలో మహనీయులుగా గుర్తింపు పొందిన వారి స్మృతి నిమిత్తం నిర్మించిన పాంథియన్ మ్యూజియంలో లూయీ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆయన జన్మించిన ఇంటిని ప్రభుత్వం స్మారకంగా మార్చింది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఆయన పేరున ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయగా, మనదేశం బ్రెయిలీ పేరిట 2 రూపాయల నాణెం విడుదల చేసింది.

లూయీస్ బ్రెయిలీ జన్మించిన జనవరి 4ను ‘ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం’గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018లో తీర్మానించింది. ఈ మేరకు 2019 నుంచి ఏటా జనవరి 4ని బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

కంటి చూపు లేని ఆయన ముందుచూపు కారణంగానే నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధులంతా మిగిలిన వారితో పలు రంగాల్లో పోటీ పడగలుగుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ లిపిని నేటి టెక్నాలజీకి అనుగుణంగా మరింత అభివృద్ధి చేసి అంధులందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవటమే.. ఆ మహనీయుడికి మనమిచ్చే గొప్ప నివాళి కాగలదు.

Related News

Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Chinese Rocket: ల్యాండింగ్ సమయం.. ఒక్కసారిగా పేలిన చైనా రాకెట్

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Sri Lanka: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

Big Stories

×