Naim Qassem Israel: హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌నకు కొత్త నాయకుడిగా నయిమ్ ఖాసెం ఎన్నుకోబడ్డాడు. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవడంతో కొత్త నాయకుడి పదవి గత రెండు నెలలుగా ఖాళీగానే ఉంది. ఆ పదవిని చేపట్టబోయే హషెం సఫీద్దీన్ ని ఇజ్రాయెల్ సెప్టెంబర్ 27, 2024న హతమార్చింది. దీంతో తదుపరి నాయకుడెవరని హిజ్బులా గ్రూప్ అగ్రనాయకులు చర్చించి.. అత్యంత సీనియర్ సభ్యుడు, డెప్యూటీ సెక్రటరీ జెనెరల్ నయిమ్ ఖాసెంని మంగళవారం ఎన్నుకున్నారు.
అయితే నయిమ్ ఖాసెం ఎన్నికపై ఇజ్రాయెల్ ఎద్దేవా చేసింది. అతడు ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే అతడిని కూడా హతమారుస్తామని చెప్పింది. నయిమ్ ఖాసెం ఎన్నికల ప్రకటన రాగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యాఓవ్ గల్లంత్ ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ‘అతనిది టెంపరీ అపాయింట్‌మెంట్, ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండడు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో నయిమ్ ఖాసెం ఫొటోని కూడా షేర్ చేశారు. ఆ వెంటనే హెబ్రూ భాషలో మరో ట్వీట్ చేశారు. నయిమ్ ఖాసెం కు కౌంట్ డౌన్ మొదలైందని హెబ్రూ భాషలో రాశారు.
Temporary appointment.
Not for long. pic.twitter.com/ONu0GveApi
— יואב גלנט – Yoav Gallant (@yoavgallant) October 29, 2024
Also Read: అణు ఆయుధాల డ్రిల్ ప్రారంభించిన రష్యా.. అయోమయంలో అమెరికా?..
హిజ్బుల్లా కొత్త చీఫ్ నయిమ్ ఖాసెం ఎవరు?
లెబనాన్‌లో 1982 సంవత్సరంలో కొంత షియా నాయకులు హిజ్బుల్లా గ్రూప్ స్థాపించారు. ఆ వ్యవస్థాపకుల్లో 71 ఏళ్ల నయీమ్ ఖాసెం ఒకరు. 1991 నుంచి ఆయన హిజ్బుల్లా డెప్యూటీ సెక్రటరీ జెనెరల్ పదవిలో ఉన్నారు. 1953లో ఇజ్రాయెల్ సరిహద్దల్లోని లెబనాన్ గ్రామం ఫార్ ఫిలా లో నయిమ్ ఖాసెం జన్మించారు. 1970వ దశకంలో లెబనాన్ లో జరిగిన షియా అమాల్ ఉద్యమంలో పాల్గొన్న తరువాత ఆయనకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది.
హిజ్బుల్లాను 1982లో స్థాపించిన తరువాత పార్టీ రాజకీయ వ్యవహారాలను, ఎన్నికలను చూసేకునేవారు. హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా 2006 సంవత్సరంలో ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైన తరువాత తెరచాటున ఉండగా.. నయీం ఖాసెం అన్నీ తానై ఇరాన్, ఇతర దేశాలో హిజ్బుల్లా ప్రతినిధిగా వ్యవహరించారు. నెల రోజుల క్రితం హిజ్బుల్లా సెకండ్ ఇన్ కమాండ్ హషెం సఫీద్దీన్ మరణం తరువాత నయిమ్ ఖాసెం ఇజ్రాయెల్ తో యుద్ధం ఆపేయాలని పార్టీ నాయకులకు సూచించారు. యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్‌తో చర్చలు జరపాలని కూడా ఆయన సూచించినట్లు తెలస్తోంది.
Also Read: ‘కమలా హ్యారిస్ వల్ల ప్రపంచ యుద్ధం రావొచ్చు.. రష్యా, చైనాతో ఆమె డీల్ చేయలేదు’
మరోవైపు లెబనాన్ లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 1700 మంది లెబనాన్ పౌరులు చనిపోగా.. 37 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. ఇజ్రాయెల్ సైనికులు కూడా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా హిజ్బుల్లా యుద్ధం చేస్తోంది. హిజ్బుల్లాకు అన్ని విధాలుగా ఇరాన్ మద్దతునిస్తోంది. ఆయుధాలు సరఫరాతో పాటు ఆర్థికంగా కూడా సాయం చేస్తోంది.