EPAPER
Kirrak Couples Episode 1

Eco-Friendly Tree: క్రిస్మస్ ట్రీ .. విశేషాలెన్నో..

Eco-Friendly Tree: క్రిస్మస్ ట్రీ .. విశేషాలెన్నో..

Eco-Friendly Tree: క్రిస్మస్ వేళ ప్రతి ఇంట్లోనూ క్రిస్మస్ చెట్టు కొలువుదీరుతుంది. ఈ పండుగనాడు క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. క్రీస్తు జన్మించింది శీతాకాలంలో. ఆ కాలంలో శీతల దేశాల్లో జీవనమంటే దుర్భరమే. పాజిటివ్ వైబ్రేషన్స్ తెస్తుందనే విశ్వాసంతో పచ్చటి ఫైన్ లేదా ఫర్ చెట్టు కొమ్మలను తెచ్చి ఇంటి బయట అలంకరించేవారు. క్రిస్మస్ ట్రీని సతత హరిత జీవనానికి ప్రతీకగా భావిస్తారు. అంటే అందరూ పచ్చగా కలకాలం జీవించాలనేది దానర్థం.


క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. క్రిస్మస్‌ పర్వదినాన ఒక చర్చిలో ఏసు ప్రభువు విగ్రహం ఎదుట అందరూ ఖరీదైన కానుకలు పెడుతున్నారు. నిరుపేద అయిన ఓ బాలుడు మాత్రం ఒక పచ్చటి మొక్కను తెచ్చి పెట్టాడట. అది వెంటనే బంగారు కాంతులీనడం ఆరంభించిందట. అప్పటి నుంచి నిరాడంబరమైన ఆరాధనకు గుర్తుగా క్రిస్మస్‌ ట్రీ వచ్చిందనేది ప్రతీతి.

ఇళ్లల్లో క్రిస్మస్ చెట్టును అలంకరించడం 17వ శతాబ్దం చివర్లో జర్మనీలో ఆరంభమైంది. ప్రొటెస్టెంట్ నేత మార్టిన్ లూథర్ అప్పట్లో వెలిగించిన కొవ్వొత్తులను చెట్టు కొమ్మలపై ఉంచి అలకరించారని చెబుతారు. 1840లో ఇంగ్లండ్‌లో జరిగిన క్వీన్ విక్టోరియా కచేరీలో నెలకొల్పడం ద్వారా ప్రిన్స్ ఆల్బర్ట్ అక్కడికి క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చాడనే ప్రచారం ఉంది. కానీ 1800లోనే మూడో జార్జి రాజు భార్య క్వీన్ చార్లొటె క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టుగా రికార్డుల్లో ఉంది. 19వ శతాబ్దం నాటికి క్రిస్మస్ ట్రీతో పాటు ఇంట్లో అలంకరణ, చాకొలెట్లు, బహుమతులు వంటివి మధ్యతరగతి వారికి చేరువయ్యాయి.


క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో మహిళలు, పిల్లలు క్రిస్మస్ ట్రీని అలంకరించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతారు. సంప్రదాయ క్రిస్మస్ చెట్టును అలంకరించడంలో కొత్త దనం కోసం రకరకాల థీమ్‌లతో అలంకరించడం ఆనవాయితీగా మారింది. వాస్తవానికి శంఖువు ఆకారంలో పచ్చగా ఉండే కానిఫర్ చెట్లను క్రిస్మస్ పండుగ రోజు అలంకరిస్తారు. ఇప్పుడైతే ప్లాస్టిక్‌తో తయారు చేసిన కృత్రిమ చెట్లూ అందుబాటులోకి వచ్చాయి.

ప్లాస్టిక్ చెట్లతో పర్యావరణానికి ఎనలేని అనర్థమంటూ వాటిని వ్యతిరేకించేవారు కోకొల్లలు. అలాంటి వారి కోసం హాంకాంగ్ కు చెందిన పాలీగ్రూప్ కృత్రిమమైన, ఎకో-ఫ్రెండ్లీ క్రిస్మస్ చెట్లను తయారు చేస్తోంది. అదీ ఎంతో చౌకగా. ఇలా కృత్రిమ క్రిస్మస్ ట్రీలను తయారు చేయడంలో ఆ కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ వన్. ఆ సంస్థ కస్టమర్ల జాబితాలో వాల్‌మార్ట్, హోం డిపో, కాస్ట్‌కో, టార్గెట్ వంటి బడా బడా రిటైల్ సంస్థలతో పాటు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఉంది.

25 దేశాల్లో పాలీగ్రూప్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ఆ సంస్థ అమ్మకాలు, రెవెన్యూలో 60 శాతం క్రిస్మస్ ట్రీ ఉత్పత్తులే ఆక్రమించాయి. కృత్రిమ చెట్లను గిరాకీ గణనీయంగా పెరిగింది. 2022లో ఒక్క అమెరికా దేశమే 20 మిలియన్ల చెట్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. దశాబ్దం క్రితంలో పోలిస్తే ఇది డబుల్. సహజసిద్ధమైన చెట్లకు డిమాండ్ క్రమేపీ తగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

2002లో 20 మిలియన్ల పైన్ వృక్షాలు నేలకు ఒరగగా.. 2017లో ఆ సంఖ్య 15 మిలియన్లకు పడిపోయింది. పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ మెటీరియల్స్, మెటల్స్‌తో తయారయ్యే 2 మీటర్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీ దాదాపు 40 కిలోల కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. అంతే సైజున్న సహజసిద్ధ పైన్ చెట్టు వల్ల వెలువడే కార్బన్-డై-ఆక్సైడ్‌కు ఇది పది రెట్లు అధికం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎకో-ఫ్రెండ్లీ క్రిస్మస్ చెట్ల తయారీపై పాలీగ్రూప్ దృష్టి సారించింది.

ఈ కంపెనీకి చైనాలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వచ్చే వారం నుంచి మెక్సికో, ఇండొనేషియాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫ్యాక్టరీలు ఆరంభం కానున్నాయి. ప్రజలు వాడి పడేసే ప్లాస్టిక్ సీసాలు, వస్తువులను రీసైకిల్ చేసి.. తద్వారా లభించే ప్లాస్టిక్(పోస్ట్-కన్య్సూమర్ రీసైకిల్డ్ ప్లాస్టిక్)ను వినియోగించి క్రిస్మ‌స్ ట్రీలను తయారు చేస్తామని కంపెనీ చెబుతోంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఇది సాకారం అవుతుందని స్పష్టం చేస్తోంది.

Tags

Related News

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

Russia nuclear Weapons: ‘ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!

Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Big Stories

×