EPAPER

Harris-Trump Debate: ఒక్క డిబేట్‌తో హారిస్ గ్రాఫ్ మారిపోయింది.. ఎందుకు?

Harris-Trump Debate: ఒక్క డిబేట్‌తో హారిస్ గ్రాఫ్ మారిపోయింది.. ఎందుకు?

Donald Trump vs Kamala Harris Debate Highlights: అమెరికా ప్రెసిడెన్సియల్ క్యాండిడేట్స్ డిబేట్‌ నిన్న వాడీవేడిగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ లో జరిగిన ఈ డిబేట్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌‌పై కమలా హారిస్‌ పై చేయి సాధించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, వలసలు, గర్భవిచ్ఛిత్తి, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ వార్ పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ డిబేట్‌లో ట్రంప్ తన ఎమోషన్స్‌ను అదుపు చేసుకోలేకపోయారు. సాధారణంగా, వాదోపవాదాల్లో ప్రత్యర్థులు మధ్యలో కల్పించుకోవడం చూస్తుంటాము. అయితే, దాన్ని కూడా ట్రంప్ ఓర్వలేకపోయారు. మధ్యలో కల్పించుకోవద్దంటూ కమల హారిస్‌ను హెచ్చరించారు. ఇలా, ట్రంప్ వ్యవహారశైలి రిపబ్లికన్లను సైతం అసంతృప్తికి గురిచేసినట్లయ్యింది. ఇక, ఈ డిబేట్ తర్వాత అమెరికా పోల్స్ డేటాలు మారిపోయాయి. ఎలన్ మస్క్ కూడా కమల హ్యారిస్‌కు పరోక్షంగా మద్దతు తెలిపాల్సిన పరిస్థితి వచ్చింది.


అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కమల హారిస్ ఈ మూడున్నర సంవత్సరాలు ఏమీ పనిచేయలేదని ట్రంప్ ఎన్నోసార్లు విమర్శించారు. అయితే, ట్రంప్ విమర్శలన్నింటికీ కమల ఒక్క డిబేట్‌తో సమాధానం చెప్పినట్లయ్యింది. కమల చేసిన దాదాపు ప్రతి వాదనా డొనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం కలిగించింది. ప్రపంచ నాయకులంతా ట్రంప్‌ని చూసి నవ్వుతున్నారని.. ట్రంప్‌ను 81 మిలియన్ల మంది ఓటర్లు వ్యతిరేకించారనీ.. ట్రంప్ ఓడిపోయారనే వాస్తవాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటూ కమల హారిస్ విరుచుకుపడ్డారు. ఇలాంటి, తీవ్రమైన విమర్శలు, ఆరోపణల మధ్య ట్రంప్‌ మాటిమాటికీ అదుపు తప్పారు. బిగ్గరగా మాట్లాడటం, ఇచ్చిన సమయానికి మించి మాట్లాడుతూ తనని తాను సమర్థించుకోడానికి ప్రయత్నించారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలకు వ్యతిరేకంగా పదేపదే అవాస్తవ అంశాలను ప్రస్తావిస్తూ.. మోడరేటర్లకు కూడా విసుగు తెప్పించారు. సరిగ్గా, ఇదే ప్రభావం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఎక్కువ మంది ట్రంప్‌కు ఓటమి తప్పదనే ధోరణికి వచ్చేశారు.

ఇక, కీలకమైన ఈ డిబేట్ ముగిసిన వెంటనే.. ప్రముఖ సింగర్, పాప్ కల్చర్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కమల హారిస్‌కు మద్దతుగా పోస్ట్ పెట్టారు. డెమొక్రాటిక్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇటీవల ట్రంప్ సహచరుడు, ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సూచనగా.. “టేలర్ స్విఫ్ట్, చైల్డ్‌లెస్ క్యాట్ లేడీ” అని పోస్ట్‌పై ఆమె సంతకం చేయడం చర్చకు దారి తీసింది. వాన్స్ చేసిన ఈ వ్యాఖ్య చాలా మంది మహిళా ఓటర్లను ట్రంప్‌కు దూరం చేసింది. ఇక, టేలర్ స్విఫ్ట్ ఈ ఎన్నికల్లో హారిస్‌ను గెలిపించాలని కూడా తన 280 మిలియన్ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. “హక్కులు, కారణాల కోసం పోరాడుతున్న మనం.. వాటిని గెలవడానికి మనకు ఒక యోధుడు అవసరమని నమ్ముతున్నాను” అని.. “కమల హారిస్ స్థిరమైన , ప్రతిభగల నాయకురాలు అని నేను భావిస్తున్నాననీ.. ఆమె వస్తే… ప్రశాంతత మాత్రమే కాకుండా ఈ దేశ ప్రజలు చాలా సాధించగలరని నమ్ముతున్నాను” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాబోయే ట్రిలయనీర్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. “టేలర్ స్విఫ్ట్.. నువ్వు గెలుస్తావు..” అంటూ కామెంట్ చేశారు.


అయితే, డిబేట్ తర్వాత CNN, SSRS నిర్వహించిన పోల్‌లో అనూహ్యంగా కమలకు బలం పెరిగింది. తాజా పోల్ డేటా ప్రకారం, ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ డిబేట్‌లో హారిస్ గెలిచినట్లు ఎక్కువ మంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిబేట్‌లో ఎవరు గెలుపొందారు అనే ప్రశ్నపై.. డిబేట్‌ను చూసిన వీక్షకుల్లో 63% మంది హారిస్ అని చెప్పగా.. 37% మంది ట్రంప్ మంచి ప్రదర్శన ఇచ్చారని అన్నారు. ఇక, చర్చకు ముందు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో… ఎవరు గెలుస్తారనే దానిపై 50%-50% ఫలితాలు వచ్చినట్లు CNN డేటా చూపించింది. ఇక, ABC డిబేట్ ముగిసిన గంటలోపు హారిస్ క్యాంపైన్ టీమ్ అమెరికన్ ఓటర్లకు ఒక ఇమెయిల్ పంపింది. మరో డిబేట్‌కు ట్రంప్ సిద్ధమా అంటూ అందులో పేర్కొంది. అయితే, దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్. ఏబీసీ డిబేట్‌లో కమల హారిస్ ఘోరంగా ఓడిపోయింది కాబట్టే వెంటనే మరో డిబేట్‌కు వస్తానని అంటోందని అన్నారు. అయితే, ఒకవేళ, రెండో డిబేట్ నిర్వహిస్తే దానికి తాను వస్తారా అనే ప్రశ్నను మాత్రం ట్రంప్ తిరస్కరించారు. అయితే, ఏబీసీ డిబేట్‌ పూర్తయిన వెంటనే తాను హారిస్‌తో ఓపెన్ డిబేట్‌కు వచ్చి మళ్లొకసారి ఆమె పాలసీలను ఎండగడతానని ట్రంప్ అన్నారు.

Also Read: నన్ను గెలిపిస్తే..వాళ్ల అంతు చూస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఆగస్ట్. 23-27 తేదీలలో జరిగిన ABC న్యూస్, ఇప్సోస్ పోల్ ప్రకారం, 56 శాతం మంది కమల హారిస్ తన ప్రచారంలో అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ట్రంప్ ప్రచారం గురించి 41 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. ఇక, అమెరికాకు అధ్యక్షులుగా ఎవరు ఉంటే బాగుటుందనే సర్వేలో 53 శాతం మంది కమల హారిస్‌కు మద్దతు ఇవ్వగా.. ట్రంప్‌కు సానుకూలంగా 47 శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం, కమల హారిస్.. 538 జాతీయ పోలింగ్ సగటులో ట్రంప్ కంటే 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. అయితే, గత రెండు వారాల్లో ఆమె మొమెంటం ఆగిపోయిందనీ, తగ్గిందనీ అనుకుంటున్న తరుణంలో ఈ తాజా డిబేట్ పాత డేటాకు భిన్నంగా ఫలితాలను చూపించింది. ఇక, డిబేట్‌కు ముందు నిర్వహించిన ఓ సర్వేలో డిబేట్‌లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు 43 శాతం మంది కమల గెలవాలని కోరుకోగా.. 37 శాతం మంది మాత్రమే ట్రంప్ గెలుపును కోరుకున్నారు.

అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఈ డిబేట్‌ల ప్రభావం ఎంతుటుందనేది ఎప్పటి నుండో చర్చల్లో నలుగుతున్న అంశం. అమెరికా ఎన్నికల చరిత్రను చూసినప్పుడు ఈ డిబేట్‌లు పెద్దగా ప్రభావం చూపవని తెలుస్తున్నప్పటికీ.. ఒబామా కాలం నుండి ఇందులో మార్పు కనిపిస్తున్నట్లు కూడా స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికలను పరిశీలిస్తే.. జూన్ నెలలో జరిగిన చర్చలో బైడెన్ పేలవమైన ప్రదర్శన ప్రెసిడెంట్ రేసు నుండి తప్పుకునే స్థాయికి కారణం అయ్యింది. బైడెన్ తప్పుకోవడం రేసులో హీట్‌ని పెంచినప్పటికీ, 2024 రేసులో ఎవరు గెలుస్తారో అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే, తాజా డిబేట్‌లో హారిస్ అద్భుతమైన ప్రదర్శన ఓట్లను రాల్చుతుందా అనేది కూడా అంతే అస్పష్టం అంటున్నారు కొందరు.

2020లో, మొదటి అధ్యక్ష చర్చ సందర్భంగా ట్రంప్‌ను ఉద్దేశించి బైడెన్ అన్న ‘విల్ యు షట్ అప్ మ్యాన్’ అనే రిప్లై అమెరికా ఓటర్ల మానసిక స్థితిని మార్చిందని కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అలాగే, 2016లో, హిల్లరీ క్లింటన్‌ను మేథావులు, పోల్‌స్టర్లు, ఓటర్లు కూడా మూడు డిబేట్‌లలో విజేతగా ప్రకటించారు. అయితే, అనూహ్యంగా ఆమె ఓటమిపాలయ్యారు. 2012లో, ఒబామా మిట్ రోమ్నీతో చేసిన మొదటి అధ్యక్ష చర్చలో ఘోరంగా ఓడిపోయారు. అయితే, రెండు, మూడవ డిబేట్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇదే గెలుపుకు కారణమయ్యిందని కొందరు అంటారు.

అందుకే, చాలా మంది నిపుణులు ఇలాంటి చర్చలు ఓటర్లపై ప్రభావాన్ని చూపుతాయా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. క్షేత్ర స్థాయి నివేదికలను బట్టి చూస్తే… అమెరికా ప్రజలు నిజంగా ఈ టీవీ డిబేట్‌లను చూడటం లేదనే అభిప్రాయం కూడా ఉంది. చాలా మంది ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయబోతున్నారనే దాని గురించి ముందుగానే ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, డిబేట్‌లు మంచి ప్రజాస్వామ్య సాధనంగా ఓటర్లు భావిస్తుండటం విశేషం. ఈ వేదికపై అభ్యర్థులు దేని కోసం నిలబడతారో, వారు నిజంగా ఎంత పని చేస్తారో తెలుసుకోడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 2016లో ట్రంప్‌, 2004లో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ ఇద్దరూ చర్చల్లో ఓడిపోయినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగని, ప్రజలు గుడ్డిగా కూడా ఓటు వేయరనడానికి రుజువులు ఉన్నాయి. ఇక, హారిస్, ట్రంప్ మధ్య జరిగిన ఈ మొదటి డిబేట్ బహుశా చివరిది కూడా కావచ్చు. అయితే, ఒక్క డిబేట్‌తో హారిస్ గ్రాఫ్ పెరిగిందన్నది తాజా సర్వేలు చెబుతున్న మాట. మరి బ్యాలెట్ బాక్స్ వద్ద అమెరికన్ ఓటర్లు ఏం చేస్తారన్నది తెలియాలంటే మరో రెండు నెలలు వేచి ఉండక తప్పదు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×