EPAPER
Kirrak Couples Episode 1

Cicadas : అమెరికాని ముంచెత్తనున్న లక్ష కోట్ల కీటకాలు..!

Cicadas : అమెరికాని ముంచెత్తనున్న లక్ష కోట్ల కీటకాలు..!
Cicadas

Cicadas : ట్రిలియన్.. అంటే లక్ష కోట్లు. ఇన్ని కీటకాలు ఏకకాలంలో భూమిపైకి వస్తే? ఈ అరుదైన దృశ్యం అమెరికాలో ఆవిష్కృతం కానుంది. ఏప్రిల్ నెలలో ట్రిలియన్ సికాడాలు భూమిని చీల్చుకుని బయటకు రానున్నాయి. థామస్ జెఫర్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అంటే 1803లో ఇలాంటి అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ సికాడా అంటే మరేదో కాదు..! మనం పల్లెటూళ్లలోని డొంకరోడ్లలో రాత్రిపూట నడిచేటప్పడు ‘కీచు’ మంటూ చెవులు చిల్లులు పడేలా గీపెట్టే బుల్లి కీటకం. దీన్నే మనం కీచురాయి అంటుంటాం. ఇప్పుడు అమెరికా మీదికి దండెత్తబోతున్న ఈ సికాడా కూడా మన కీచురాయి జాతికి చెందిన కీటకమే. సికాడాలు ఎక్కువ కాలం భూమిలోనే నివసిస్తాయి. కలయిక, సంతాన వృద్ధి కోసం మాత్రమే ఇవి బయటకు వస్తాయి. ఇలా ఒకసారి భూమిపైకి వచ్చే సికాడాలు.. అనంతరం ఎక్కువ కాలం బతకవు.


వీటిలో ఏడు జాతులున్నాయి. నియమిత కాలంలో భూమిపైకి వచ్చే ఈ కీటకాలను తొలిసారిగా 1634లో ప్లిమత్ కాలనీ (Plymouth Colony)లో యాత్రికులు గుర్తించారు. అయితే అమెరికా ఆదివాసులైన రెడ్‌ ఇండియన్లకు శతాబ్దాలుగా ఈ సికాడాలు సుపరిచితమే. వీటిలో 3 రకాలు 17 ఏళ్లకు ఒకసారి భూమిపైకి వస్తాయి. మిగిలిన 4 జాతులు 13 ఏళ్లకు ఒకసారి బయటకు వస్తాయి.

ఇలా గుంపులుగుంపులుగా వచ్చే సికాడాలను బ్రూడ్‌లు అంటారు. చార్లెస్ మర్లాట్ అనే ఎంటమాలజిస్ట్ వీటిని వర్గీకరించాడు. 1893లో వెలుపలికి వచ్చిన సికాడాలు, తిరిగి 17 ఏళ్లకు వచ్చే సికాడాలను బ్రూడ్-1 కిందకు చేర్చారు. 1894లో బయటకొచ్చిన కీటకాలను బ్రూడ్-2గా వ్యవహరించారు. 1894లో వెలుగుచూసిన 13-ఏళ్ల సికాడాలను బ్రూడ్-18 కింద వర్గీకరించారు. 2021లో భూమిపైకి వచ్చినవి బ్రూడ్-10 సికాడాలు.


13 ఏళ్లు, 17 ఏళ్ల జీవితచక్రం కాకుండా మధ్యలోనూ అడపాదడపా ఇవి వెలుగుచూస్తుంటాయి. అయితే రెండు బ్రూడ్‌లకు చెందిన సికాడాలు ఏకకాలంలో భూమిపైకి రావడం ఈసారి ప్రత్యేకం. 13-ఏళ్లకోసారి వచ్చే బ్రూడ్-19తో పాటు 17-ఏళ్ల బ్రూడ్-13 సికాడాలు ఒకేసారి కనిపించబోతున్నాయి. ఇలా జరగడం గత 200 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇలాంటి అరుదైన ద‌ృశ్యం మళ్లీ ఆవిష్కృతం కావాలంటే మరో 221 ఏళ్లు వేచి చూడాల్సిందే.

పిల్లలుగా ఉన్న సమయంలో సికాడాలు మట్టిని తొలుచుకుని భూమిలోకి 7-8 అంగుళాల దిగువకి వెళ్లిపోతాయి. చెట్ల వేళ్లను ఆహారంగా తీసుకుంటూ 13, 17 ఏళ్లు అక్కడే జీవిస్తాయి. భూమిపైకి రావడానికి వీలుగా కొన్ని వారాల ముందు నుంచే టన్నెల్స్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే వెంటనే బయటకు రావు. మట్టి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడే ఉపరితలంపైకి చేరుకుంటాయి. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత 4 నుంచి 6 వారాలే బతుకుతాయి. కలయిక కూడా ఆ సమయంలోనే.

మగ సికాడాలు విపరీతమైన ధ్వనిని చేస్తాయి. వాస్తవానికి అవి ఆడ కీటకాలను ఆకట్టుకునేందుకు పాడే పాటలు. ఆ ధ్వని తీవ్రత 90-100 డెసిబల్స్ వరకు ఉంటుంది. హైడ్రాలిక్ ఎక్సకవేటర్(80 డెసిబల్స్), చర్చి బెల్స్(70), మోటార్ సైకిల్(88 డెసిబల్స్) చేసే ధ్వని కన్నా అది ఎక్కువే. ఇక ఫిమేల్ సికాడాలు ఎదుగుతున్న చెట్ల కొమ్మలు, పొదల్లో 200 నుంచి 400 వరకు గుడ్లు పెడతాయి. 6-10 వారాల అనంతరం సంతానం వృద్ధి అవుతుంది. పిల్లలుగా ఉండగానే అవి భూమిపై పడి.. అక్కడ నుంచి రంధ్రాలు చేసుకుని లోపలికి వెళ్లిపోతాయి.

మరి.. ఒక్కసారిగా లక్ష కోట్ల సికాడాలు భూమిపైకి వస్తే నష్టం అనుకుంటున్నారేమో.. కానేకాదు. వీటివల్ల ఎదుగుతున్న వృక్షాలకు కొద్దిగా నష్టం తప్ప.. మిగిలినవన్నీ ప్రయోజనాలే. మనుషులకు, పర్యావరణానికి రవ్వంత నష్టం చేయని ఈ కీటకాలు ఎవరినీ కుట్టవు. మిడతల్లాగా పంటల జోలికీ పోవు. పైగా.. జీవావరణానికి ఎంతో మేలు చేస్తాయంటే నమ్మాల్సిందే.

ఇవి బయటకు వచ్చే ముందు చేసుకునే సొరంగ మార్గాలు సహజసిద్ధమైన ఏరేషన్‌గా పనిచేస్తాయి. సికాడాలు ఇతర జీవులకు ఆహారంగా మారతాయి. కొన్ని ప్రాంతాల్లో మనుషులు కూడా వీటిని తింటారు. ఇతర కీటకల్లాగానే వీటిలోనూ చాలా విటమిన్లు లభిస్తాయి. ఆడ సికాడాల్లో ప్రొటీన్ల శాతం ఎక్కువ. కొవ్వు తక్కువగా ఉంటుంది. అయితే.. ఇవి మరణించిన తర్వాత మంచి ఎరువుగా మరతాయి. నేలకు బలాన్నిస్తాయి.

వచ్చే వసంతకాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇవి బయటకు రానున్నాయి. ఐయోవా, విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో బ్రూడ్-13 సికాడాలు దర్శనమిస్తాయి. అలబామా, ఆర్కాన్సస్, జార్జియా, కెంటకీ, లూసియానా, మిసోరీ, మిసిసిపీ, నార్త్ కరోలినా, ఓక్లహామా, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియాల రాష్ట్రాల్లో బ్రూడ్-19 సికాడాలొస్తున్నాయి. ఇలినాయి, ఇండియానాల్లో మాత్రం రెండు బ్రూడ్లు దర్శనమిస్తాయి.

Related News

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Big Stories

×