EPAPER

Kadam Haat : గడ్డితో రూ.2 కోట్ల ఆదాయం!

Kadam Haat : గడ్డితో రూ.2 కోట్ల ఆదాయం!
kadam

Kadam Haat : గడ్డితో ఏం ఉపయోగం? అని అనుకోవచ్చు. గడ్డిపరకే కదా అని తీసిపారేస్తాం. పాయల్‌నాథ్ కూడా అలాగే సాదాసీదాగా ఆలోచించి ఉంటే.. గడ్డితో చేసిన వస్తువులను దేశదేశాల్లో ఆదరణ లభించి ఉండేది కాదు. ఆమె విభిన్నమైన దృక్పథం వల్ల ఊపిరి పోసుకున్న రూ.2 కోట్ల వ్యాపారమూ ఉండేది కాదు. గడ్డి ఉపజాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి పన్నెండే. వాటిలో పది రకాలు దేశంలో పెరుగుతాయి. అదీ అయిదు రాష్ట్రాల్లోనే. వాస్తవానికి దేశంలో నాలుగోవంతు గడ్డి భూములే. సహజమైన నార అయినందున గడ్డిని ఉపయోగించి బుట్టలు, చేతి బ్యాగ్‌లు, డెకరేషన్ హ్యాంగింగ్స్ వంటి వస్తువులను తయారు చేసే చేతివృత్తి నిపుణులకు కొదవేం లేదు.


చేతివృత్తి నిపుణులకు బాసట

కశ్మీర్, మిజోరం, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో సహజ నారను సమర్థంగా వినియోగించుకునే చేతివృత్తి కళాకారులు ఎందరో ఉన్నారు. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడమే కాకుండా.. ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని పాయల్ సంకల్పించింది. 2006లో కదమ్ ఫౌండేషన్‌ను పాయల్ ప్రారంభించింది. గడ్డిని ఉపయోగించి ఎకో-ఫ్రెండ్లీ వస్తువులను తయారు చేసేందుకు 10 వేల మంది చేతివృత్తి కళాకారులకు శిక్షణ ఇచ్చిందా ఫౌండేషన్. అలా శిక్షణ పొందిన వారిలో 85% మంది మహిళలే. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే క్రమంలో తొలుత పాయల్, ఆమె సోదరి కలిసి బోటిక్ స్టోర్ ఆరంభించారు. అక్కడే గడ్డి ఉత్పత్తులను విక్రయించేవారు. అంతటితో ఊరుకోలేదు. గడ్డి ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేసేందుకు 2009లో కోల్‌కతాలో కదమ్ హాత్‌ను నెలకొల్పింది. ఆన్‌లైన్‌లో గడ్డి ఉత్పత్తులకు ఎనలేని గిరాకీ లభించింది. దీని వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని చేతివృత్తి కళాకారులకు ఉపాధి లభించినట్లయింది.


ఐదు రాష్ట్రాల్లో గడ్డికి డిమాండ్

బ్యాగ్‌ల తయారీ కోసం బెంగాల్ చేతివృత్తి కళాకారులు సబాయ్ గడ్డిని ఉపయోగిస్తుంటారు. శీతల్‌పట్టి, వెదురును కూడా ముడిసరుకుగా వాడుతుంటారు. ఒడిసాలో సబాయ్‌తో పాటు గోల్డెన్ గ్రాస్ ఉపయోగిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో కన్సా, ముంజ్ రకాల గడ్డి వినియోగంలో ఉంది. కశ్మీర్‌లో విలో వికర్, బిహార్‌లో సిక్కి గ్రాస్ సాయంతో వస్తువులను తయారు చేస్తుంటారు. కదం హాత్ పుణ్యమా అని వీరందరి జీవితాలకు వెలుగు వచ్చింది. ఈ గడ్డిజాతులకు ఎరువు అక్కర్లేదు. పెద్దగా నీటి అవసరం కూడా లేకుండానే ఏపుగా పెరుగుతాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఈ గడ్డి ఎంతో ఉపయోగపడుతోంది. నేచురల్ ఫైబర్ అయినందున గడ్డి ఉత్పత్తులు పర్యావరణహితమైనవి.

అంతా పర్యావరణహితమే..

గడ్డి నారతో అల్లడం, పేనడమంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అదే పనిగా నారతో పనిచేస్తుండటం వల్ల చేతి వేళ్లపై చర్మం కాయలు కాస్తుంది కూడా. దీనిని గమనించిన పాయల్.. ఖరగ్‌పూర్ ఐఐటీ రిసెర్చర్లను సంప్రదించింది. పర్యావరణహితమైన చేతి పరికరాలను ఆ సంస్థ రూపొందించి అందజేసింది. దాని వల్ల ఉత్పత్తి సామర్థ్యం పదింతలు పెరిగింది. గ్రీన్ కార్ఖానాల ఏర్పాటు ఇటీవల ఆరంభమైంది. ఫ్యాన్ల అవసరం లేకుండా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా వీటి నిర్మాణం వెదురుతో చేపట్టారు. గ్రీన్ కార్ఖానాల్లో నాన్-టాక్సిక్, పర్యావరణ హిత డైలను వాడుతుండటం మరో విశేషం. గడ్డి, వెదురు వ్యర్థాలను డైలను వేడి చేసేందుకు వినియోగిస్తున్నారు. ప్యాకింగ్‌లలో ప్లాస్టి‌‌క్ ‌ను అస్సలు వినియోగించరు. ఉత్పత్తులను ప్యాక్ చేసేందుకు రీసైకిల్డ్ పేపర్‌తో తయారు చేసిన కార్డ్ బోర్డును, గ్రీన్ బబుల్ పేపర్‌ను వాడతారు.

సహజ నారతో వెరైటీ వస్తువులు

కదం హాత్ ఉత్పత్తుల్లో ఎన్నో వెరైటీలున్నాయి. రోటీ, జ్యూయలరీ బాక్స్‌లు, బౌల్స్, ట్రేలు, లాప్ టాప్ స్లీవ్స్, బ్రెడ్ అండ్ ఫ్రూట్ బాస్కెట్స్, మ్యాట్స్, స్టోరేజి ఆర్గనైజర్స్, వాల్ ఆర్ట్ అండ్ ప్లాంటర్స్.. ఇలా సహజ నారతో తయారైన విభిన్న వస్తువులెన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే మొత్తం ఉత్పత్తుల్లో 45% బ్యాగ్‌లే ఆక్రమిస్తాయి. వీటి సగటు ధర రూ.1100 ఉంటుంది. నిరుడు పదివేల హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అమ్ముడుపోయాయి. ఈ-కామర్స్ బ్రాండ్లలాగేనే ఇవీ ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో కదం హాత్ ఆఫీసులున్నాయి. పనిచేసిన సమయాన్ని బట్టి చేతి వృత్తి కళాకారులు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు ఆదాయం పొందగలుగుతున్నారు.

అంతర్జాతీయ మార్కెటింగ్‌పై కన్ను

ప్రస్తుతం దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు బీ2బీ మార్కెట్‌పై దృష్టి సారించామని పాయల్‌నాథ్ వెల్లడించారు. కొవిడ్ అనంతరం 2022లో బ్రాండ్‌ను కదమ్ హాత్ బాస్కెటరీ బార్న్ ప్రైవేట్ లిమిటెడ్(KHBBPL) రీలాంచ్ చేశామని వివరించారు. ఆ ఏడాది ఆదాయం రూ.2 కోట్లకు చేరిందని.. త్వరలోనే దీనికి రెండింతల ఆదాయం సముపార్జించ గలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కదం హాత్ ఉత్పత్తులను యూరప్, అమెరికా దేశాలకు చేర్చాలనేది ఆమె లక్ష్యం. పాయల్ కూతురు పూరవి ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమైంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×