EPAPER

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Telugu Tamil language issue : ఎవరి మాతృభాషపై వారికి గౌరవం, ప్రేమ ఉండటం సహజం. అదే సమయంలో దేశంలోని ఇతరుల మాతృభాషలనూ, మన భాషతో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంటుంది. మాతృభాషతో బాటు అన్యభాషలను నేర్చుకోవటం, మాట్లాడటం వలన మనిషి మేధస్సు వికసిస్తుంది. ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానాలను అధ్యయనం చేసే అవకాశాన్నీ అన్యభాషలు మనిషికి కలిగిస్తాయి.


ఈ ధోరణిని కాదని, ‘నా భాషే గొప్పది’ అనే భావనలో ఉండిపోవటం అజ్ఞానం తప్ప మరొకటి కాదు. దేశంలో కొన్ని ప్రాంతాలలో భాషా దురభిమానం కనిపించే మాట నిజమే అయినా, తమిళనేలపై మాత్రం అన్ని రంగాల్లో ఈ పైత్యం బాగా పెరిగిపోయింది. తమిళులు తమ సినిమాలలో తమిళాన్ని, తమ ద్రవిడ సంస్కృతిని హైలెట్ చేసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. పట్టటం లేదు కూడా. కానీ, అదే తమిళ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేసి వదిలేటప్పుడూ, తమ వాసనలు ఉండి తీరాలని పట్టుబట్టటం అన్యభాషల ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తోంది. దీనికి తోడు, మా రాష్ట్రంలో మా భాషే మాట్లాడాలనే పట్టింపు జాస్తిగా కనిపించే రాష్ట్రాలలో తమిళనాడు ముందుంటుంది. దీనిని భాషాభిమానం అనటం కంటే భాషా దురభిమానం అనటమే సరైన మాట.

ఆదినుంచీ తమిళ గడ్డపై ఈ ధోరణి ఎక్కువగానే ఉంది. జాతీయ భాషగా ఉన్న హిందీని గౌరవించకుండా, తమిళ నేతలు సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన ఉదంతాలు, రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటనలు, పార్లమెంటులోనూ రచ్చ చేసిన సందర్భాలూ అనేకం. తమ సినిమాలలో విధిగా, తమిళాన్ని మాత్రమే వాడాలనే వారి పట్టుదల, వారి సెన్సారు బోర్డునూ ఆ కట్టుబాటులోకి ఏనాడో నెట్టేసింది. అక్కడ సినిమాపై ప్రభుత్వ పన్ను రాయితీ పొందాలంటే సినిమాల పేర్లు కచ్చితంగా అచ్చ తమిళంలో మాత్రమే ఉండాలి. పాటల్లో ఇంగ్లీష్ పదాలు కూడా సాధ్యమైనంత వరకు తక్కువ లేదా అసలే లేకుండా అక్కడి ఫిల్మ్ మేకర్స్ జాగ్రత్త పడుతుంటారు.


ఇంగ్లీషు, హిందీ భాషకు సంబంధించిన టైటిల్ సినిమాకు ఉంటే ఆ సినిమాకు ప్రభుత్వ రాయితీ వర్తించదు. ఇంతవరకు వారి భాషాభిమానాన్ని తప్పుబట్టాల్సిన పనేం లేదు. కానీ, తమ భాషను ఇతర సినీ పరిశ్రమల్లోనూ ఇదే రీతిగా వాడాలనే వారి పట్టుదల మాత్రం ఛాందసం కాక మరొకటి కాదు. ఇది ఇతర భాషల ప్రేక్షకులకు ఇబ్బంది అనే విషయం తెలిసినా, తమ మాటే చెల్లాలనే వారి మొండి పట్టుదల అన్య భాషల వారికి చీకాకును కలిగిస్తోంది. వీరి అత్యుత్సాహం చూస్తుంటే, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ తమ భాషను పాకించటమనే ఎజెండా పెట్టుకున్నారా? అనే అనుమానాలు కలగకమానవు.

ఇక డబ్బింగ్ విషయానికి వచ్చినా, వీరి భాషోన్మాదం ఇలాగే ఉంది. పేరుకు తెలుగులోకి మార్చినట్లు అనిపించినా యాస మాత్రం తమిళానిదే. చాలా సందర్భాలలో, తమిళ సినిమా పేరుతోనే డబ్ మూవీలూ రిలీజ్ చేసి, తెలుగు, తదితర భాషల ప్రేక్షకుల మొహంమీద పడేస్తున్నారు. కనీసం తెలుగు ప్రేక్షకుడికి అర్థమయ్యే టైటిల్ పెట్టాలనే సోయి ఉన్నప్పటికీ, చూడక చస్తారా అనే అహంభావమూ ఇందులో ఉంది.

అటు మేకర్స్ మాత్రం ఈ కొత్త పోకడకు సరికొత్త రీజన్ చెబుతున్నారు. రెండు టైటిల్స్ పెడితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ కష్టమౌతోందనీ, హ్యాష్ ట్యాగ్ రికార్డులు రిజిస్టర్ కావటం లేదని, అందుకే ఒకే టైటిల్‌తో అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నామని వారు ఏ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. మరి అంత రికార్డుల పిచ్చి ఉన్నప్పుడు కామన్‌గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టుకోవాలనే కామన్ సెన్స్ తమిళ నిర్మాతకు ఎందుకు లోపిస్తోందో తెలియదు. చివరికి సినిమాలోని ప్రదేశాల పేర్లు, భవనాల పేర్లు, మనుషుల పేర్లు, హీరోలు చదివే న్యూస్ పేపర్ కూడా తమిళంలోనే ఉండటంతో మనం చూస్తున్నది తెలుగులోకి డబ్ చేసిన సినిమానా లేక అచ్చమైన అరవ సినిమానా అనే అనుమానం కలగకమానదు.

ఇటీవల వచ్చిన రజనీకాంత్ ‘వేట్టయన్’( తెలుగులో వేటగాడు అని అర్థం) విషయమే తీసుకుంటే, దానిని తెలుగులో ‘వేటగాడు’ అని పెడితే తమిళ నిర్మాతకు కలిగే నష్టం ఏమిటో అర్థం కాదు. నిజానికి అదే పేరుతో గతంలో తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ సినిమా హిట్‌గా నిలిచింది గనుక అదోరకమైన పబ్లిసిటీగానూ నిలిచేది. పైగా, రజనీ లాంటి టాప్ స్టార్‌కు బాగా కనెక్ట్ అయ్యే పేరుగానూ ఉండేది. మరో విచిత్రమేమిటంటే, గతంలో వచ్చిన రజనీకాంత్ ‘రోబో’ సినిమాను మిగిలిన భాషల్లో అదే పేరుతో రిలీజ్ చేసి, తమిళనాడులో మాత్రం దానికి ‘యంతిరన్’ అనే పేరు పెట్టారు.

ప్రతి తమిళ పదానికి ఓ తెలుగు పదం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పైన చెప్పుకున్న ‘వలిమై’, ‘మహాన్‌’, ‘ఈటి’ సినిమా పేర్లకు తెలుగు పదాలు ఉన్నాయి. వలిమై అంటే బలం. మహాన్‌ అంటే మహానుభావుడు, ఈటి అంటే తమిళ పూర్తి పేరు ‘ఎదర్కుం తునిందవన్’ అంటే ‘దేనికీ భయపడనివాడు’ అని అర్థం. కానీ తెలుగులో ఆ సినిమాలకు ఈ పేర్లు ఏవీ పెట్టలేదు. మరి, మన తెలుగు నిర్మాతలు సైతం వారిలాగే మన సినిమాలను అవే పేర్లతో తమిళ్‌లోకి డబ్ చేసి వదిలితే, అక్కడి సెన్సార్ బోర్డు అంగీకరించదు.

అక్కడి జనమూ ఆ సినిమాను ఆదరించరు. ఈ విషయం మన తెలుగు నిర్మాతలకు స్పష్టంగా తెలిసినా, వారింకా తమిళ టైటిళ్ల సినిమాలను తెలుగు ప్రేక్షకుల మీద ఎందుకు రుద్దుతున్నారో అర్థం కావటం లేదు. ఈ విషయంలో మన సెన్సార్ బోర్డు వైఖరీ తోలు మందం వ్యవహారంగానే ఉంది. సినిమా కథాంశం, చిత్రీకరణ నచ్చితే భాషతో సంబంధం లేకుండా వాటిని చూసే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. అదే తమిళ నిర్మాతలకు కలిసొస్తోంది. అయితే, అది ఇతర భాషల ప్రేక్షకుల బలహీనత కాదని వారు తెలుసుకుంటే మంచిది.

అలాగే, సినిమా విషయంలో తమిళ పరిశ్రమ తమ భాష, సంస్కృతికి ఇచ్చే గుర్తింపులో పదోవంతైనా మన తెలుగు నిర్మాతలు.. మన సినిమాల విషయంలో చూపుతున్నారా అనే ప్రశ్నకు లేదనే జవాబే వస్తోంది. కనుక, ఇకనైనా, ఈ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమతో బాటు ప్రేక్షకులూ కాస్త పట్టుదలగా వ్యవహరిస్తేనే, ఈ తమిళ పైత్యం దారికి వస్తుందని గుర్తించాలి.

Related News

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Big Stories

×