SKN Supports Kiran Abbavaram: తెలుగు ప్రేక్షకులు ఏ భాష సినిమా అయినా సొంత సినిమాగా ఆదరిస్తారు. అంతే కాకుండా కంటెంట్ బాగుంటే చాలు.. అది ఏ భాష, అందులో ఎవరు నటించారు అనే విషయాలను కూడా పట్టించుకోరు. ఒక్కొక్కసారి తెలుగు సినిమాను పక్కన పెట్టి మరీ పరభాషా చిత్రాన్ని హిట్ చేస్తారు. కానీ ఇంకా ఏ ఇతర భాషల్లో కూడా సినిమాలపై ఇలాంటి అభిమానం కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వాటికి సరిపడా థియేటర్లు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధంగా ఉంటారు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉండదు. దానిపై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం స్పందించగా.. నిర్మాత ఎస్‌కేఎన్ సైతం కిరణ్‌క సపోర్ట్‌గా ట్వీట్ చేశారు.
తక్కువ థియేటర్లు
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా సూపర్ సక్సెస్‌ను సాధించింది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఈ మూవీ చూడడానికి ప్రేక్షకులు క్యూ కట్టారు. అయితే థియేటర్ల విషయంలో మాత్రం ‘క’ సినిమాకు అన్యాయం జరిగిందని కిరణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ లాంటి చిత్రాలకు ఎక్కువ థియేటర్లు ఇచ్చి.. ‘క’కు మాత్రం చాలా తక్కువ స్క్రీన్ ఇచ్చారు. అయినా కూడా పాజిటివ్ టాక్ రావడం వల్ల ఇప్పుడిప్పుడే ఈ సినిమాకు స్క్రీన్స్ యాడ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకున్నారు. కానీ చెన్నైలో మాత్రం తమకు ఒక్క స్క్రీన్ ఇవ్వడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోలేదని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు కిరణ్.
Also Read: సక్సెస్ మంత్ర చెప్పిన కిరణ్ అబ్బవరం.. సక్సస్ అవ్వాలంటే ఇలా చేయండి.!
కిరణ్‌కు సపోర్ట్
‘క సినిమాను నేరుగా తమిళంలో విడుదల చేయమని నేను అడగడం లేదు. చెన్నైలో కనీసం 5 లేదా 10 స్క్రీన్స్ ఇస్తే ఈ సినిమాను అక్కడ తెలుగులోనే విడుదల చేసుకుంటాం. కానీ ఇప్పటివరకు అక్కడ కనీసం 5 స్క్రీన్స్ కూడా దొరకలేదు. తెలుగులో మంచి టాక్ వస్తుంది కాబట్టి చెన్నైలో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడాలనుకుంటున్నారు. నాకు కాల్స్ చేస్తున్నారు. మేము ఎంత ప్రయత్నించినా అక్కడ 5 స్క్రీన్స్ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు’’ అంటూ వాపోయాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ వీడియోను తాను ట్వీట్ చేసి దీనిపై స్పందించాడు ‘బేబి’ నిర్మాత శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్‌కేఎన్.
మర్యాద లేదు
‘మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీ.. ఇతర భాషా చిత్రాలను, హీరోలను మన సొంతవారిలాగా ఆదరిస్తాం. మనల్ని కూడా అలాగే ఆదరించడం గురించి పక్కన పెడితే.. మనకు పరభాషల నుండి కనీస మర్యాద కూడా దక్కదు. ఈ విషయం జీర్ణించుకోవడానికి మనసు రావడం లేదు’ అని ట్వీట్ చేశారు ఎస్‌కేఎన్ (SKN). ఈ నిర్మాత మాటలతో చాలామంది తెలుగు ప్రేక్షకులు సమ్మతిస్తున్నారు. శివకార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటి పర భాషా హీరోలు.. తెలుగు హీరో అయిన కిరణ్ అబ్బవరంతో పోటీపడుతున్న సమానంగా ఆదరిస్తున్నామని, అలాంటిది చెన్నైలో ‘క’కు కనీసం అయిదు స్క్రీన్స్ కూడా దక్కకపోవడం అన్యాయం అని వాపోతున్నారు.