Big Stories

Sir Movie Review :‘సార్’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే..?

Sir Movie Review : నటీనటులు : ధనుష్, సంయుక్త, సముద్రఖని, సాయికుమార్, సుమంత్‌, తనికెళ్ళ భరణి, ‘హైపర్’ ఆది, ‘ఆడుకాలమ్’ నరేన్, మొట్ట రాజేంద్రన్, హరీష్ పేరడీ, పమ్మి సాయి, భారతీరాజా తదితరులు.
ఛాయాగ్రహణం : జె. యువరాజ్
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
రచన, ద‌ర్శ‌క‌త్వం : వెంకీ అట్లూరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్య్చూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.
నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

- Advertisement -

తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇతర భాషల హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ‘వారసుడు’తో ఇళయదళపతి విజయ్‌ను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా.. ఇప్పుడు వెంకీ అట్లూరి తమిళ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా చేశాడు. ధనుష్ తొలి తెలుగు సినిమాగా రూపొందిన ‘సార్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యా రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా వెంకీ అట్లూరి రాసుకున్న కథను మెచ్చి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సతీమణి సౌజన్య నిర్మాతగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించిన ‘సార్’ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాలి..

- Advertisement -

కథ:
ఈ సినిమా కథంతా 1998-2000 కాలంలో సాగుతుంది. త్రిపాఠీ విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీనివాస్‌ త్రిపాఠి(సముద్రఖని) విద్యను వ్యాపారంగా భావిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ కాలేజీలు మూత పడేలా చేస్తాడు. అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకురావాలని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో త్రిపాఠీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను దత్తత తీసుకొని.. త్రిపాఠి విద్యా సంస్థల ఫ్యాకల్టీతో ఉచితంగా విద్యను అందిస్తామని చెబుతాడు. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెబుతుంది. దీంతో త్రిపాఠి తమ విద్యా సంస్థలో పనిచేసే జూనియర్‌ లెక్చర్లను ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తాడు. వారిలో ఒకరే బాల గంగాధర్‌ తిలక్‌ అలియాస్‌ బాలు(ధనుష్‌). అతను కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి వెళ్తాడు. దత్తత పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేయాలనేది త్రిపాఠి టార్గెట్‌ అయితే.. కాలేజీలో చదివే విద్యార్థులందరినీ పాస్‌ చేయించి ప్రమోషన్‌ సాధించాలనేది బాలు లక్ష్యం. అతని లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలు ఏంటి? త్రిపాఠి కుట్రను బాలు ఎలా తిప్పి కొట్టాడు? సిరిపురం ప్రెసిడెంట్‌(సాయికుమార్‌) బాలు సార్‌ని ఊరి నుంచి బహిష్కరించినా.. పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాడు? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెంట్‌‌లో ర్యాంక్ తెచ్చుకున్నారా? పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుని అందించాలని కృషి చేస్తున్న బాలు సార్‌కి బయాలజీ లెక్చర్‌ మీనాక్షి(సంయుక్త) ఎలాంటి సహాయం చేసింది? బాలు కారణంగా సిరిపురం యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇందులో సుమంత్ పాత్ర ఏంటి? అనేదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
‘సార్’ మూవీ కథ మనందరి జీవితంలో ఎక్కడో ఒకచోట టచ్ అయ్యే కథ. 1990లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ బిల్లు తెచ్చాక ప్రైవేట్‌ సంస్థలు ఇండియాలో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. అలా విద్య కూడా వ్యాపారంగా మారింది. ప్రైవేట్‌ విద్యాసంస్థలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ పేరుతో విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. టాలెంట్‌ ఉన్న ప్రభుత్వ కాలేజీల లెక్చరర్‌ ను ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఎక్కువ జీతాలు ఇచ్చి కొనుక్కుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థలు మూత పడే పరిస్థితి వచ్చింది. ఐటీ రావడంతో ఇంజనీరింగ్‌ స్టడీస్‌కి డిమాండ్‌ పెరిగింది. ఎంసెట్‌ కోచింగ్‌లు, బీఫార్మసీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ స్టడీస్‌ పేదవారికి అందని ద్రాక్షలా మారిపోయాయి. దీనిపై ఓ ప్రైవేట్‌ కాలేజీ జూనియర్‌ లెక్చరర్‌ చేసిన పోరాటమే ఈ సినిమా కథ. 2000 టైమ్‌లో వాస్తవంగా ఉన్న పరిస్థితులను చర్చించిన చిత్రమిది. ఆ జనరేషన్‌ స్టూడెంట్స్ ఫేస్‌ చేసిన అంశాలను ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమా మొదటి భాగం చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ధనుష్‌ తన కాలేజీల ఛైర్మెన్‌కి ఛాలెంజ్‌ చేసి జూనియర్‌ కాలేజీకి తనతోపాటు హైపర్‌ ఆది, మరో లెక్చరర్‌ ను తీసుకుని సిరిపురం జూనియర్ కాలేజ్‌కి వెళ్లడం, అక్కడ ఎదురయ్యే అనుభవాలు, స్టూడెంట్స్ కాలేజీలకు రాకుండా కూలి పనులు చేసుకోవడం, వారిని ధనుష్‌ మోటివేట్‌ చేసి తిరిగి కాలేజీకి వచ్చేలా చేయడం ఇవన్నీ కొంత సీరియస్‌గా, మరింత ఎంటర్‌టైనింగ్‌ వేలో చెప్పడం బాగుంది. దీంతో ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. మధ్యలో హైపర్‌ ఆది కామెడీ కాస్త నవ్వులు పూయిస్తుంది. మొదటి భాగం మొత్తం హీరో ఇంట్రడక్షన్‌, ఓ పాట, హీరోయిన్‌తో లవ్‌ స్టోరీ ప్రధానంగానే సాగుతుంది. సింపుల్‌ స్క్రీన్‌ప్లేతో ఓ ఫ్లోలో కథ నడుస్తుంది.

ఇక సెకండాఫ్ కథలోకి‌ టర్న్ తీసుకుంటుంది. ఎమోషనల్‌గా మారిపోతుంది. హీరో లక్ష్యాన్ని సముద్రఖని అడ్డుకోవడం, తప్పుడు కేసులు పెట్టి ఊరు నుంచి తరిమేయడం, తమకు చదువు చెప్పిన గురువు కష్టాలను చూసి చలించిపోయిన విద్యార్థులు తిరగబడటం వంటి సీన్లు గూస్‌ బంమ్స్‌తో పాటు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇక ఈ సినిమాలో కులం గురించి కూడా చర్చించారు. విద్యార్థులకు వేర్వేరుగా రెండు టాపిక్స్ చెప్పి దాని ద్వారా వాళ్లకు కులం గురించి చెప్పి కళ్లు తెరిపించే సీన్ చాలా బాగుంది. ‘అవసరానికి కులం ఉండదు’, ‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది..పంచండి. అంతేకానీ ఫైవ్‌స్టార్‌ హోటల్లో డిష్‌లా అమ్మకండి’, ‘డబ్బు మనిషికి స్టేటస్‌ను తీసుకొస్తే.. గౌరవాన్ని తెచ్చేది ఒక్క చదువు మాత్రమే’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమాలో ప్రధానంగా ఓ వైపు ప్రైవేట్‌ కాలేజీల మోసాలను, అప్పుడు గ్రామాల్లో ఉండే కుల వివక్షణను చర్చించారు. అవి ఏదో క్లాసులు పీకినట్టుగా కాకుండా, కాస్త ఎంటర్‌టైనింగ్‌గా, కాస్త ఆలోచింప చేసేలా చెప్పడం సినిమాలో హైలైట్ పాయింట్స్. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా నీట్‌గా సాగడం ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే అంశం.

సినిమా కొంత స్లోగా ఉండటం, అంతా ఊహించినట్టే జరగడం చిన్న మైనస్‌ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్ట్స్ సీన్‌ ఏం జరుగుతుందో ఆడియెన్స్ ముందే ఊహించేలా ఉండటమే ఇందులో మెయిన్‌ డ్రాబ్యాక్‌. మరోవైపు కొన్ని సీన్లలో లాజిక్స్ మిస్ అయ్యాయి. 90వ దశకంలో జరిగే ఈ కథ ఆ జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ జనరేషన్ కుర్రకారుకు ఈ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

నటీనటుల విశ్లేషణ:
బాలు(బాలగంగాధర్‌ తిలక్‌) పాత్రలో ధనుష్ అదరగొట్టాడు. లెక్చరరే అయినా కొంత మాస్‌, ఇంకొంత క్లాస్‌ లుక్‌లో మెప్పించాడు. టూమచ్‌ హీరోయిజానికి పోకుండా ఆయన పాత్ర ఎంత హై ఉండాలో, ఎంతలో ఉండాలో అలా పర్‌ఫెక్ట్ మీటర్‌లో ఉంటుంది. ఎమోషనల్‌ సీన్స్ లో సూపర్బ్ అనిపించాడు. సినిమాని తన భుజాలపై మోస్తూ తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ సినిమాతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవడం ఖాయం. బయాలజీ లెక్చరర్‌గా సంయుక్త కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అప్పట్లో లెక్చరర్స్ ఎలాంటి వస్త్రధారణలో ఉండేవాళ్లో అలా కనిపించి మెప్పించింది. హైపర్‌ ఆది పాత్ర ఫస్టాఫ్‌తోనే ముగుస్తుంది. త్రిపాఠిగా ప్రతినాయకుడి పాత్రలో సముద్రఖని తనకు అలవాటైన నటనతో ఆకట్టుకున్నాడు. తనికెళ్ల భరణి పాత్ర ఫర్వాలేదు. పబ్లిసిటీ పిచ్చి ఉన్న ఊరి ప్రెసిడెంట్‌గా సాయికుమార్‌ పాత్ర బాగా మెప్పిస్తుంది. సుమంత్‌ అతిథి పాత్రలో కనిపించాడు. వీడియోగ్రాఫర్ పాత్రలో మొట్ట నరేంద్రన్ కనిపించాడు. మొత్తంగా కాస్టింగ్ విషయంలో వెంకీ అట్లూరి అటు తమిళ వాళ్లను, ఇటు తెలుగు వాళ్లను బ్యాలెన్సింగ్‌గా తీసుకుని ద్విభాషా చిత్రానికి న్యాయం చేశాడు.

సాంకేతిక విశ్లేషణ:
‘తొలిప్రేమ’తో హిట్‌ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్‌ దే’ చిత్రాలతో నిరాశపర్చాడు. అయితే ఈ సారి ఆయన ఓ సందేశాత్మక చిత్రంతో రావడం ప్లస్ అయింది. అది కూడా ధనుష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయడంతో అందరి చూపు ఆయనపై పడింది. తను అనుకున్న కథను అనుకున్నట్లు చూపించడంలో వెంకీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో డైలాగ్‌లు హైలైట్‌గా నిలుస్తాయి. స్క్రీన్‌ ప్లే నీట్‌గా ఉంది. కథ అందరికీ తెలిసినదే కావడంతో రెగ్యూలర్‌ మూవీ అనే ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఇక యువరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ప్లజెంట్‌గా ఉన్నాయి. జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలుస్తాయి. నవీన్ నూలి ఎడిటింగ్‌ ఓకే. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్‌ఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల నిర్మాణ విలువలకు బాగున్నాయి. సినిమాను రిచ్‌గా తీశారు.

రేటింగ్: 3/5

-బిల్లా గంగాధర్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News