Big Stories

mem famous movie review : ఫేమస్ అయ్యారా..? ఫెయిల్ అయ్యారా.. మూవీ ఎలా ఉందంటే..?

mem famous movie review : ఇటీవల లోబడ్జెట్ మూవీస్ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. యువ దర్శకులు మంచి చిత్రాలు తెరకెక్కించి సత్తా చాటుతున్నారు. అందుకే బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిన్న సినిమా మేమ్‌ ఫేమస్. మరి ఈ మూవీ కథేంటి? సినిమా ఎలా ఉంది? ఆ విషయాలు తెలుసుకుందాం..

- Advertisement -

క‌థేంటంటే : మయి అలియాస్ మహేష్ అంటే సుమంత్ ప్రభాస్, బాలి అలియాస్ బాలకృష్ణ అంటే మౌర్య చౌదర్య, దుర్గ అంటే మణి ఏగుర్ల చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. బండ‌న‌ర్సింప‌ల్లిలో అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతారు. జీవితాన్ని స‌ర‌దాగా గ‌డిపేస్తుంటారు. దీంతో ఆ ఊరిలో ఎప్పుడూ వీళ్ల పంచాయితీలే జరుగుతూ ఉంటాయి. ఊరిలో ప్ర‌తి ఒక్క‌రి చేత తిట్టించుకుంటారు. దీంతో వారు ఎలాగైనా ఫేమ‌స్ అయ్యి అంద‌రితో శభాష్ అనిపించుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటారు. మ‌రి అందుకోసం మ‌యి త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఏం చేశాడు? ఫేమ‌స్ అయ్యేందుకు వాళ్లు ఎంచుకున్న దారేంటి? ఈ ప్ర‌యాణంలో పంచాయతీ ప్రెసిడెంట్ జింక వేణు అంటే కిరణ్ మచ్చా, అంజి మామ అంటే అంజి మామ మిల్కూరి వాళ్ల‌కు ఎలా స‌హాయ‌ప‌డ్డారు. మ‌యి, బాలిల ప్రేమ క‌థ‌లు ఏ గమ్యానికి చేరాయి ? ఈ విషయాలు సినిమాలో చూడాల్సిందే.

- Advertisement -

ఈ సినిమా చూస్తున్నప్పుడు జాతిర‌త్నాలు సినిమానే మ‌దిలో మెదులుతుంది. అందులోని మూడు ప్ర‌ధాన పాత్ర‌ల నేప‌థ్యానికి త‌గ్గ‌ట్లుగానే ఇందులోని పాత్ర‌లు ఉంటాయి. ఓ క్రికెట్ ఎపిసోడ్‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. మ‌యి, బాలి, దుర్గా జీవితాల‌ను ప‌రిచ‌యం చేస్తూ క‌థ ముందుకు సాగుతుంది. కానీ క‌థ‌లో డెప్త్ క‌నిపించ‌కపోవడం బిగ్ మైనస్ పాయింట్. మ‌ధ్య‌లో పెళ్లి బరాత్ సీక్వెన్స్‌, మ‌యి – మౌనిక‌ల ప్రేమ క‌థ.. బాలీ-బ‌బ్బీల ల‌వ్ ట్రాక్ బోర్ కొట్టిస్తాయి.

ఫేమ‌స్ టెంట్ హౌస్ అనే కాన్సెప్ట్ తో సినిమాను సాగదీస్తూ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఓ ఎమోష‌నల్ సీక్వెన్స్‌లో ఫస్టాప్ కు విరామ‌మిచ్చిన తీరు బాగుంది. సెకండాఫ్ లో మ‌యి బ్యాచ్ ఫేమ‌స్ అయ్యేందుకు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టి ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది చూపించారు. కొన్ని ఫ్యామిలీ ఎమోష‌న్ ట్రాక్స్ ఇరికించి క‌థ‌ను బ‌రువెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ పాత్ర కాస్త‌ నవ్వులు పంచుతుంది.

హీరోగా మ‌యి పాత్ర‌లో సుమంత్ ఫ‌ర్వాలేద‌నిపించాడు. అత‌ని స్నేహితుల పాత్ర‌ల్లో మ‌ణి, మౌర్య ప‌రిధి మేర‌కు నటించారు. హీరోయిన్లు పక్కింటి అమ్మాయిల త‌ర‌హాలో చాలా సింపుల్‌గా క‌నిపించినా న‌ట‌న ప‌రంగా వారికి పెద్ద స్కోప్ లేదు. అంజి మామ‌, కిర‌ణ్ మ‌చ్చా, ముర‌ళీధ‌ర్ గౌడ్ పాత్ర‌లు గుర్తుంచుకునేలా ఉంటాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ పాత్ర‌లో శివ‌నంద‌న్ కామెడీ టైమింగ్ బాగుంది.

మొత్తంమీద మేమ్ ఫేమస్ మూవీ అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. కొత్త‌ద‌నం లేని క‌థ‌, సాగ‌తీత‌ స‌న్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.  

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News