Lucky Baskhar Collection Day 2: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) ఈమధ్య కాలంలో నేరుగా తెలుగు సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం లక్కీ భాస్కర్ (Lucky bhaskar) దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమా అమావాస్య కారణంగా ఒకరోజు ముందుగానే అనగా అక్టోబర్ 30వ తేదీన విడుదలై, మొదటి రోజే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
లక్కీ భాస్కర్..
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary)హీరోయిన్ గా నటించింది. ఇందులో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, మానస చౌదరి, సచిన్ ఖేడ్కర్ ,సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పించిన ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ , కన్నడ, మలయాళం భాషలో చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. ఇకపోతే తెలుగు నాట ఈయనకున్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని లక్కీ భాస్కర్ సినిమాకి అటు థియేట్రికల్ , ఇటు నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీగా డిమాండ్ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే రూ.15 కోట్ల మేరా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం.
లక్కీ భాస్కర్ 2 డేస్ కలెక్షన్స్..
ఇకపోతే నటీనటుల పారితోషకం , సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్ తో పాటు ఇతర ఖర్చులు , ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని కలుపుకొని లక్కీ భాస్కర్ సినిమా కోసం రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు రూ.35 కోట్ల షేర్ రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కోటి రూపాయలకు పైగా అందుకున్న ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ .12.7 కోట్లు రాబట్టింది. ఇక రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే .. ప్రపంచవ్యాప్తంగా రూ .13.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక రెండు రోజుల్లో రూ.26.2 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. మొత్తానికైతే చిత్ర మేకర్స్ పోస్టర్ తో సహా ఈ కలెక్షన్ వివరాలు వెల్లడించారు.
మలయాళ హీరోకి తెలుగులో కలిసొచ్చిందే..
దుల్కర్ సల్మాన్ తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. మహానటి సినిమా ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగులో సీతారామం సినిమాను నేరుగా చేసి, మరో రికార్డు సృష్టించారు. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. మొత్తానికైతే మలయాళ హీరో అయినా తెలుగులో మాత్రం భారీగా పాపులారిటీ లభించడంతో ఈయన వరుస సినిమాలు ఇక్కడే ప్లాన్ చేసేలా కనిపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.