Jai Hanuman Theme Song: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రస్తుతం టాలీవుడ్‌లో మామూలు క్రేజ్ లేదు. ఇతర దర్శకులలాగా కాకుండా దేవుళ్ల కథలతో సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్. ఇప్పటికే తను క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ నుండి ‘హనుమాన్’ అనే మూవీ విడుదలయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇంతలోనే దీపావళి సందర్భంగా ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma).
రాముడి పాట
‘చీకటి యుగంలో కూడా ఆయన విధేయత చెక్కుచెదరదు. ఆయన ప్రభువు శ్రీ రాముడికి ఇచ్చిన మాట కోసం’ అంటూ ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్‌ను విడుదల చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ థీమ్ సాంగ్ హనుమంతుడి గురించి కాకుండా శ్రీ రాముడి గురించి ఉండడం విశేషం. దాశరథి అంటూ రాముడిని స్మరిస్తూ ఈ థీమ్ సాంగ్ సాగుతుంది. ఇక ఈ థీమ్ సాంగ్ చివర్లో జై హనుమాన్ అంటూ ఒక శ్లోకం వినిపిస్తుంది. అదే ఈ పాట మొత్తానికి హైలెట్. ‘జై హనుమాన్’ (Jai Hanuman) థీమ్ సాంగ్‌కు ఓజస్ సంగీతాన్ని అందించగా.. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. రేవంత్ ఈ పాటను పాడాడు. మొత్తానికి ఫస్ట్ లుక్‌తో పాటు ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెగా హీరో.. వధువు ఎవరంటే..?
రీసెర్చ్ తర్వాత
‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ‘హనుమాన్’ మూవీలో క్లైమాక్స్‌లో హనుమంతుడిని చూపించినా అది సీజీతో తయారు చేశారు. కానీ ‘జై హనుమాన్’లో మాత్రం అలా చేస్తే కుదరదు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం హనుమంతుడి చుట్టే తిరుగుతుంది కాబట్టి. అందుకే సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీ మొత్తం వెతికి ఫైనల్‌గా రిషబ్ శెట్టి (Rishabh Shetty)ని హనుమంతుడిగా ఫైనల్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని మూవీ టీమ్ అనౌన్స్ చేయకపోయినా ఏదో ఒక విధంగా బయటికొచ్చింది. అయినా కూడా చాలావరకు ప్రేక్షకులు దీనిని నమ్మడానికి సిద్దంగా లేరు.
నెగిటివ్ కామెంట్స్
ఫైనల్‌గా దీపావళి సందర్భంగా రిషబ్ శెట్టిని హనుమంతుడిగా పరిచయం చేస్తూ ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు ప్రశాంత్ వర్మ. చాలామంది ఈ ఫస్ట్ లుక్‌కు పాజిటివ్ రివ్యూలు ఇవ్వగా కొందరు మాత్రం దీని గురించి నెగిటివ్‌గా మాట్లాడారు. తెలుగు హీరోల్లో హనుమంతుడి పాత్ర చేయడానికి ఎవరూ దొరకలేదా అని, సీజీతోనే మ్యానేజ్ చేయొచ్చు కదా అని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేశారు. కానీ చాలావరకు ప్రేక్షకులు హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి న్యాయం చేస్తాడని నమ్ముతున్నారు. ‘కలియుగంలో ఇంకా అఘ్నాతవాసమే చేస్తున్నాడు. తన ప్రభువు శ్రీ రాముడికి ఇచ్చిన మాట కోసం’ అంటూ ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ.