Kollywood: తాజాగా దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. అందులో రెండు తెలుగు చిత్రాలు.. ఒకటి తమిళ్ , మరొకటి కన్నడ. ఇలా నాలుగు సినిమాలు పోటీ పడగా.. తెలుగు బాక్సాఫీస్ వద్ద తమిళ్ సినిమా దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. ఆ చిత్రాల విషయానికొస్తే.. రెండు తెలుగు చిత్రాలైన లక్కీ భాస్కర్ (Lucky bhaskar), క (Ka)చిత్రాలు కాగా, తమిళ్ మూవీ అమరన్(Amaran), కన్నడ మూవీ భగీర (Bagheera) అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులో నేరుగా సినిమా చేశారు. ఈయనకు మలయాళంతో పాటు తమిళ్లో మార్కెట్ ఉండడం వల్ల బాగానే థియేటర్లు లభించాయి..
దీనికి తోడు కేరళలో దుల్కర్ సల్మాన్ తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి థియేటర్లలో ఆయన సినిమా నేరుగా రిలీజ్ అవ్వడంతో పోటీగా వేరే సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి అక్కడ వెనక్కి తగ్గారు. అయితే తమిళనాడులో మాత్రం తెలుగు సినిమాకి థియేటర్లు ఇచ్చే విషయం పైన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)సంతృప్తిగా లేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోవడం కాస్త బాధాకరమని చెప్పాలి. తమిళనాడులో తెలుగు సినిమాలకు చిన్న చూపు చూస్తున్నారా? అవమానిస్తున్నారా ? అంటే అవునని చెప్పలేము.. అలా అని కాదని చెప్పలేము.
దీనికి తోడు పండుగ ఏదైనా సరే తమిళ ఇండస్ట్రీలో తెలుగు డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు చాలా తక్కువగా ఇస్తున్నారు అనే వార్త కూడా ఎప్పటినుంచో తెరపైకి వచ్చింది. గతంలో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమాలు తెలుగులో విడుదల అయ్యి భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి.. కానీ తెలుగు సినిమాలు మాత్రం తమిళ్లో విడుదల చేయకుండా అప్పుడు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ దీపావళి కి కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
మొత్తం నాలుగు సినిమాలు దీపావళి సందర్భంగా విడుదల అవ్వగా తమిళ్ లో కిరణ్ అబ్బవరం క సినిమాకి సరిగ్గా థియేటర్లు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న అమరన్ సినిమాతో పాటు బ్లడీ బగర్ అనే మరో సినిమా తీసేసి ‘ క ‘ సినిమాకి థియేటర్ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినా హౌస్ ఫుల్ అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఏరియాలో తెలుగు వాళ్ళు ఉంటే, సినిమా వేసిన సంగతి వాళ్లకి తెలిసి ఉంటే తప్ప అక్కడ హౌస్ ఫుల్ అయ్యే అవకాశాలు ఉండవు. దీనికి తోడు అక్కడి తెలుగు వారికి హాలిడే కూడా ఉండాలి. మరో వైపు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న, హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్న సినిమాలను తీసి తెలుగు వర్షన్ మూవీకి ఎందుకు ఇవ్వాలి అనే తమిళ వాళ్ళ ఆలోచన కూడా అయి ఉండవచ్చు.
కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఆలోచించకుండా అన్ని భాషల సినిమాలకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ కూడా తమిళ్ సినిమా అయినా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఎవరైనా సరే వ్యాపారమే చేస్తారు. థియేటర్ యజమానులైనా.. డిస్ట్రిబ్యూటర్స్ అయినా సరే దీనిని ఒక వ్యాపారంగానే భావిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే అటు తమిళ్ ఇటు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు సంయుక్తంగా మాట్లాడుకొని సినిమాలను విడుదల చేస్తే ఇలాంటి వాదనలు మళ్ళీ రావని చెప్పడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.