Hero Darshan Apology: ప్రముఖ కన్నడ హీరో దర్శన్ (Darshan ) వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాలపాటు మధ్యంతర బెయిల్ పొందారు. నిన్న కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు దర్శన్ ను తన పాస్ పోర్ట్ ని ట్రైల్ కోర్టు ముందు సరెండర్ చేయాలని కూడా సూచించింది. గత రెండు నెలలకు పైగా బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్ ఆరోగ్య కారణాల వల్ల ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన ఈయనకు ఎట్టకేలకు కొద్ది రోజులు జైలు జీవితం నుండి విముక్తి కలిగింది.
మధ్యంతర బెయిల్ మంజూరు..
ప్రేయసి కోసం అభిమాని అయిన రేణుకా స్వామి (Renuka Swamy) ని దాదాపు 17 మంది గ్యాంగ్ తో కలిసి అత్యంత కిరాతకంగా హీరో దర్శన్ హత్య చేయించిన విషయం తెలిసిందే. ఇక జూన్ 11న ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. అలా బెంగుళూర్ పరప్పన అగ్రహారం జైల్లో హాయిగా వున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు . కానీ ఎప్పుడైతే పరప్పన అగ్రహారం జైల్లో దర్శన్ కు విఐపి సౌకర్యాలు లభిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయో.. అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవడంతో.. ఆయనను బళ్లారి జైలుకు తరలించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం ఒక ఎత్తైతే, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం ఇంకో ఎత్తు. ఈ నేపథ్యంలోనే వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. వైద్య పరీక్షల నిమిత్తం ఈయన వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలని, లేకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు ఇచ్చిన నివేదికను దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో సమర్పించారు
జైలు సిబ్బందికి దర్శన్ క్షమాపణలు..
ఇక తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ కొంతమందికి క్షమాపణలు తెలియజేశారు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అంటూ జైలు సిబ్బందికి క్షమాపణలు కోరినట్లు సమాచారం.. “నేను బళ్లారి జైల్లో ఉన్నప్పుడు.. అది కావాలి, ఇది కావాలి అని పదే పదే అడిగి జైలు సిబ్బందికి విసుగు తెప్పించాను. దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి.”అంటూ క్షమాపణలు కోరారు. అటు సిబ్బంది కూడా దర్శన్ కు శుభాకాంక్షలు తెలిపారు. “మెరుగైన వైద్యం చేయించుకోండి.. ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి” అని జైలు సిబ్బంది దర్శన్ కి చెప్పినట్టు తెలిసింది. దర్శన్ బళ్లారి జైల్లో చేరినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి డిమాండ్లు చేస్తూనే వచ్చారట. ముందుగా జైల్లో టీవీ కావాలని , ఆ తర్వాత కుర్చీ కూడా కావాలని డిమాండ్ చేయడంతో ఆయన డిమాండ్లు అన్నీ కూడా పోలీసు సిబ్బంది నెరవేర్చినట్లు సమాచారం. ఇక దర్శన్ విషయానికి వస్తే ఒకప్పుడు వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు హత్య కేసులో ఊహించని నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఏదేమైనా ఒక స్టార్ హీరో ఇలాంటి కేసులో ఇరుక్కోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.