Dulquer Salmaan: హీరోలు అందరి స్క్రిప్ట్ సెలక్షన్ ఒకేలాగా ఉండదు. కొందరు హీరోలు మాస్ ఫాలోయింగ్ కోరుకుంటారు. కొందరు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవ్వాలనుకుంటారు. కొందరు కొత్త స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనుకుంటారు. అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ కూడా ఒకడు. మలయాళ హీరో అయినా కూడా నేరుగా తెలుగు, హిందీ, తమిళంలో కూడా సినిమాలు చేసిన ఏకైక హీరో దుల్కర్. తాజాగా తను మాస్ కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువ మొగ్గుచూపకపోవడానికి కారణం ఏంటో బయటపెట్టాడు ఈ స్మార్ట్ హీరో.
వారికే ఆ హక్కు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)కు ‘కింగ్ ఆఫ్ కోట’తో బ్రేక్ పడింది. ఆ సినిమా భారీ బడ్జెట్‌తో, ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యి ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘లక్కీ భాస్కర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలోనే అసలు తన సినిమాల్లో పంచ్ డైలాగులు ఎందుకు ఉండవో బయటపెట్టాడు దుల్కర్ సల్మాన్. ‘‘కొంతమంది అతిపెద్ద సూపర్ స్టార్లకు మాత్రమే పంచ్ డైలాగులు చెప్పే హక్కు ఇచ్చేశాం. నాలాంటి యాక్టర్లు అలాంటి డైలాగులు చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు’’ అని ముక్కుసూటిగా చెప్పేశాడు దుల్కర్ సల్మాన్.
Also Read: బాక్స్ ఆఫీస్ వద్ద దివాళీ విన్నర్ గా నిలిచిన చిత్రాలు ఇవే..!
ఆ లెవెల్‌కు చేరుకోవాలి
‘‘నాలాంటి యాక్టర్లు అలాంటి డైలాగులు చెప్పడానికి ప్రయత్నించినా మేము ఇంకా ఆ లెవెల్‌కు చేరుకోలేదని ఆడియన్స్ అనే అవకాశం ఉంది. అలాంటి డైలాగులు చెప్పాలంటే ముందుగా ఒక లెవెల్‌కు చేరుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్. మామూలుగా దుల్కర్ సినిమాలంటే మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ లాంటివి ఎక్కువశాతం ఉండవు. కానీ ‘కింగ్ ఆఫ్ కోట’తో రూటు మార్చాలనుకున్న ఈ హీరో.. అందులో ఇలాంటి కొత్త ప్రయోగాలు చేశాడు. కానీ వాటిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే దుల్కర్ ఇలా ఫిక్స్ అయ్యాడేమో అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. పంచ్ డైలాగులు ఎప్పుడు చెప్తారు అనే ప్రశ్నకు తను సమాధానమిచ్చాడు.
సమయం పడుతుంది
‘‘పంచ్ డైలాగులు చెప్పి ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి నాకు మరింత సమయం పడుతుంది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) మూవీ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకంటే ఒకరోజు ముందు నుండే ఈ సినిమాకు ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షో నుండే ‘లక్కీ భాస్కర్’కు పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ అంతా తెగ హ్యాపీగా ఉంది. ఇందులో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటించింది. ఇదొక ఫ్యామిలీ డ్రామా అయినా ఇందులో సరిపడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి.