EPAPER

Darshan Charge Sheet: మర్మాంగాలపై తన్ని, షాకిచ్చి.. తలను ఛిద్రం చేసి.. రేణుకాస్వామి ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలు

Darshan Charge Sheet: మర్మాంగాలపై తన్ని, షాకిచ్చి.. తలను ఛిద్రం చేసి.. రేణుకాస్వామి ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలు

రేణుకాస్వామి హత్య చేసిన తర్వాత దర్శన్ కొంత మందికి డబ్బు ఇచ్చి, వారిని బెంగళూరు పోలీసులకు లొంగిపోవాలని పంపించి, తర్వాత మైసూరు వెళ్లిపోయాడని గతంలోనే పోలీసులు తెలిపారు. ఆ తర్వాత, మైసూరుకు వెళ్లిన బెంగళూరు ఏసీపీ చందన్.. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న దర్శన్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత, అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో దర్శన్‌ను విచారించినప్పుడు.. ఇంటరాగేషన్ సమయంలో కూడా మా కుర్రాళ్లు ఏం చేశారో తనకు తెలియదనే దర్శన్ చెప్పాడు. వాళ్లు ఏం చేశారో నాకు తెలియదు.. నాకు తెలియని విషయాలు నన్ను అడగవద్దు అని ఓవరాక్షన్ చేసినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే, కేసులో సాక్ష్యాలు, కీలక ఆధారాలు బయటపెట్టడంతో హీరో దర్శన్ సైలెంట్ అయ్యాడు. అరెస్ట్ అయిన దగ్గర నుండి ఛాలెంజింగ్ స్టార్, బెయిల్ మీద బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే, బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది రాజకీయంగా దుమారం రేగడంతో దర్శన్‌ను ప్రస్తుతం బళ్లారిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.

వాస్తవానికి, హత్య జరిగిన కొన్ని రోజులకే కేసులో మరో నిందితుడైన కారు డ్రైవర్ రవి పోలీసులకు లొంగిపోయాడు. అతడి వాగ్మూలం తర్వాతే ఈ కేసులో దాదాపు కీలక సాక్ష్యాలన్నీ వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా చార్జ్‌షీట్ పకడ్బంధీగా రూపొందించారు పోలీసులు. రేణుకాస్వామి అసభ్యకర మెసేజ్‌ల క్రమంలో తనను చంపేద్దామనే ముందస్తు ఉద్దేశంతోనే దర్శన్ రేణుకాస్వామిని తీసుకొచ్చినట్లు అందులో పేర్కొన్నారు. దీని కోసం, రాఘవేంద్ర అనే దర్శన్ అభిమాన సంఘ నాయకుడితో రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకొచ్చారు. తన అభిమాన హీరో దర్శన్‌ను కలిపిస్తామని మాయ మాటలు చెప్పడంతో రేణుకాస్వామి సంతోషంగా వారితో వెళ్లినట్లు డ్రైవర్ రవి చెప్పాడు.


అయితే, తనపై దాడి జరుగుతుందని రేణుకాస్వామి ఏమాత్రం ఊహించలేదు. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుండి బెంగళూరుకు సుమారు 200 కిలోమీటర్ల కార్లో తీసుకొచ్చారు. బెంగళూరు చేరుకున్న తర్వాత, రేణుకాస్వామిని కామాక్షిపాళ్యలోని ఒక షెడ్‌కు తీసుకెళ్లారు. అక్కడ దర్శన్, అతని సహాయకులు స్వామిని అతి కిరాతకంగా హింసించారు. ఈ దాడితో చివరికి స్వామి మరణించాడు. ఓ కాలువ పక్కనే చెత్తలో పడేసిన బాడీని తర్వాత ఓ ఫుడ్ డెలివరీ బాయ్ చూశాడు. కుక్కలు తింటున్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడ నుండీ పోలీసుల చేసిన విచారణలో దర్శన్ అసలు రూపం బయటపడింది.

ప‌విత్ర గౌడ‌, దర్శన్‌తో పాటు ఇత‌ర నిందితుల‌పై వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. రేణుకాస్వామి తీవ్రమైన గాయాలతో త‌న‌ను వేధించ‌వ‌ద్దని అభ్యర్థిస్తున్న ఫోటో ఒక‌టి ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దెబ్బలు తాళ‌లేక ఏడుస్తున్న వైనం ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. అలాగే, రేణుక స్వామి చేయి తెగిప‌డిన‌ట్టు ఉన్న ఫోటో కూడా వైర‌ల్ అయ్యింది. నిందితుల మొబైల్ నుంచి దీనిని పోలీసులు సేక‌రించినట్లు తెలుస్తోంది. ర‌క్తపు మ‌ర‌క‌ల‌తో ఉన్న ప‌విత్ర చెప్పులు కూడా చార్జ్‌షీట్‌లో బలమైన ఆధారంగా పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో పవిత్ర రేణుకాస్వామిని చెప్పుతో కొట్టగా చెప్పులకు రక్తం మరకలు అంటినట్లు తెలిపారు.

ఆధారాల్లో భాగంగా… పోలీసులు సీసీటీవీ, డీవీఆర్‌ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ఆ రోజు రాత్రి రెండు కార్లలో తీసుకెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. రోజులు గడిచేకొద్దీ నటుడు దర్శన్‌పై సాక్ష్యాలు గట్టిపడ్డాయి. దర్శన్‌పై హత్య అభియోగాలు మోపేందుకు అన్ని ఆధారాలు సేకరించారు. శవపరీక్ష నివేదిక హత్యకు సంబంధించిన క్రూరమైన స్వభావానికి సాక్ష్యంగా నిలిచింది. కరెంట్ షాక్, రక్తస్రావం మరణానికి కారణమని పేర్కొంది. స్వామి శరీరంపై 15 గాయాలు, తల, పొత్తికడుపు, ఛాతీ, ఇతర భాగాలపై గాయాలున్నట్లు నివేదికలో గుర్తించారు. అదనంగా, అతని తలను ఒక మినీ ట్రక్కుకు వేసి బలంగా కొట్టారు. ఇది ప్రాణాంతక గాయాలకు కారణం అయ్యింది. తన బూటు కాలితో రేణుకాస్వామి మర్మాంగంపై దర్శన్ తన్నడంతోనే అతడు మరణించాడని విచారణలో వెల్లడయ్యింది. హింసకు ఉపయోగించిన ట్రక్కు, చెక్క దుంగలు, లెదర్ బెల్ట్, తాడుతో సహా ఇతర సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మలైక అరోరా తండ్రి ఆత్మహత్య, 6వ అంతస్తుపై నుంచి దూకి.. కారణం ఇదేనా?

ఇక, రేణుకాస్వామిని హత్య చేయడానికి దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పవిత్ర గౌడ కోరిక తీర్చడానికే దర్శన్‌ ఈ కేసులో ఇతర నిందితులను ప్రేరేపించి, కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్థారించారు. అందుకే, రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1 నిందితురాలిగా ఉండగా, దర్శన్ ఏ2గా ఉన్నాడు. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. అలాగే- 50 మందికి పైగా పోలీసులు, ఎనిమిది మంది డాక్టర్లు, 97 మంది ఇతర సాక్షుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెక్షన్ 164 సీఆర్పీసీ కింద 27 మంది తమ వాంగ్మూలాలను కోర్టు ముందు నమోదు చేసుకున్నట్లు వివరించారు.

ఈ ఉదంతం రాజకీయ దుమారానికి కూడా దారి తీసింది. కర్నాటక హోం మంత్రి, జి పరమేశ్వర దర్శన్‌కు జైలులో రాచమర్యాదలు జరిగేలా చూశారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలను కర్నాటక అధికార నేతలంతా ఖండించారు. అలాగే, రేణుకాస్వామి హ‌త్య అనంత‌రం కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని ద‌ర్శన్ ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులను కోరిన‌ట్లు వాట్సాప్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ద‌ర్శన్‌ని అరెస్ట్ చేసాక అత‌డి మోబైల్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ చాట్‌ని ప‌రిశీలించారు. ఈ క్రమంలో హ‌త్య అనంత‌రం ద‌ర్శన్ ఎవ‌రెవ‌రితో మాట్లాడాడు? ఎవ‌రితో చాటింగ్ చేసాడు? ఎవ‌రికి వాట్సాప్ ద్వారా ట‌చ్‌లోకి వెళ్లాడు? వంటి డేటా అంతా తీసారు. ఇందులో క‌న్నడ‌లో ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులంతా అత‌డికి ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇలా, హ‌త్యకు సంబంధించి ద‌ర్శన్ ప్రణాళిక వేసిన త‌ర్వాత త‌ప్పు మీద త‌ప్పు చేసుకుంటూ వెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఒక త‌ప్పును క‌ప్పి పుచ్చడానికి మ‌రో త‌ప్పు.. ఆ త‌ప్పు నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి మ‌రో త‌ప్పు ఇలా? ఎన్నో త‌ప్పులు ద‌ర్శన్ వైపు నుంచి క‌నిపిస్తున్నాయ‌ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ప్రాధ‌మిక విచార‌ణ‌, పోలీసులు సేక‌రించిన సాక్షాలు, ఇత‌ర ఆధారాలు, రిపోర్టులు అన్నీ ద‌ర్శన్‌కి, పవిత్రకు వ్యతిరేకంగా ఉండ‌టంతో కేసు నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఏమాత్రం ఛాన్స్ క‌నిపించ‌ట్లేదు. రేణుక స్వామి హత్యకు కుట్ర పన్నడం, దాన్ని అమలు పరచడం, కిడ్నాప్, చిత్రహింసలు పెట్టడం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తామే హత్య చేసినట్లుగా నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రరేపించడం, దీని ద్వారా కేసు దర్యాప్తు, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్‌ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడల పాత్ర ఉందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం, కన్నడ సినీ పరిశ్రమ నుండి కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదని ఉపేంద్ర లాంటి కొందరు నటులు చెబుతుండగా.. రమ్య, చేతన్, సుదీప్ లాంటి వారు రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, రేణుకాస్వామి భార్య, అతని తల్లిదండ్రులు దర్శన్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పరపతిని వాడుకొని ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని వదిలేస్తే అది సమాజంలో చెడు సంకేతాలకు దారి తీస్తుందని పలు సంఘాలు కూడా చెబుతున్నాయి. అయితే, చార్జ్‌షీట్‌ వ్యవహారం పూర్తయిన తర్వాత, దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక, కొందరు అభిమానులు మాత్రం దర్శన్ చేసిన దానధర్మాలే ఆయనను కాపాడతాయని అంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై సినిమాలు కూడా తీయాలని కొందరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శన్ జీవితం, దర్శన్ గతంలో పలుమార్లు జైలు పాలైన సంగతులు, ఇప్పటి హత్య కేసు అన్నింటిని మిళితం చేసి సినిమాలు తీయాలని కన్నడ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. డి గ్యాంగ్, ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయాలని పలువురు నిర్మాతలు కోరినట్లు సమాచారం. అయితే, త్వరలోనే దర్శన్ కేసుకు సంబంధించిన సినిమా కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఏది ఏమైనా, ఈ కేసు తెరమీద హీరోలోని విలన్‌ని చూపించిదనడంలో సందేహం లేదు.

Related News

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Kanguva Release Date: అక్టోబర్ నుంచి నవంబర్ కి, కంగువ డేట్ మారింది అరాచకం మాత్రం మారదు

Johnny Master arrest: పోలీసులకు చిక్కిన జానీ మాస్టార్, హైదరాబాద్‌‌కు తరలింపు

Ram Charan’s RC16 : బుచ్చిబాబు మాస్ ప్లాన్… రామ్ చరణ్ కోసం తంగలాన్ టీం..

Jani Master: జానీ మాస్టర్‌కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

Big Stories

×