EPAPER

Brahmanandam Birthday : హాస్య నటకిరీటి.. ఆనందోబ్రహ్మ.. బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్..

Brahmanandam Birthday : హాస్య నటకిరీటి.. ఆనందోబ్రహ్మ.. బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్..
Brahmanandam Birthday

Brahmanandam Birthday : ఎదుటివారిని నవ్వించాలంటే ఒక చిత్రమైన పని చేయాలి లేదా తమాషా విషయాన్ని చెప్పాలి.. కానీ ఒక మహానుభావుడిని చూస్తే చాలు.. ఉన్నపళంగా నవ్వేయాలనిపిస్తుంది. అనిపించడం ఏంటి.. నవ్వేస్తారు కూడా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మన ఊహలోకి వచ్చారంటే మది మురిసిపోవడం ఖాయం. ఆయనే హాస్యనట చక్రవర్తి.. బ్రహ్మానందం. రేలంగి, పద్మనాభం, అల్లు రామలింగయ్య తర్వాత హాస్య నటనలో వారిని మించిపోయి తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పువ్వులు పూయించే వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే ఒక సినిమా నిడివో.. ఒక పెద్ద పుస్తకమో చాలదు కానీ..ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి ఆనాటి సినిమాల నుంచి ఈనాటి మీమ్స్ అని చెప్పుకునే సోషల్ మీడియా వ్యంగ్యోక్తుల వరకూ అన్నీ సాక్షులే. దటీజ్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మా..నందం అని పేరు పెట్టారు. ఈరోజు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..


ప్రముఖ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం ఫిబ్రవరి 1,1956 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. విద్యాభ్యాసం తరువాత తెలుగు సాహిత్యంలో M.A పట్టా పుచ్చుకున్న బ్రహ్మానందం.. అత్తిలిలో 9 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందంను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది అంటారు. కానీ.. అహ నా పెళ్ళంట సినిమాకంటే ముందు బ్రహ్మానందం నటించిన సినిమా శ్రీ తాతావతారం. దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ బ్రహ్మానందంను ఈ సినిమా ద్వారా నటనకు పరిచయం చేశారు. నటుడిగా బ్రహ్మానందంగా అరంగేట్రం చేసిందీ.. తొలి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే కావడం విశేషం. నరేష్ హీరోగా నటించిన ” శ్రీ తాతావతారం” మూవీలో నటించారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ “అహ! నా పెళ్ళంట!” సినిమాలో అరగుండుగా వీరవిహారం చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఇక ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ.. పాత్ర ఏదైనా బ్రహ్మానందం అందులో జీవించేవారు.

మూడున్నర దశాబ్ధాల కెరీర్ లో దాదాపు 1000 కి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు. సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ హీరోలకు కూడా బ్రహ్మానందం ఫేవరేట్ గా మారిపోయాడు. ఆయన వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయని, స్టార్ హీరోలకు మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన సినీ ప్రస్థానంలో చేసినవన్నీ అద్భుత పాత్రలే అయినప్పటికీ.. అరగుండు, ఖాన్ దాదా, మైఖెల్ జాక్సన్, కిల్ బిల్ పాండే, చిత్రగుప్త, మెక్ డోల్డ్ మూర్తి, భట్టు, బద్ధం భాస్కర్, గచ్చిబౌలి దివాకర్, శాస్త్రి, చారి, హల్వా రాజ్, పద్మశ్రీ, ప్రణవ్, జయసూర్య, నెల్లూరు పెద్దారెడ్డి లాంటి పాత్రలు మాత్రం ఎవర్గ్రీన్ గా నిలిచిపోతాయి. అలాగే అలనాటి హీరోలు మొదలు కొని మూడు తరాల వారితో కలిసి కామెడీ పండించిన భాగ్యం దక్కిన ఏకైక కమెడియన్ బ్రహ్మానందం.


అంతేకాదు బ్రహ్మానందం గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు కూడా. మరోవైపు సోషల్ మీడియాలో బ్రహ్మానందం క్రేజ్ అసమాన్యమైనది. సందర్భం ఏదైనా బ్రహ్మానందం ఇమేజ్ లేని మీమ్స్ లేవంటే అతిశయోక్తి లేదు. బ్రహ్మానందం పలికించిన హావాభావాల ప్రాధాన్యత.. పాపులారిటి.. అలాంటిది మరి. జంబలకిడి పంబ, చిత్రం భళారే విచిత్రం, మనీ, వినోదం అనగనగా ఒక రోజు, మన్మథుడు, అతడు, దూకుడు, అదుర్స్, రేసుగుర్రం ఇలా.. జాతిరత్నం దాకా ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. బ్రహ్మానందం సినీ ప్రస్థానంలో 1250 సినిమాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం.

బ్రహ్మానందంకు.. సినీ కెరియర్ లో ఆరు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్, మూడు సైమా అవార్డులు వరించాయి. అహ నా పెళ్ళంట సినిమాలో అరగుండు పాత్ర ద్వారా తొలి నంది అవార్డు అందుకున్నారు. ఐదు కళాసాగర్ పురస్కారాలు, తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు, పది సినీగోయర్స్ పురస్కారాలు, ఎనిమిది భరతముని పురస్కారాలు, రాజీవ్ గాంధీ సద్భావనా పురస్కారం, అలాగే వివిధ దేశాల నుంచి తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌, జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి, స్వర్ణ కమలాలతో “కనకాభిషేకం” చేశారు.2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆయన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిన బ్రహ్మానందం తనలోని మరో కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. అద్భుత పెన్సిల్ స్కెచ్ లతో ఫ్యాన్స్ తో ఔరా అనిపించుకున్నారు . అల వైకుంఠపురంలో సినిమాలో రాములో రాములా పాటలో తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇటీవల బ్రో మూవీ లో, రంగమార్తాండ, కీడా కోలా, గుంటూరు కారం మూవీలో నటించారు. ఇలానే మరిన్ని సినిమాలలో నటించి మనల్ని నవ్విస్తూనే ఉండాలని ఆశిస్తూ.. ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు నవ్వుతూ జీవించాలని కోరుకుంటూ.. మరొకసారి మన బ్రహ్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది మన బిగ్ టీవీ..

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×