Big Breaking.. ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా లోకాన్ని విడిచి అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నారు. కొంతమంది యుక్త వయసులో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా గుండెపోటు కారణంగా మరణిస్తే, ఇంకొంతమంది సీనియర్ సెలబ్రిటీలు వృద్ధాప్య సమస్యలతో స్వర్గస్తులవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సినీ నిర్మాతగా, నటుడిగా పేరు సొంతం చేసుకున్న జాగర్లమూడి రాధాకృష్ణ (85) (JagarlaMudi Radha Krishna) బాపట్ల జిల్లా కారంచేడు లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మరణ వార్త విని సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయన మరణానికి శాంతి చేకూరాలని కోరుతున్నారు.
సీనియర్ హీరోలతో సినిమాలు..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు రాధాకృష్ణమూర్తి. స్వర్గీయ నందమూరి తారక రామారావు(Sr.NTR )తో ఒక దీపం వెలిగింది, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తో వియ్యాలవారి కయ్యాలు, దివంగత నటుడు ఆంధ్ర అందగాడు శోభన్ బాబు (Shobhan Babu) తో కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు అలాగే స్వర్గస్తులు కృష్ణంరాజు (Krishnam Raju) తో వినాయక విజయం, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) తో ప్రతిబింబాలు వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి.. గత శనివారం తుది శ్వాస విడవడం ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.
అంత్యక్రియలు కూడా పూర్తి..
85 సంవత్సరాల వయసున్న రాధాకృష్ణమూర్తి దాదాపు 3 రోజుల క్రితం అస్వస్థతకి గురవడంతో హాస్పిటల్ లో చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వయోభార రీత్యా ఆయన మరణించినట్లు తెలుగు చిత్ర నిర్మాతల మండలి తెలిపింది. శనివారం (అక్టోబర్ 26 ) రాత్రి ఆయన మరణించగా.. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని వారు ప్రకటించారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా కారంచేడు లోనే ఆదివారం పూర్తి అయ్యాయి .అయితే ఆయన మరణించిన ఈ విషయం కాస్త లేట్ గానే వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఆయనకి ఒక కుమారుడు , ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆయన సతీమణి సంవత్సరం క్రితమే స్వర్గస్తులయ్యారు. రాధాకృష్ణమూర్తి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు నిర్మాతల మండలి కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు విషయంలో పంతం నెగ్గించుకున్న నిర్మాత..
ఇకపోతే దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన ప్రతిబింబాలు సినిమా 1982లోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల రీత్యా ఆ విడుదల కాస్త ఆగిపోయింది. కానీ అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఎందుకో కుదరలేదు. దీంతో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఎలాగైనా సరే ఆ సినిమాను విడుదల చేయాలని ఎంతో పట్టుదలతో సుమారు 40 ఏళ్ల తర్వాత అక్కినేని జయంతి సందర్భంగా ఆ సినిమాను రిలీజ్ చేసి తన పంతం నెగ్గించుకున్నారు రాధాకృష్ణమూర్తి. అలా పంతం నెగ్గించుకోవడంలో తన తర్వాతే ఎవరైనా అన్నంతగా ఆయన తనను తాను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన మరణంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. ఎక్కువగా సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకున్న జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఇప్పుడు స్వర్గస్తులయ్యారు.