Ajay Devgn: ఒక సినిమా కోసం కొందరు నటీనటులు ఎంత దూరమైనా వెళ్తారు. మూవీ ఔట్‌పుట్ బాగా రావడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అందులో భాగంగానే నటీనటులకు గాయాలు అవుతుంటాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ (Ajay Devgn) కూడా చేరాడు. ఇప్పటికే ఈ బాలీవుడ్ హీరోకు సినిమా సెట్స్ గాయాలు అయిన హిస్టరీ ఉంది. ఇక త్వరలోనే విడుదల కానున్న ‘సింగం అగైన్’ (Singham Again) సినిమా షూటింగ్ సమయంలో కూడా తన కన్నుకు గాయమయ్యిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టాడు ఈ సీనియర్ హీరో. ఇటీవల బిగ్ బాస్ స్టేజ్‌పై సల్మాన్ ఖాన్‌తో పాటు ప్రేక్షకులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు.
కన్ను కనిపించలేదు
రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘సింగం అగైన్’. సింగం అనే పేరుతో పెద్ద యూనివర్స్‌నే క్రియేట్ చేశాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇప్పుడు ‘సింగం అగైన్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం అజయ్, రోహిత్ కలిసి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 18కు వచ్చారు. బిగ్ బాస్ స్టేజ్‌పైకి రాగానే ‘సింగం అగైన్’ విశేషాలను పంచుకున్నాడు అజయ్ దేవగన్. అదే సమయంలో తాను ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో కంటిపై గాయమయ్యిందని, ఆ గాయం వల్ల రెండు, మూడు నెలల వరకు తనకు కన్ను కనిపించలేదని బయటపెట్టాడు.
Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ..లేటెస్ట్ లుక్ వైరల్..
ఆ సీన్ కోసమే
అజయ్ దేవగన్ ఈ విషయం చెప్పగానే తనకు ఈ విషయం ముందే తెలుసని తెలిపాడు సల్మాన్ ఖాన్. అసలు తను ఏ సీన్ కోసం అంత కష్టపడ్డాడో కూడా తనకు చూపించాడని తెలిపాడు. ఆ సీన్‌లో ఒక వ్యక్తి వచ్చి అజయ్ దేవగన్‌ను తలపై కొట్టాలి. కానీ కాస్త గురితప్పడంతో ఆ దెబ్బ కంటికి తగిలింది అని చెప్పుకొచ్చాడు సల్మాన్. అంతే కాకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు నటీనటులకు ఇలాంటి గాయాలు సహజమే అని అజయ్‌కు ధైర్యం చెప్పాడు. ఆ మాటను అజయ్ కూడా ఒప్పుకున్నాడు. ఈరోజుల్లో ఇలాంటి గాయాలు మరింత సహజం అని అన్నాడు. నవంబర్ 1న భారీ అంచనాల మధ్య ‘సింగం అగైన్’ విడుదలకు సిద్ధమయ్యింది.
మరోసారి అదే పాత్రలో
‘సింగం అగైన్’లో మరో స్పెషల్ సర్‌ప్రైజ్ గురించి కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైనే రివీల్ చేశారు అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి. ‘దబాంగ్’ సినిమాలో చుల్‌బుల్ పాండే అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు ‘సింగం అగైన్’లో మరోసారి చుల్‌బుల్ పాండే పాత్రతో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని తెలిపారు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన కెరీర్‌లో చుల్‌బుల్ పాండే అనేది ఒక గుర్తుండిపోయే పాత్ర. దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదే పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడని తెలియగానే ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతున్నారు.