EPAPER

Yama Temple : యముడికీ ఓ గుడి .. మన ధర్మపురిలోనే..!

Yama Temple : యముడికీ ఓ గుడి .. మన ధర్మపురిలోనే..!

Yama Temple : యముడి పేరు తలచుకోవాలని గానీ, ఆయన రూపాన్ని చూడాలని గానీ కోరుకునే వారు ఉండనే ఉండరు. మృత్యువుకు ప్రతిరూపమైన ఆయన ఎలాంటి పక్షపాతం లేకుండా ఆయువు తీరిన అన్ని జీవులనూ హరిస్తూ ఉంటాడు. అయితే ప్రాణాలను హరించే ఆ యమధర్మరాజుకీ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసే ఒక గుడి మన తెలంగాణలోనే ఉంది… ! అదెక్కడో కాదు.. జగిత్యాలకు సమీపంలో.. గొప్ప నరసింహ క్షేత్రంగా పేరుగాంచిన ధర్మపురి పట్టణంలోనే. ఇక్కడి నృసింహ ఆలయానికి అనుబంధంగా ఉన్న ప్రాంగణంలోని ఓ ఆలయంలోనే నేటికీ యమధర్మరాజు నిత్యం పూజలు అందుకుంటున్నాడు.


బ్రహ్మాండ పురాణం ప్రకారం… రోజూ కోట్లాది ప్రాణులు.. మరణానంతరం నరకానికి రావటం చూసీచూసీ యమధర్మరాజుకి దిగులు కలిగింది. దీంతో ఆయన మనశ్శాంతిని కోల్పోయి.. కొంతకాలమైనా తీర్థయాత్రలు చేద్దామని బయలుదేరాడట. అలా ఎన్ని క్షేత్రాలను దర్శించినా.. ఆయన మనసు శాంతపడలేదట. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి పావన గోదావరీ తీరాన గల ధర్మపురి క్షేత్రానికి చేరుకోగానే.. ఆయన మనసు కుదుటపడిందట. ధర్మపురి క్షేత్రమహిమను వివరిస్తూ.. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు, నారదుడు, పృథు మహారాజుకు వివరిస్తాడు.

శాసనాల ప్రకారం.. ధర్మపురిలోని ఈ యముడి ఆలయానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. జాతక దోషాలు, అనుకోని కష్టాలను ఎదుర్కొని మనశ్శాంతి కోల్పోయిన వారు.. ఈ యముడి ఆలయాన్ని దర్శించి, ఆయనను పూజించి, ఇక్కడి మండపంలోని గండదీపంలో నూనెపోసి యమునికి నమస్కరించి, భక్తితో ప్రార్థిస్తే వారి పాపాలు తొలగి మనసుకు చెప్పలేనంత ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం.


దీపావళికి రెండు రోజుల తర్వాత వచ్చే ‘యమ ద్వితీయ’ రోజు యముడు తన చెల్లెలైన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి, తిరిగి యమలోకం వెళ్లేముందు ‘ఈరోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవు’ అని వరమిస్తాడు. దీనికి ప్రతీకగా నేటికీ దీపావళి తర్వాత వచ్చే యమ ద్వితీయ నాడు వేలాది భక్తులు.. గోదావరిలో స్నానాలు చేసి ఇక్కడి యమధర్మరాజును పూజిస్తారు.

ప్రతి నెలా భరణి నక్షత్రం రోజున పెద్దసంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు. కార్తీక మాసంలో నెలంతా ఈ ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తుంది. యముడు గోదావరిలో స్నానం చేసిన స్థలానికి ‘యమకుండము’ అని పేరు. కోరలతో, యమ దండాన్ని ధరించిన భీకరాకార ఆరడుగుల భారీ విగ్రహం.. చూడగానే ఎవరికైనా పాపం చేయాలంటే భయం కలగక మానదు.

నాడు.. మార్కండేయుడికి, సావిత్రికి వరాలిచ్చిన యమధర్మరాజు.. నేటికీ తనను ఆశ్రయించిన భక్తులందిరికీ శుభాలను కలిగిస్తూ ఆశీర్వదిస్తున్న ఈ అరుదైన క్షేత్రానికి మీరూ ఓసారి వెళ్లిరండి. ఆయన శుభాశ్శీసులను పొందండి.

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×