EPAPER

Tirupati Balaji: తిరుమల గుడిలో.. అనంతాళ్వార్ గడ్డపార చూశారా?

Tirupati Balaji: తిరుమల గుడిలో.. అనంతాళ్వార్ గడ్డపార చూశారా?

Tirupati Balaji: పూర్వం శ్రీరంగంలో రామానుజాచార్యులు.. తన శిష్యుల్లో ఒకరిని తిరుమలలో స్వామి వారి పుష్పసేవకు పంపాలని భావించారు. శాశ్వతంగా తిరుమలలో ఉంటూ, వేంకటేశునికి పుష్పసమర్పణ చేయగల వారెవరైనా ఉన్నారా? అని శిష్యులను అడగ్గా, అనంతాళ్వార్ అనే శిష్యుడు సిద్ధపడ్డాడు.


అలా ఆయన తిరుమల చేరి చిన్నపూల తోటను పెంచి, భార్య సాయంతో రోజూ స్వామికి పూలదండలు కట్టి సమర్పించేవాడు. తన గురువుకు గురువైన యామునాచార్యుల వారి పేరుతో శ్రీవారి ఆలయంలో నేడు మనం చూసే (పుష్పపు అర)ను నిర్మించి ఆ దండలన్నీ అక్కడ ఉంచే ఏర్పాటు చేశారు.

అయితే.. ఎండాకాలంలో మొక్కలకు నీరు చాలక ఆలయానికి దక్షిణాన చెరువు తవ్వే పనికి పూనుకున్నాడు. ఆయన గడ్డపారతో తవ్వటం, గర్భవతి అయిన ఆయన భార్య తట్టతో మట్టి ఎత్తిపోయటం చేసేవారు. ఈ పనిలో మూడోమనిషిని వేలుపెట్టనీయటం ఆయనకు ఇష్టముండేది కాదు.


రోజూ ఉదయాన్నే స్వామికి పూలమాలలు సమర్పించి, హారతి కాగానే భార్యతో కలిసి చెరువు పనిచేసేవాడు. తనకోసం ఎంతో శ్రమిస్తు్న్న ఆ దంపతుల కష్టాన్ని చూడలేక.. శ్రీనివాసుడు 13 ఏళ్ల బాలుడిగా వచ్చి.. నేనూ సాయం చేస్తానని అనగా.. అనంతాళ్వార్ వద్దని వెళ్లగొడతాడు.

కానీ.. ఉండబట్టలేని శ్రీవారు.. అక్కడ దాక్కొని, అనంతాళ్వార్ తట్టలో మట్ట వేయగానే.. ఆయన భార్యకంటే ముందే వచ్చి.. మట్టిని దూరంగా పోసి వచ్చేవాడు. వద్దన్నా వినకుండా పనిచేస్తున్న ఈ పెంకి బాలుడిని బెదిరిద్దామనుకున్న అనంతాళ్వార్.. తన చేతిలోని గడ్డపారతో బాలుడిని అదిలిస్తాడు.

కానీ.. అది పొరబాటున బాలుడి గడ్డానికి తగిలి.. బొటబొటా రక్తం కారుతుంది. ఆ బాలుడు వేగంగా గుడిలోకి దూరి మాయమౌతాడు. బాలుడు భయపడి పారిపోయాడనుకుని అనంతాళ్వార్ చెరువు పనిలో పడిపోతాడు.

రోజూలాగే సాయంత్రం పుష్పమాలలతో గుడికి వెళ్లిన అనంతాళ్వార్ గుడిలో వాచిపోయిన గడ్డంతో కనిపించిన శ్రీవారి మూర్తి కనిపిస్తుంది. ఇది చూసి అర్చకులు, స్వామికి గాయమైందని అనుకుంటుండగా, ఆ గాయాన్ని చూసి, వచ్చిన బాలుడు స్వామివారేనని అనంతాళ్వార్ గ్రహించి క్షమించమని ప్రాధేయపడ్డాడు.

అప్పుడు శ్రీనివాసుడు.. అర్చకులకు కలలో కనిపించి.. ‘నేటి నుంచి నా భక్తుడు గునపంతో కొట్టగా ఏర్పడిన ఈ గాయంపై పచ్చకర్పూరపు బొట్టు పెట్టండి. నా భక్తులు నా బొట్టును చూసి, అది అనంతాళ్వార్ అనే భక్తుడు కొట్టిన దెబ్బ అని చెప్పుకుంటుంటే, అది విని నేను మురిసిపోతాను’ అని చెప్పగా నాటి నుంచి శ్రీవారికి రోజూ గడ్డం మీద పచ్చకర్పూరంతో అలంకరిస్తారు.

ధ్వజస్థంభాన్ని దాటగానే వచ్చే గోపురంలో పై భాగాన నేటికీ ఆ ఇనుప గడ్డపార వేలాడుతూ కనిపిస్తుంది. భక్తులు దీనిని గమనించేలా అక్కడ పలు భాషల్లో అనంతాళ్వార్ గడ్డపార అనే బోర్డును పెట్టారు. భక్తులు నేటికీ దీనిని చూసి నమస్కరిస్తుంటారు.

నేడు మనం క్యూ కాంప్లెక్స్ ప్రక్కన చూసే చెరువు, అక్కడి తోట నాడు అనంతాళ్వార్ పెంచినదే. దీని పక్కనే అనంతాళ్వార్ వారి సమాధి కూడా ఉంది.

మహాప్రదక్షిణ మార్గంలో నైఋతి మూలలో ఆయన నివసించిన ఇల్లు, కుటుంబ సభ్యుల చిత్రపటాలున్నాయి. బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక వేడుకల్లో మహాప్రదక్షిణ మార్గంలో స్వామి ఊరేగింపు సాగేటప్పడు, అనంతాళ్వార్ ఇంటి వద్ద ఆగి, కర్పూర హారతి అందుకునే ముందుకు సాగిపోతాడు.

క్రీ.శ 1053లో జన్మించి 84 సంవత్సరాలు జీవించి, సుదీర్ఘకాలం పాటు శ్రీవారి పుష్పకైంకర్యంలో పాల్గొన్న అనంతాళ్వార్ శ్రీవారి భక్తులందరికీ ప్రాతఃస్మరణీయుడు.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×