EPAPER

Shakthi Peethas : ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కొలువై ఉన్న శక్తిపీఠాలు.. వాటి స్థలపురాణాలు ఇవే

Shakthi Peethas : ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కొలువై ఉన్న శక్తిపీఠాలు.. వాటి స్థలపురాణాలు ఇవే

Shakthi Peethas : మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కొలువై ఉన్న శక్తి పీఠాలు ఏంటి? అక్కడ స్థలపురాణం చెబుతున్నదేంటి? ఆ శక్తి పీఠాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం.


శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి ఆలయం. లంకాయాం శాంకరీదేవి అన్నారు మన రుషులు. ప్రస్తుతం ట్రింకోమలీలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. దీని పక్కనే శివాలయం, ఆ మందిరం పక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది.

సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని నమ్మకం. చండీ హోమంతో కామాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాల నగరంగా పేరు గాంచీన కాంచీపురంలో జరిగే ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అనే చెప్పాలి.


అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం ఎక్కడ వుందనే విషయమై పలు అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం బెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రాంతాన్నే ప్రద్యుమ్నంగా భావిస్తున్నారు. శృంఖలాదేవి ఆలయం ఎక్కడ వుండేది సరిగ్గా తెలియడం లేదుగానీ.. కొందరు కలకత్తా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో కొలువుదీరిన అమ్మవారినే శృంఖలామాత అంటున్నారు. ఇంకొంతమంది గంగాసాగర్ లోని ఆదినాధ క్షేత్రం అని.. కొంతమంది గుజరాత్ లోని చోటిల్లా అని, విభిన్న కథనాలున్నాయి. ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు, తిరునాళ్ళు జరుగుతుంటాయి.

శివుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడిపోయి ప్రస్తుత మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని ఓ విశ్వాసం. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు.. దక్షిణ భారతానికే హైలేట్ అని చెప్పాలి. ప్రత్యేక పూజలతో పాటు చాలా గ్రాండ్‌గా వేడుకలను నిర్వహిస్తారు ఇక్కడ.

ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పై కప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఏకవీరికాదేవిగా కోలిచే భక్తులు.. నియమనిష్టలతో ఇక్కడ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు.

ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన ఉజ్జయినీ నవరాత్రీ వేడుకలను చూసేందుకు రెండు కళ్లు చాలవనే చెప్పాలి.

అమ్మవారి నాభిభాగం పడిన ప్రాంతం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో ఉంది. ఇక్కడ గిరిజాదేవిగా అమ్మవారిని కొలుస్తారు స్థానికులు. గిరిజాదేవిని బిరిజాదేవి, విరజాదేవి అని కూడా ఇక్కడ దేవతామూర్తి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతమై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు.

అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది.

అమ్మవారి కుడి చేతి నాలుగువేళ్లు ప్రయాగ అంటే అలహాబాద్‌ ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు.

కశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆక్రమిత కశ్మీర్‌ లో ఉంది. 2005లో వచ్చిన భూకంపం ధాటికి ఈ ఆలయం ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. అమ్మవారి విగ్రహమైతే ఎప్పుడో అదృశ్యమైంది.

అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు.

సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళ గౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.

సతీదేవి చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. కార్తీక మాసంలో ఏ విధంగానైతే ఈ శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుందో.. నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా అదే స్థాయిలో ఇక్కడ వేడుకలను నిర్వహిస్తారు.

ఈ 18 అష్టాదశ శక్తి పీఠాలు మాత్రమే కాదు.. నవరాత్రి వేడుకలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అత్యంత వైభవంగా జరుపుకుంటారు భక్తులు.

Tags

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×