EPAPER

Panchamukha Hanuman : పంచముఖ ఆంజనేయుడి రూపం వెనక కథ ఇదే..!

Panchamukha Hanuman : పంచముఖ ఆంజనేయుడి రూపం వెనక కథ ఇదే..!

Panchamukha Hanuman : తనను మనసులో స్మరించినంత మాత్రానే.. అన్ని కష్టాలనూ తొలిగించే దైవం.. ఆంజనేయుడు. ఆంజనేయుడిని పలు రూపాల్లో మనం ఆరాధిస్తూ ఉంటాము. వీటిలో పంచముఖ ఆంజనేయ స్వరూపం ఒకటి. నిజానికి ఇదేమీ కల్పించిన రూపం కాదు. రామాయణ కాలంలో సాక్షాత్తూ శ్రీరామ చంద్రుడిని రక్షించేందుకు ఆంజనేయుడు ధరించిన విశిష్టరూపమే.. పంచముఖ ఆంజనేయ స్వరూపం. ఈ రూపం విశేషాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే.


రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమని కోరుతూ రాముడి రాయబార ప్రయత్నాలు బెడిసికొట్టిన తర్వాత రామరావణ సంగ్రామం మొదలవుతుంది. రాముడి ప్రతాపం ధాటికి రావణుడి సేనలు నశించిపోవటం మొదలు కాగానే.. అప్పటివరకు రాముడు సాధారణ మానవుడేననే భ్రమలో ఉన్న రావణుడిలో భయం మొదలవుతుంది.

తర్వాత మహావీరుడైన తన కుమారుడు ఇంద్రజిత్తు చనిపోవటంతో ఈ భయం మరింత ఎక్కువవుతుంది. దీంతో.. పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. జిత్తులమారి అయిన మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తాడు. కానీ.. వారి కళ్లుగప్పిన మైరావణుడు.. రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు.


రామలక్ష్మణులను వెతుక్కుంటూ ఆంజనేయుడు కూడా పాతాళానికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్లాక.. మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. అతడిని చూడగానే ఆంజనేయుడిలో ఊహించని రీతిలో వాత్సల్యం కలుగుతుంది. ఇదేమిటని గమనించుకుని, యోగదృష్టితో చూడగా.. ఆ మకర ధ్వజుడు తన కుమారుడని గ్రహిస్తాడు. గతంలో సముద్రం మీదగా ఎగురుతుండగా, తన శరీరం నుంచి పడిన చెమటను స్వీకరించిన ఓ జలకన్య కుమారుడని తెలుసుకుని, ఆ సంగతి చెబుతాడు.

కానీ.. మకరధ్వజుడు తన ఉద్యోగధర్మాన్ని అనుసరించి హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. అతడిని ఓడించి మారుతి.. నేరుగా మైరావణుని రాజ్యంలో అడుగుపెడతాడు. కానీ.. ఒక వాడిని వెలుతురు ఉండగా జయించలేనని అర్థం చేసుకుంటాడు. వెంటనే అతని నగరంలోని నాలుగు దిక్కులు, పైభాగంలో ఉన్న దీపాలన్నీ ఆర్పేసి, పంచముఖ రూపాన్ని ధరించి, తన పది చేతులతో ఖడ్గం, శూలం, గద వంటి పలు ఆయుధాలతో దాడికి దిగి అతడిని సంహరిస్తాడు.

పంచముఖుడైన ఆంజనేయునిలోని 5 ముఖాలు.. పంచభూతాలకు ప్రతీకలు. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×