EPAPER

Tirumala Laddu : తిరుమల లడ్డూ చరిత్ర పెద్దదే..!

Tirumala Laddu : తిరుమల లడ్డూ చరిత్ర పెద్దదే..!
Tirumala Laddu

Tirumala Laddu : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు… అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి నైవేద్య ప్రియుడు కూడా. అందుకే ఆయనకు రోజుకు మూడుసార్లు.. పదికి పైగా ప్రసాదాలను నివేదిస్తుంటారు. అయితే.. లడ్డూకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక భక్తులు కూడా ఆ లడ్డూను అత్యంత పవిత్రమైందిగానే భావిస్తారు. భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. స్వామి వారి లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తే సాక్షాత్తు ఆ శ్రీవారే తమతో వచ్చినట్టు ఉంటుందని భావిస్తారు. ఆ లడ్డూ రవ్వంత దొరికినా.. అదే మహా ప్రసాదం అనుకుని దానిని భక్తితో కళ్లకద్దుకుని నోట్లో వేసుకుంటారు.


తిరుచానూరు, గోవిందరాజస్వామి వారి ఆలయాల్లోని శాసనాలను బట్టి క్రీ.శ.830 నాటికే తిరుమల ఆలయంలో అనేక ప్రసాదాల నివేదనలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక.. ఆలయ అధికారిక రికార్డుల ప్రకారం 1715, ఆగస్ట్ 2న తొలిసారి తిరుమలలో స్వామివారి ప్రసాదాల జాబితాలో లడ్డూ చేరినట్లు తెలుస్తోంది. పురాణ గాథ ప్రకారం.. పద్మావతి అమ్మవారు తన బరువుకు సమానంగా తన స్వహస్తాలతో మొదటగా లడ్డూని తయారీ చేసి వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించారనీ, అలా తన ప్రియసఖి పద్మావతి చేసిన లడ్డూనే ఈ కలియుగాంతం వరకు తన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారని శ్రీవారు అనుగ్రహించారట.

అయితే.. తొలినాళ్లలో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కనుక దూరప్రాంతాల భక్తులు ఎక్కువగా వడ ప్రసాదాన్ని కొనేవారు. దీంతో నాటి ఈస్టిండియా పాలనలోని మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. క్రీ.శ.1843 -.1933 మధ్య కాలంలో తిరుమల ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో తీపి బూంది ప్రసాదాన్ని ‘మనోహరం’ పేరుతో చలామణిలోకి తెచ్చారు. 1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. అప్పట్లో లడ్డూ ఇప్పటి కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది. ధర ఎనిమిదణాలే. చాలా కాలంపాటు రూ.2కే విక్రయించేవారు. అయితే..తొలి తెలుగు వాగ్గేయకారుడైన తాళ్లపాక అన్నమయ్య కీర్తనల్లో లడ్డూ ప్రసాదపు ప్రస్తావనను బట్టి ఆయనకాలంలోనే (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503) తిరుమలలో శ్రీవారికి లడ్డూ ప్రసాదం నివేదించేవారనే వాదనా ఉంది.


1933లో టీటీడీ ఏర్పడ్డాక.. పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నాటి ఆలయ పేష్కార్‌ చెలికాని అన్నారావు లడ్డూలను తయారుచేసే మిరాశీదారులకు.. డబ్బులకు బదులుగా లడ్డూలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం.. శ్రీవారి వంటశాలలో తయారుచేసే ప్రతి 51లడ్డూలకు 11లడ్డూలు మిరాశీదారులకు ఇస్తుండేవారు. అలా రోజుకు 1000 లడ్డూలు చేసేవారు. 1990 నాటికి మిరాసీదారులు రోజుకు లక్ష లడ్డూలు అందించే స్థాయికి వచ్చారు. అయితే.. 1996 మార్చి 16వతేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తిరుమలేశుని ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దవటంతో నాటి నుంచి టీటీడీ సొంత సిబ్బంది సాయంతో పోటులో లడ్డూలు తయారుచేయిస్తోంది. 2014లోనే తిరుమల లడ్డూకు ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’ దక్కింది.

తిరుమలలో రోజుకు సుమారు 3 లక్షల లడ్లు తయారు చేస్తారు. లడ్డూ తయారీకి గతంలో కట్టెల పొయ్యిలు వాడగా, ప్రస్తుతం ఆవిరి పొయ్యిలు వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డు తయారీలో పని చేస్తున్నారు. స్వామి వారి పోటు(వంటశాల) పర్యవేక్షణా బాధ్యతను స్వామివారి తల్లి అయిన.. వకుళమాత స్వయంగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అందుకే నేటికీ పోటులో మంట వేసే ముందు వకుళమాత దేవికి పూజ జరుగుతుంది. ప్రసాదాలన్నీ ముందుగా వకుళమాత ముందు పెట్టి, ఆ తర్వాతే స్వామి వారికి నివేదించటం జరుగుతుంది.

లడ్డూ తయారీలో వాడే పదార్థాల జాబితాను ‘దిట్టం’ అంటారు. ఈ జాబితాలో జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఆవునెయ్యి, శనగపిండి, డ్రైఫ్రూట్స్, చక్కెర, పటికబెల్లం, యాలకుల పెద్ద జాబితానే ఉంది. 1950లో తితిదే ధర్మకర్తల మండలి ఈ దిట్టాన్ని ఖరారు చేసింది. దాదాపు ఐదు శతాబ్ధాల తరువాత 2001లో లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల దిట్టాన్ని సవరించారు. దీని ప్రకారం.. 5,100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. వీటిలో 165 కేజీల ఆవు నెయ్యి, 180 కేజీల శనగపిండి, 400 కేజీల చక్కెర, 4 కేజీల యాలుకలు, 16 కేజీల కిస్‌మిస్, 8 కేజీల కలకండ, 30 కేజీల జీడిపప్పు వాడతారు.

ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. మొదటిది ఆస్థాన లడ్డు. వీటిని ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందజేస్తారు. వీటిని విడిగా అమ్మటం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, జీడిపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి అమోఘం. రెండవది.. కళ్యాణోత్సవ లడ్డు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నవారికి ఒక లడ్డూను ప్రసాదంగా అందిస్తారు. దీని బరువు 700 గ్రాముల బరువుంటుంది. ఇప్పుడు దీనిని ప్రసాదాల కౌంటర్‌లో అందరికీ రూ.200 ధరకు విక్రయిస్తున్నారు. మూడవది.. సాధారణ లడ్డూ. దీని బరువు 160- 180 గ్రాములు. దీనిని ప్రోక్తం లడ్డూ అనీ అంటారు.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×