EPAPER
Kirrak Couples Episode 1

Sankranti Bommala Koluvu : భలే భలే బొమ్మల కొలువు..!

Sankranti Bommala Koluvu : భలే భలే బొమ్మల కొలువు..!
Sankranti Bommala Koluvu

Sankranti Bommala Koluvu : పెద్ద పండుగైన సంక్రాంతిలో కనిపించే మరో విశేషమే.. బొమ్మల కొలువు. సీమాంధ్ర ప్రాంతంలో సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టే సంప్రదాయం ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాలలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సంక్రాంతికీ కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా భూమ్మీదికి వస్తాడు. సంక్రాంతి పురుషునకు నాలుగు ముఖాలు, ఎనిమిది భుజాలు, ఎనిమిది చెవులు, విశాలమైన కళ్ళు, వ్రేలాడే కనుబొమ్మలు, పొడుగాటి ముక్కు ఉంటాయి. ఈయనకే ‘సంకురామయ్య’ అని పేరు. ఉగాది పంచాంగ శ్రవణంలో ఆ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎలా రాబోతున్నాడనే వివరాలుంటాయి. ఆయనను స్వాగతిస్తూ, అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే. ‘నీ చేతిలో బొమ్మలమైన మమ్మల్ని రక్షించే భారం నీదే’ అంటూ ఆ కాలపురుషుడికి విన్నపం చేసేందుకే ఈ బొమ్మల కొలువు అని చెప్పుకుంటారు.


సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు. భోగినాడు పెట్టిన బొమ్మల కొలువును కనుమ రోజు వరకూ కొనసాగిస్తారు. బొమ్మల కొలువంటే.. ఇంట్లోని బొమ్మలను అలంకరించటం కాదు. వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంది. బొమ్మల కొలువు కోసం ప్రత్యేకంగా చెక్కతో 3, 5, 7, 9 మెట్లుండే బల్లను చేయిస్తారు. దీనిని బొమ్మల బల్ల అంటారు. బొమ్మల కొలువు పెట్టేముందు దానిని తీసి శుభ్రం చేసి దాని మీద తెల్లని గుడ్డ కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు తప్ప ఏమీ పెట్టరు. కొందరు ఈ బల్లను బట్టతో చుట్టి భద్రంగా వేరే గదిలో దాచిపెడతారు. సంక్రాంతి రోజు బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి, బొమ్మల బల్ల కడిగి పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి, పడమర లేదా ఉత్తరం ముఖంగా బల్లను నిలుపుతారు. ముందు ఆ రోజులోని మంచి ఘడియల్లో పళ్లెంలో బియ్యం పోసి, తమల పాకు మీద పసుపుతో చేసిన వినాయకుడిని ప్రతిష్టించి, దీపారాధన చేసి, నివేదన చేశాక అసలు బొమ్మల కొలువు పని మొదలవుతుంది.

ఇంటి ఆచారాన్ని బట్టి ఆ ఇంటి ఆడపడుచు చేత పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతుల తొలి బొమ్మను పెట్టిస్తారు. ఏటా బొమ్మల కొలువు కోసం ఒక్క కొత్త బొమ్మనైనా కొంటారు. మొదటి మెట్టుపై.. అంటే అన్నింటికంటే కింది మెట్టుపై ఇళ్ల బొమ్మలు, దేవాలయలు, గోపురాలు, పంట పొలాలు, చెట్లు, పూలతీగలు ఇలా ప్రకృతి సంబంధిత బొమ్మలను నిలుపుతారు. రెండో మెట్టుపై.. చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం సహా పలు జలచరాల బొమ్మలను పెడతారు. మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, తుమ్మెదల బొమ్మలు పెడతారు. ఐదో మెట్టుపై.. జంతువులు, పక్షుల బొమ్మలు, ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు, ఏడవ మెట్టుపై సమాజం కోసం తమ జీవితాలను అర్పించిన బొమ్మలు, 8వ మెట్టుపై అష్టదిక్పాలకులు, నవగ్రహనాయకులు, పంచభూతాల బొమ్మలు పేర్చాలి. అన్నింటి కంటే పైన మెట్టు) మీద త్రిమూర్తులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గోదాదేవి బొమ్మలు పెడతారు.


బొమ్మల కొలువులో వినాయకుడు, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మను తప్పక పెడతారు. ఇక.. వీటితో బాటు పంచాంగం చెబుతున్న బ్రాహ్మణుడి బొమ్మ, పెద్ద ముత్తైదువ బొమ్మ, పచారీ కొట్టు కోమటి, అతని భార్య, బిడ్డను ఎత్తుకున్న తల్లి బొమ్మ, ఆవూ దూడ వంటివి. ఇవిగాక పురాతన కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి. ఈ బొమ్మల కొలువు కోసం ఏటికొప్పాక, కొండపల్లి, నిర్మల్ బొమ్మలను ప్రత్యేకంగా సేకరిస్తారు.

బొమ్మల కొలువు పేర్చేందుకు బంధువులు, ఇరుగుపొరుగు వారిని, పిల్లలను పిలిచి, పూజ చేసి, అరటి పళ్ళు గాని, కొబ్బరి ఉండలు గాని, పప్పు బెల్లాలు, అటుకులూ బెల్లం గాని, సాతాళించిన శనగలు ప్రసాదం పెట్టి హారతి ఇస్తారు. ఈ సమయంలో పిల్లల చేత పాటలు, పద్యాలు పాడిస్తారు. ముత్తైదువలకు తాంబూలం, దానితో బాటు గోదాదేవి బొమ్మను కూడా ఇస్తారు. ఆ బొమ్మలకు మూడు రోజులూ పవళింపు సేవ చేస్తారు. అంటే.. హారతి పూర్తయి, పేరంటాలకు తాంబూలం ఇచ్చాక.. ఏదో ఒక బొమ్మను పడుకోబెట్టి నిద్ర పొమ్మని ఆ గది తలుపులు వేసేస్తారు. మరునాడు పొద్దుటే ఆ బొమ్మకు మేలుకొలుపు పాడి నిద్ర లేపి మరోమారు పూజ చేస్తారు. మూడవ రోజు కనుమ నాడు అర్చన చేసి, ఉద్వాసన పలుకుతారు. ఈ అలవాటు వున్నవారు మానకుండా ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెట్టుకోవాలి.

సహజంగానే బొమ్మలంటే ప్రాణమిచ్చే చిన్నారులకు.. బొమ్మల కొలువు పెట్టటం వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో తెలియని సంగతులు తెలుసుకుంటారు. అంతేకాదు.. బొమ్మల కొలువు చూసేందుకు ఊళ్లోని పిల్లలందరూ కలిసి ఆ కొలువు పెట్టిన ఇంటికి రావటంతో ఎక్కడలేని సందడీ నెలకొంటుంది.

Related News

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Big Stories

×